[1] తూరు నగరం విషయం దేవోక్తి: తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి! తూరు పాడైపోయింది. దానికి ఇల్లు లేదు, రేవు లేదు. కిత్తీందేశంనుంచి ఆ మాట వాళ్ళకు వచ్చింది.
[2] సముద్రం తీరవాసులారా! సీదోను పట్టణం వర్తకులారా! నివ్వెరపడండి! సముద్రం దాటుతూ ఉండేవాళ్ళు తమ సరుకుతో నిన్ను నింపారు.
[3] షీహోరు నది ధాన్యం, నైలునది పంటలు మహా సముద్రంమీద నీలోకి తెచ్చారు. తూరు జనాలకు బజారుగా ఉంది.
[4] సీదోను! సిగ్గుపడు! సముద్రం, సముద్ర దుర్గం ఇలా మాట్లాడుతూ ఉంది: “నాకు కాన్పునొప్పులు రాలేదు, పిల్లలూ కలగలేదు. నేను కొడుకులను పోషించలేదు, కన్యలను పెంచలేదు.”
[5] తూరును గురించిన మాట ఈజిప్ట్‌కు చేరేటప్పుడు వాళ్ళు దాని విషయం మనోవేదన పడుతారు.
[6] సముద్ర తీర వాసులారా! తర్షీషుకు దాటిపోండి! పెడ బొబ్బలు పెట్టండి!
[7] మీకు సంతోషం కలిగించే నగరం ఇదేనా? చాలా కాలంనుంచి ఉన్న నగరమిదేనా? ఇతర దేశాలలో కాపురం చేయడానికి దూర ప్రయాణాలు చేసినదిదేనా?
[8] తూరు కిరీటాలు ఇచ్చే నగరం. దాని వర్తకులు ప్రముఖులు. దాని వ్యాపారస్తులు లోకంలో ఘనులు. దానికి వ్యతిరేకంగా అలా నిర్ణయించినదెవరు?
[9] సేనలప్రభువు యెహోవా అలా నిర్ణయించాడు. అందం తాలూకు సమస్త గర్వాన్ని హీనదశకు రప్పించాలనీ భూమిమీద ఉన్న ఘనులందరికీ తలవంపులు తేవాలనీ ఆయన ఉద్దేశం.
[10] తర్షీషు కుమారీ! నీ దేశానికి ఇంకా నిర్బంధం లేదు. నైలు నదిలాగా దానిమీదికి ప్రవాహం వచ్చిపడుతుంది.
[11] యెహోవా సముద్రంమీద చెయ్యి చాపాడు, రాజ్యాలను వణికించాడు. కనాను కోటలను నాశనం చేయాలని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు.
[12] ఆయన అన్నాడు, “దౌర్జన్యానికి గురి అయిన సీదోను కన్యా! నీకు ఇంకా సంతోషం ఉండదు. లేచి కిత్తీం ద్వీపానికి దాటిపో! అయితే అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.”
[13] ఇదిగో! కల్దీయవాళ్ళ దేశం చూడు. వాళ్ళు జనంగా లేకపోయారు. అష్షూరువాళ్ళు దానిని ఎడారి జంతువులకు ఉనికిపట్టుగా చేశారు. వాళ్ళు ముట్టడి గోపురాలు కట్టి, దాని భవనాలను పడగొట్టారు. ఆ దేశాన్ని పాడు చేశారు.
[14] తర్షీషు ఓడలారా! పెడ బొబ్బలు పెట్టండి! మీ కోట నాశనం అయింది.
[15] ఆ కాలంలో తూరును డెబ్భై సంవత్సరాలు – ఒక రాజు జీవితకాలం – మరవడం జరుగుతుంది. డెబ్భై ఏళ్ళయ్యాక, వేశ్యను గురించిన పాటలో ఉన్నట్టు జరుగుతుంది. ఏమిటంటే,
[16] “మరవబడ్డ వేశ్యా! తంతివాద్యం తీసుకొని నగరంలో తిరుగులాడు. నీవు జ్ఞప్తికి వచ్చేలా బాగా వాయించు, పాటలెన్నైనా పాడు.”
[17] ఆ డెబ్భై సంవత్సరాలయ్యాక, యెహోవా తూరు విషయం మళ్ళీ విచారిస్తాడు. అది తన జీతం మళ్ళీ సంపాదించుకోవాలని భూమిమీద ఉన్న లోక రాజ్యాలన్నిటితో వేశ్యలాగా వ్యవహరించసాగుతుంది.
[18] అయితే దాని జీతం, దాని వర్తక లాభం యెహోవాకు అంకితం అవుతుంది. దానిని పోగు చేయడం, జమ చేయడం జరగదు. ఆ లాభం యెహోవా సన్నిధానంలో నివసించేవారి ఆహార సమృద్ధి కోసం, మేలిరకం బట్టలకోసం చేకూరుతుంది.