Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:42

[1] నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.

[2] పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.

[3] నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు.

[4] నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.

[5] సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.

[6] సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.

[7] మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.

[8] అయితే యెహోవా, నువ్వు వాళ్ళను చూసి నవ్వుతావు. అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు.

[9] దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.

[10] నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.

[11] వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు.

[12] వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.

[13] వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యాకోబు సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకూ మనుషులు తెలుసుకునేలా చెయ్యి.

[14] సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.

[15] తిండికోసం అటూ ఇటూ తిరుగుతారు. ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు.

[16] నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.

[17] దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.

కీర్తనలు — Chapters