[1] అయినా వేదనపాలైన దేశంమీద చీకటి నిలవదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను ప్రదేశాన్ని, నఫ్తాలి ప్రదేశాన్ని సిగ్గుపాటు చేశాడు. భవిష్యత్తులో, సముద్రంవైపు యొర్దాను ఇవతల ఉన్న జనాల గలలీ ప్రాంతాన్ని ఆయన గొప్ప చేస్తాడు.
[2] చీకటిలో నడిచే ప్రజకు గొప్ప కాంతి కనిపిస్తుంది. చావునీడ ఉన్న దేశంలో నివసించేవారిమీద వెలుగు ప్రకాశిస్తుంది.
[3] నీవు జనసంఖ్య వృద్ధి చేస్తావు. వారి ఆనందాన్ని హెచ్చిస్తావు. కోతకాలంలో ఉన్న మనుషులలాగా, దోపిడీ సొమ్ము పంచుకొంటూ ఉన్నవాళ్ళలాగా వారు నీ సన్నిధానంలో సంతోషిస్తారు.
[4] మిద్యానువాళ్ళ ఓటమి రోజున జరిగినట్టు నీవు వారిమీది బరువైన కాడిని విరుస్తావు. వారి మెడను కట్టిన కర్రను, వారిని తోలేవాళ్ళ దండాన్ని విరుస్తావు.
[5] యుద్ధధ్వని చేసే సైనికులందరి పాదరక్షలూ, రక్తంలో పొర్లినవారి బట్టలూ నిప్పుపాలై కాలిపోతాయి.
[6] ఎందుకంటే, మనకు శిశువు కలిగాడు, మనకు కుమారుడు ప్రసాదించబడ్డాడు. ఆయన భుజాలమీద రాజ్యభారం ఉంటుంది. ఆయనను “ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలాఢ్యుడైన దేవుడు, అనంత యుగాలకు తండ్రి, శాంతికర్త” అంటారు.
[7] ఆయన రాజ్య విస్తీర్ణానికీ శాంతికీ అంతం అంటూ ఉండదు. ఆయన దావీదు సింహాసనమెక్కి అతడి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అప్పటినుంచి ఎప్పటికీ ఆయన ఆ రాజ్యాన్ని న్యాయం చేత, నిజాయితీ చేత బలపరచి, సుస్థిరం చేస్తాడు. సేనలప్రభువు యెహోవా అత్యాసక్తిపరుడై దీనిని సాధిస్తాడు.
[8] యాకోబువంశానికి వ్యతిరేకంగా ప్రభువు సందేశం పంపాడు. అది ఇస్రాయేల్‌కు వర్తిస్తుంది.
[9] ఎఫ్రాయింవారు, షోమ్రోను నివాసులు, ప్రజలు అందరూ అది తెలుసుకోవాలి. వారు విర్రవీగి గర్వంతో ఇలా చెప్పుకొంటున్నారు:
[10] “ఇటికలతో కట్టినది కూలింది, చెక్కిన రాళ్ళతో నిర్మిస్తాం. మేడిచెట్లు నరికివేయబడ్డాయి, వాటికి బదులు దేవదారు చెట్లను నాటిస్తాం.”
[11] అయితే యెహోవా వారికి వ్యతిరేకంగా రెజీన్‌రాజు శత్రువులను బలపరచాడు, అతడి పగవాళ్ళను రేపుతున్నాడు.
[12] తూర్పున సిరియనులు, పడమట ఫిలిష్తీయవాళ్ళు నోరు బాగా తెరచి ఇస్రాయేల్‌ను దిగమ్రింగివేశారు. అయినా దీనితో యెహోవా కోపం చల్లారలేదు. ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.
[13] అయినా ప్రజలు తమను దెబ్బ తీసిన ఆయనవైపు తిరగలేదు. సేనలప్రభువు యెహోవాను వెదకలేదు.
[14] అందుచేత యెహోవా ఇస్రాయేల్‌లోనుంచి ఒకే రోజున తలనూ తోకనూ, తాటి కమ్మనూ జమ్మిరెల్లునూ కొట్టివేస్తాడు.
[15] తల అంటే పెద్దలూ ఘనులూ, తోక అంటే అబద్ధాలాడే ప్రవక్తలు.
[16] ఈ ప్రజల నాయకులు వారిని త్రోవ తప్పిస్తూ ఉన్నారు. ఆ నాయకులను అనుసరించేవారు నశించిపోతున్నారు.
[17] వాళ్ళంతా భక్తిలేనివాళ్ళు, దుర్మార్గులు. ప్రతి నోటిలోనుంచీ దుర్భాషలు వెలువడుతాయి, కనుక వాళ్ళ యువకులంటే ప్రభువుకు సంతోషం లేదు, వారిలో అనాథలు, వితంతువులంటే జాలి లేదు. అయినా దీనితో ఆయన కోపం చల్లారలేదు. ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.
[18] చెడుగు మంటలాగా మండుతుంది. అది ముండ్ల చెట్లనూ కంటకాలనూ కాల్చివేస్తుంది. దానివల్ల అడవిలో దట్టమైన పొదలు తగులబడుతాయి. అది పొగలాగా స్తంభంలాగా పైకి లేస్తూ ఉంది.
[19] సేనలప్రభువు యెహోవా కుమ్మరించిన కోపాగ్నివల్ల దేశం కాలిపోతూ ఉంది. ప్రజలు మంటలకు కట్టెలలాగా ఉన్నారు. వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి కరుణించడు.
[20] కుడి ప్రక్కన ఉన్నదానిని దిగమ్రింగివేస్తారు గాని, ఇంకా ఆకలితో ఉంటారు. ఎడమ ప్రక్కన ఉన్నదానిని తింటారు గాని, తృప్తిపడరు. వారిలో ప్రతి ఒక్కరూ తమ హస్తాన్ని తామే తింటారు.
[21] మనష్షే ఎఫ్రాయింను, ఎఫ్రాయిం మనష్షేను దిగమ్రింగివేస్తారు. తరువాత ఒక్కుమ్మడిగా యూదామీద పడుతారు. అయినా దానితో యెహోవా కోపం చల్లారలేదు. ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.