Skip to content
Opens in a new window

[1] ఎడారి, మెట్ట ప్రదేశం సంతోషిస్తాయి. ఎండిన భూమి ఉత్సాహం కలిగి కస్తూరి పూలు పూస్తుంది.

[2] అది అమితంగా పూస్తుంది. ఉత్సాహం కలిగి ఆనంద ధ్వనులు చేస్తుంది. లెబానోను శోభ దానికి కలుగుతుంది. కర్మెల్, షారోను ప్రాంతాల అందం దానికి ఉంటుంది. యెహోవా ఘనత, మన దేవుని తేజస్సు వాటికి కనబడుతాయి.

[3] సడలిన చేతులను బలపరచండి, వణకుతూ ఉన్న మోకాళ్ళను దృఢపరచండి.

[4] పిరికివారితో ఇలా అనండి: “భయపడకండి. ధైర్యంగా ఉండండి. ప్రతీకారం చేయడానికి మీ దేవుడు వస్తాడు. దైవిక ప్రతీకారం చేయడానికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”

[5] అప్పుడు గుడ్డివారి కళ్ళను తెరవడం, చెవిటివారి చెవులను విప్పడం జరుగుతుంది.

[6] కుంటివాడు జింకలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక ఆనంద గీతాలు పాడుతుంది. ఎడారిలో నీళ్ళు పెల్లుబుకుతాయి. ఎండిన ప్రాంతంలో ప్రవాహాలు పారుతాయి.

[7] కమిలిపోయిన భూమి మడుగు అవుతుంది. ఎండిన స్థలాలు నీటి బుగ్గలవుతాయి. ఒకప్పుడు నక్కలు పడుకొన్న చోట్లలో, వాటికి ఉనికిపట్టుగా ఉన్న చోట్లలో గడ్డి, తుంగ, జమ్మిరెల్లు పెరుగుతాయి.

[8] అక్కడ ఒక దారి – రాజమార్గం – ఉంటుంది. దానిని “పవిత్ర మార్గం” అంటారు. అది అశుద్ధులు ప్రయాణం చేయకూడని మార్గం. అది ఆ మార్గంలో నడిచేవారికోసమే. తెలివితక్కువవారు కూడా అందులో త్రోవ తప్పరు.

[9] అక్కడ సింహం ఉండదు. దుష్టమృగాలు దానిని ఎక్కవు. అక్కడ కనిపించవు. విముక్తి పొందినవారే అక్కడ నడుస్తారు.

[10] యెహోవా వెల ఇచ్చి విడుదల చేసినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు. వారి తలలమీద శాశ్వతానందం ఉంటుంది. సంతోషానందాలు వారికి తోడుగా ఉంటాయి. దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి.

యెషయా — Chapters