[1] యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.
[2] అతని సంతానం భూమిమీద బలవంతులౌతారు. యథార్థవంతుల వంశం దీవెనలు పొందుతారు.
[3] కలిమి, సంపద అతని ఇంట్లో ఉంటాయి. అతని నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
[4] యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.
[5] జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు.
[6] అలాటి వారు ఎన్నటికీ స్థిరంగా ఉండిపోతారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.
[7] అతడు దుర్వార్తకు జడిసి పోడు. అతడు యెహోవాను నమ్ముకుని నిబ్బరంగా ఉంటాడు.
[8] అతని మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువులపై గెలిచేదాకా అతడు భయపడడు.
[9] అతడు ఉదారంగా పేదలకు దానం చేస్తాడు. అతని నీతి నిత్యం నిలిచి ఉంటుంది. అతడు ఘనత పొందుతాడు.
[10] భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.