[1] ఆ రోజున యెహోవా తన ఖడ్గం పట్టుకొంటాడు. ఆ ఖడ్గం గట్టిది, గొప్పది, బలమైనది. “లివయాటాన్”ను – పలాయనమౌతున్న ఆ సర్పాన్ని ఆయన దండిస్తాడు. ఆ వంకర సర్పాన్ని – ఆ బ్రహ్మాండమైన సముద్రప్రాణిని చంపుతాడు.
[2] ఆ రోజున ఫలవంతమైన ద్రాక్షతోట విషయం పాట పాడండి.
[3] “నేను – యెహోవాను – దానిని కాపాడుతున్నాను. ప్రతి క్షణమూ దానికి నీళ్ళు పోస్తూ ఉన్నాను. ఎవ్వడూ దానికి హాని చేయకుండా రాత్రింబగళ్ళు నేను దానిని కావలి కాస్తూ ఉన్నాను.
[4] ఇప్పుడు నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు, ముండ్లచెట్లు నాకు ఎదురుపడితే వాటిమీద యుద్ధం జరిగించి వాటిని కాల్చివేసితీరుతాను.
[5] లేదా, వాళ్ళు నన్ను ఆశ్రయించాలి. నాతో సమాధానపడాలి. అవును, వాళ్ళు నాతో సమాధానపడాలి.”
[6] వచ్చే రోజుల్లో యాకోబు వంశం వేరుపారుతుంది. ఇస్రాయేల్‌జనం మొగ్గలు వేసి వికసిస్తుంది.
[7] వారిని కొట్టినవాళ్ళను యెహోవా కొట్టిన విధంగా ఆయన వారిని కొట్టాడా? వారిని చంపినవాళ్ళను ఆయన చంపేవిధంగా వారిని చంపాడా?
[8] నీవు ఆ జనాన్ని వెళ్ళగొట్టడంవల్ల మితంగా దానితో పోరాడావు. తూర్పు గాలి వీచే విధంగా తన తీవ్రమైన గాలిచేత దానిని తొలగించావు.
[9] యాకోబు వంశంవారి అపరాధానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేయడం జరుగుతుంది – ఇది వారి పాపపరిహారంయొక్క ఫలం. సీమసున్నం రాళ్ళను చూర్ణం చేసినట్టు వాళ్ళు తమ బలిపీఠం రాళ్ళన్నిటినీ చూర్ణం చేస్తారు. అప్పుడు ఆషేరాదేవి స్తంభాలు, ధూపవేదికలు మిగిలి ఉండవు.
[10] ఇప్పుడు ప్రాకారాలున్న నగరం నిర్జనంగా ఉంది. విసర్జించిన నివాసస్థలంలాగా, విడిచిపెట్టిన ఎడారి ప్రాంతంలాగా ఉంది. అక్కడ దూడలు మేస్తూ, పడుకొంటూ, దాని చెట్లకొమ్మలను తింటూ ఉన్నాయి.
[11] దాని రెమ్మలు ఎండిపోయి విరిగిపొయ్యాయి. స్త్రీలు వచ్చి వాటిని నిప్పులో వేస్తారు. ఈ ప్రజలు తెలివైనవారు కారు. వారి సృష్టికర్త వారిమీద జాలి చూపడు. వారిని కలగజేసినవాడు వారిమీద దయ చూపడు.
[12] ఆ రోజున యెహోవా పారుతూ ఉన్న యూఫ్రటీసు నది నుంచి ఈజిప్ట్ వాగు వరకు నూరుస్తాడు. ఇస్రాయేల్ ప్రజలారా! మిమ్మల్ని ఒక్కొక్కరిని సమకూర్చడం జరుగుతుంది.
[13] ఆ రోజున గొప్ప బూర ఊదడం జరుగుతుంది. అష్షూరులో నశించిపోతున్నవారు, దేశభ్రష్టులై ఈజిప్ట్‌లో ఉన్నవారు వస్తారు, జెరుసలంలో పవిత్ర పర్వతంమీద యెహోవాను ఆరాధిస్తారు.