Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:05

[1] యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను.

[2] నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.

[3] నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.

[4] యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.

[5] నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.

[6] యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.

[7] బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.

[8] యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.

[9] దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.

[10] ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.

[11] యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం.

[12] యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.

[13] అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.

[14] ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.

[15] నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.

[16] నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.

[17] నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.

[18] నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.

[19] నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.

[20] నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.

[21] నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.

[22] దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.

కీర్తనలు — Chapters