Skip to content
Opens in a new window

[1] సీయోను నీతినిజాయితీ ఉదయ కాంతిలాగా కనబడేవరకు, దాని రక్షణ మండుతున్న దివిటీలాగా వెలిగేవరకు సీయోను పక్షంగా నేను మౌనం వహించను, జెరుసలంకోసం ఊరుకోను.

[2] ఇతర జనాలు నీ నీతినిజాయితీని చూస్తారు. రాజులందరూ నీ శోభను చూస్తారు. నీకు క్రొత్త పేరు పెట్టడం జరుగుతుంది. ఆ పేరు యెహోవా తానే తెలియజేస్తాడు.

[3] నీవు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా, నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు.

[4] అప్పటినుంచి నీవు విడవబడ్డదానివని ఎవరూ అనరు. పాడైనదని నీ దేశాన్ని గురించి అనరు. నిన్ను “హెఫ్సీబా” అంటారు. నీ దేశాన్ని “బ్యూలా” అంటారు ఎందుకంటే, నీవంటే యెహోవాకు చాలా ఇష్టం. నీ దేశం వివాహితమవుతుంది.

[5] యువకుడు కన్యను పెళ్ళి చేసుకొనేవిధంగా నీ కొడుకులు నిన్ను పెళ్ళి చేసుకొంటారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురును చూచి సంతోషించే ప్రకారం నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు.

[6] జెరుసలం! నీ గోడలమీద నేను కావలివారిని ఉంచాను. రాత్రి గానీ పగలు గానీ వారు మౌనం వహించరు. యెహోవాను ప్రార్థించేవారలారా! ఎప్పుడూ విశ్రమించవద్దు.

[7] ఆయన జెరుసలంను సుస్థిరం చేసేవరకూ, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించేవరకూ ఆయనను విశ్రమించనియ్యవద్దు.

[8] తన కుడి చెయ్యితోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు: “నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇంక ఎన్నడూ ఇవ్వను. నీవు కష్టించి తీసిన ద్రాక్షరసాన్ని విదేశీయులు పట్టుకొని త్రాగరు.

[9] కోత కోసినవారే దానిని తింటారు, యెహోవాను స్తుతిస్తారు. ద్రాక్షపండ్లు కోసినవారే నా పవిత్రాలయ ఆవరణాలలో వాటి రసం త్రాగుతారు.”

[10] సింహ ద్వారాల గుండా రండి! రండి! జనాలకు త్రోవను సిద్ధం చేయండి. రాజమార్గాన్ని ఎత్తుగా చేయండి, ఎత్తుగా చేయండి. రాళ్ళను ఏరి పారవేయండి. జనాలకు పతాకమెత్తండి.

[11] యెహోవా భూమి మీద కొనలవరకు ఇలా చాటింపు చేశాడు: “సీయోను కుమార్తెకు ఈవిధంగా చెప్పు: ఇదిగో నీకు చెందే విముక్తి వస్తూ ఉంది. దానిని తెచ్చేవాని దగ్గర బహుమానాలున్నాయి. ప్రతిఫలం ఆయనతో కూడా వస్తుంది.”

[12] వారికి పవిత్ర ప్రజలనీ యెహోవా విడుదల చేసినవారనీ పేరు వస్తుంది. నిన్ను కోరతగినదానివీ, విడవబడని నగరానివీ అంటారు.

యెషయా — Chapters