[1] “నీతినిజాయితీని అనుసరిస్తూ యెహోవాను వెదకుతూ ఉండేవారలారా, నేను చెప్పేది వినండి. మీరు ఏ బండనుంచి చెక్కబడ్డారో దానివైపు చూడండి. ఏ రాళ్ళ గనిలోనుంచి త్రవ్వబడ్డారో దానివైపు చూడండి.
[2] మీ పూర్వీకుడు అబ్రాహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కన్న శారాను ఆలోచించండి. నేను అబ్రాహామును పిలిచినప్పుడు అతడు ఒక్కడే. అతణ్ణి దీవించి, అతణ్ణి అనేకులనుగా చేశాను.
[3] యెహోవా సీయోనును ఆదరించి తీరుతాడు. దాని పాడైన స్థలాలన్నిటినీ ఆదుకొంటాడు. దాని ఎడారి ప్రదేశాన్ని ఏదెను తోటలాగా చేస్తాడు. దాని ఎండిపోయిన ప్రాంతాన్ని ఆయన యెహోవా వనంలాగా చేస్తాడు. దానిలో ఆనందం, సంతోషం ఉంటాయి. కృతజ్ఞతావాక్కులు, సంగీతనాదం వినబడుతాయి.
[4] “నా ప్రజలారా, నేను చెప్పేది ఆలకించండి. నా జనమా, నాకు చెవియొగ్గి వినండి. ఉపదేశం నానుంచి బయలుదేరుతుంది. నా న్యాయం జనాలకు వెలుగుగా ఉండేలా చేస్తాను.
[5] నా నీతి నిజాయితీ సమీపిస్తూ ఉన్నాయి. నా రక్షణ బయలుదేరివుంది. నా చేయి జనాలకు న్యాయం జరిగిస్తుంది. ద్వీపవాసులు నావైపు చూస్తూ నా చేతికోసం నమ్మకంతో ఎదురుచూస్తారు.
[6] ఆకాశాలవైపు తలెత్తి చూడండి. క్రింద భూమిని చూడండి. ఆకాశాలు పొగలాగా అంతర్థానమౌతాయి. భూమి బట్టలాగా పాతగిలిపోతుంది. దాని నివాసులు దోమలలాగా చచ్చిపోతారు. అయితే నా రక్షణ శాశ్వతంగా ఉంటుంది. నా నీతినిజాయితీకి అంతం అంటూ ఉండదు.
[7] నీతినిజాయితీ అంటే ఏమిటో తెలిసినవారలారా, నేను చెప్పేది వినండి. నా ధర్మశాస్త్రం హృదయాలలో ఉంచుకొన్న మీరు ఆలకించండి. మనుషులు వేసే నిందలకు భయపడకండి. వాళ్ళ దూషణకు హడలిపోకండి.
[8] చిమ్మట బట్టను కొరికివేసే విధంగా వాళ్ళను కొరికివేస్తుంది. పురుగు ఉన్నిని కొరికివేసే విధంగా వారిని కొరికివేస్తుంది. అయితే నా నీతినిజాయితీ శాశ్వతంగా నిలుస్తాయి. నా రక్షణ తరతరాలకూ ఉంటుంది.”
[9] యెహోవా హస్తమా! లే! లే! బలం తొడుక్కో! పూర్వకాలంలో, చాలాకాలం క్రిందట ఉన్న తరాలలో లేచినట్టు లే! రాహాబు అనే బ్రహ్మాండమైన ప్రాణిని పొడిచి ముక్కలు చేసినది నీవే గదా!
[10] చాలా లోతైన నీళ్ళున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసినది నీవే గదా! విడుదల పొందినవారు దాటిపోయేలా సముద్రం లోతులో త్రోవను చేసినది నీవే గదా!
[11] యెహోవా వెల ఇచ్చి విడిపించినవారు పాటలు పాడుతూ సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద శాశ్వతానందం ఉంటుంది. సంతోషానందాలు వారికి ప్రక్కతోడుగా ఉంటాయి. దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి.
[12] “నేను – నేనే – మిమ్మల్ని ఓదార్చేవాణ్ణి. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడుతున్నారు?
[13] ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన నీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న హింసకుల కోపానికి ఎడతెగకుండా ప్రతిరోజూ మీరెందుకు భయపడుతున్నారు? హింసకుల కోపం ఏమయింది?
[14] కృంగిపోయిన బందీలు త్వరలో విడుదల అవుతారు. చెరసాలలో చనిపోరు. వారికి ఆహారం లేకుండా పోదు.
[15] నేను యెహోవాను, నీ దేవుణ్ణి. దాని అలలు ఘోషించేలా సముద్రాన్ని రేపేవాణ్ణి నేనే. నా పేరు సేనలప్రభువు యెహోవా.
[16] నేను ఆకాశాలను సుస్థిరం చేసినవాణ్ణి. భూమి పునాదులు వేసినవాణ్ణి. నా ప్రజలు నీవేయని సీయోనుతో చెప్పాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను.”
[17] జెరుసలం! మేల్కో! మేల్కో! యెహోవా కోపంతో నిండినపాత్రను ఆయన చేతినుంచి తీసుకొని త్రాగిన నగరమా! మనుషులను తూలేందుకు చేసే ఆ పాత్రలోది అంతా త్రాగినదానా! లే!
[18] ఆమె కన్న కొడుకులందరిలో ఆమెకు దారిచూపేవాడు ఎవ్వడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చేయి తన చేతిలో తీసుకొనేవాడెవ్వడూ లేడు.
[19] ఈ రెండు విపత్తులు నీమీదికి వచ్చాయి. నిన్ను ఓదార్చగల వాడెక్కడ ఉన్నాడు? ధ్వంసం, నాశనం నీకు సంభవించాయి. కరవు, ఖడ్గం నీమీదికి వచ్చాయి. నేను నిన్ను ఏ విధంగా ఓదార్చగలను?
[20] నీ కొడుకులు మూర్ఛపోయారు. అన్ని వీధుల చివరలలో వారు పడి ఉన్నారు. వలలో చిక్కుపడ్డ జింకలలాగా ఉన్నారు. యెహోవా కోపంతో, నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
[21] అందుచేత, ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడేదానా, ఈ మాట విను:
[22] నీ ప్రభువైన యెహోవా, తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు చెప్పేదేమిటంటే, “ఇదిగో, నిన్ను తూలేందుకు చేసే పాత్రను, నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. దానిలోది నీవింకా ఎన్నడూ త్రాగవు.
[23] నిన్ను బాధించేవాళ్ళ చేతిలోనే దానిని ఉంచుతాను. ‘మేము నీమీద నడిచిపోతాం – సాష్టాంగపడు’ అని వాళ్ళు చెప్పారు. నీవు వాళ్ళకు నీ వీపును నేలకు వంచి వీధిలాగా దానిమీద వారిని దాటిపోనిచ్చావు. నేను వాళ్ళే ఆ పాత్రలోది త్రాగేలా చేస్తాను.”