[1] యూదా, జెరుసలం విషయం ఆమోజు కొడుకు యెషయా దర్శనం మూలంగా చూచిన విషయం ఇది:
[2] చివరి రోజులలో యెహోవా ఆలయ పర్వతం పర్వతాలన్నిటిలో ప్రధానమైనదిగా సుస్థిరమవుతుంది. కొండలకంటే ఎత్తుగా ఉంటుంది. అన్ని దేశాలవారు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
[3] ఆ కాలంలో అనేక జనాలు వచ్చి ఇలా అంటారు: “యెహోవా పర్వతమెక్కి యాకోబుయొక్క దేవుని ఆలయానికి వెళ్దాం, రండి. ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. మనం ఆయన త్రోవల్లో నడుచుకుంటాం.” సీయోనులోనుంచి ఉపదేశం, జెరుసలంలోనుంచి యెహోవా వాక్కు వెలువడుతాయి.
[4] ఆయన జనాలకు మధ్యవర్తిగా న్యాయం తీరుస్తాడు. అనేక జనాలకు వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ ఖడ్గాలను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొట్టివేస్తారు. జనంమీదికి జనం ఖడ్గం ఎత్తకుండా ఉంటారు, యుద్ధం చేయడం ఇకనుంచి నేర్చుకోరు.
[5] యాకోబు వంశంవారలారా, రండి! మనం యెహోవా వెలుగులో నడుచుకొందాం.
[6] యాకోబు వంశమైన నీ ప్రజలమధ్య అంతటా తూర్పు నుంచి వచ్చిన మూఢ విశ్వాసం ఉంది. వారు ఫిలిష్తీయవాళ్ళలాగా మంత్ర ప్రయోగం చేస్తారు, విదేశీయులతో ఒక చేయిగా ఉన్నారు, గనుక నీవు వారిని విసర్జించావు.
[7] వారి దేశం నిండా వెండి బంగారాలు ఉన్నాయి. వారి సంపత్తుకు అంతు లేదు. వారి దేశం నిండా గుర్రాలున్నాయి. వారి రథాలు అపరిమితం.
[8] వారి దేశంనిండా విగ్రహాలున్నాయి. తమ చేతులతో చేసిన పనికి, వ్రేళ్ళతో చేసినదానికి మ్రొక్కుతారు.
[9] మనుషులను అణగదొక్కడం, ప్రజలను తగ్గించడం జరుగుతుంది. వారిని క్షమించవద్దు.
[10] యెహోవా భయం కారణంగా, ఆయన మహిమ వైభవంనుంచి బండల సందులలోకి వెళ్లండి! మట్టిలో దాక్కోండి!
[11] మనుషుల గర్వం గల చూపులను అణగద్రొక్కడం, మనిషి అహంభావాన్ని తగ్గించడం జరుగుతుంది. ఆ రోజు యెహోవాకే ఘనత ఉంటుంది.
[12] సమస్తమైన అహంభావానికీ గర్వానికీ మిడిసిపాటుకూ తీర్పు తీర్చే రోజును సేనలప్రభువు యెహోవా నియమించాడు. అవి అణగారిపోతాయి.
[13] ఆ రోజును గర్వంతో మిడిసిపడే లెబానోను దేవదారు చెట్లన్నిటికీ, బాషాను సిందూర వృక్షాలన్నిటికీ,
[14] ఉన్నత పర్వతాలన్నిటికీ, ఎత్తయిన కొండలన్నిటికీ,
[15] పొడుగైన ప్రతి గోపురానికీ, కోట ఉన్న ప్రతి ప్రాకారానికీ,
[16] తర్‌షీషు ఓడలన్నిటికీ, అందమైన వస్తువులన్నిటికీ నియమించాడు.
[17] అప్పుడు మనిషి అహంభావం క్రుంగిపోతుంది, మానవ గర్వం అణగారిపోతుంది. ఆ రోజు యెహోవాకే ఘనత ఉంటుంది.
[18] అప్పుడు విగ్రహాలు లేకుండా పోతాయి.
[19] భూమిని వణకించడానికి యెహోవా నిలబడేటప్పుడు ఆయనకు భయపడి ఆయన మహిమ వైభవంనుంచి మనుషులు కొండల గుహలలో దూరుతారు, నేల బొరియలలోకి వెళ్తారు.
[20] ఆ రోజున మనుషులు పూజకోసం చేసుకొన్న వెండి విగ్రహాలనూ బంగారు విగ్రహాలనూ ఎలుకలకూ గబ్బిలాలకూ పారవేస్తారు.
[21] భూమిని వణకించడానికి యెహోవా నిలబడేటప్పుడు ఆయనకు భయపడి ఆయన మహిమ వైభవంనుంచి వాళ్ళు కొండల గుహలలోకి బండల బీటలలోకి వెళ్తారు.
[22] మనిషిమీద నమ్మకం పెట్టడం మానుకోండి. అతడి ముక్కుపుటాలలోనే అతడి ప్రాణం ఉంది. అతడు ఎంతటివాడు?