Skip to content
Opens in a new window
Listen to this chapter • 1:34

[1] నేను నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్య దేవుళ్ళ ఎదుట కూడా నిన్ను కీర్తిస్తాను.

[2] నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.

[3] నేను నిన్ను వేడుకున్న రోజున నువ్వు నాకు జవాబిచ్చావు. నన్ను ధైర్యపరచి నాలో బలం పుట్టించావు.

[4] యెహోవా, భూమిపై ఉన్న రాజులంతా నీ నోటి వెంట వచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు.

[5] యెహోవా మహా బలప్రభావాలు గలవాడని వారు యెహోవా విధానాలను గూర్చి పాటలు పాడతారు.

[6] యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు.

[7] నేను ఆపదల్లో చిక్కుకుని ఉన్నప్పుడు నువ్వు నన్ను బ్రతికిస్తావు. నీ చెయ్యి చాపి నా శత్రువుల క్రోధం నుండి నన్ను రక్షిస్తావు. నీ కుడిచేతి నుండి నాకు సంరక్షణ దొరుకుతుంది.

[8] యెహోవా నా తరపున పని సవ్యంగా జరిగిస్తాడు. యెహోవా, నీ కృప సదాకాలం నిలుస్తుంది. నీ చేతులు చేసిన వాటిని విడిచిపెట్టవద్దు.

కీర్తనలు — Chapters