[1] యెష్షయి యొక్క మొద్దునుంచి చిగురు మొలుస్తుంది. అతడి వేరులనుంచి కొమ్మ పెరిగి ఫలిస్తుంది.
[2] ఆయనమీద యెహోవా ఆత్మ నిలిచి ఉంటాడు. ఆ ఆత్మ జ్ఞాన వివేకాలిచ్చే ఆత్మ; ఆలోచన, బలం ఇచ్చే ఆత్మ; తెలివి, యెహోవా పట్ల భయభక్తులిచ్చే ఆత్మ.
[3] యెహోవాపట్ల భయభక్తులంటే ఆయనకు ఎంతో ఇష్టం ఉంటుంది. తన కంటికి కనిపించేదానిని బట్టి ఆయన తీర్పు తీర్చడు. తన చెవులు విన్నదానిని బట్టి నిర్ణయానికి రాడు.
[4] నీతి నిజాయితీతో బీదలకు న్యాయం చేకూరుస్తాడు. లోకంలో ఉన్న దీనులకు పక్షపాతం లేకుండా నిర్ణయాలు చేస్తాడు. ఆయన వాక్కు దండంలాంటిదై లోకాన్ని మొత్తుతుంది. తన పెదవుల ఊపిరిచేత ఆయన దుర్మార్గులను చంపుతాడు.
[5] ఆయన నడుముకు న్యాయం, ఆయన మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి.
[6] అప్పుడు తోడేళ్ళు, గొర్రెపిల్లలు కలిసిమెలిసి ఉంటాయి. చిరుతపులులు మేకపిల్లల దగ్గర పడుకొంటాయి. దూడలు, కొదమ సింహాలు, కొవ్విన కోడెలు దగ్గర దగ్గరగా ఉంటాయి. చిన్నపిల్లవాడు వాటిని తోలుకుపోతాడు.
[7] ఆవులు, ఎలుగుబంట్లు కలిసి మేస్తాయి. వాటి పిల్లలు ఒకే చోట పడుకొంటాయి. సింహం ఎద్దులాగా గడ్డి మేస్తుంది.
[8] చంటిపిల్ల నాగుపాము పుట్టదగ్గర ఆటలాడుతుంది. పాలు విడిచిన చిన్న పిల్ల కట్లపాము పుట్టమీద చెయ్యి ఉంచుతుంది.
[9] నా పవిత్రమైన కొండ అంతట్లో ఏదీ హాని చేయదు, నాశనం చేయదు. సముద్రం నీళ్ళతో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
[10] ఆ కాలంలో యెష్షయియొక్క ‘వేరు’ ప్రజలకు జెండాగా నిలుస్తాడు. జనాలు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన విశ్రాంతి స్థలం దివ్యంగా ఉంటుంది.
[11] ఆ కాలంలో యెహోవా తన ప్రజలో మిగిలినవారిని రెండో సారి విడిపించడానికి తన చెయ్యి చాపుతాడు; అష్షూరునుంచీ ఈజిప్ట్‌నుంచీ పత్రోస్‌నుంచీ కూషునుంచీ ఏలాంనుంచీ షీనారునుంచీ హమాతునుంచీ సముద్ర ద్వీపాలనుంచీ వారిని విడిపించి తీసుకువస్తాడు.
[12] ఆయన జనాలకు పతాకం ఎత్తుతాడు, దేశభ్రష్టులైపోయిన ఇస్రాయేల్‌ప్రజలను సమకూరుస్తాడు. భూమి నాలుగు దిక్కులనుంచి చెదరిపోయిన యూదావారిని సమకూరుస్తాడు.
[13] అప్పుడు ఎఫ్రాయింవారికి ఉన్న అసూయ పోతుంది. యూదావారి పగవాళ్ళు నిర్మూలం అవుతారు. యూదా అంటే ఎఫ్రాయింవారికి అసూయ ఉండదు, ఎఫ్రాయిం అంటే యూదావారికి పగ ఉండదు.
[14] వారు ఫిలిష్తీయవాళ్ళ ఏటవాలుగా ఉన్న పడమటి ప్రాంతాలమీదికి ఎగసిపోతారు. ఎఫ్రాయిం, యూదా కలిసి తూర్పు జనాన్ని దోచుకొంటారు. ఎదోం దేశాన్ని, మోయాబు దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. అమ్మోనువాళ్ళు వారికి లొంగిపోతారు.
[15] యెహోవా ఈజిప్ట్ సముద్రం అఖాతాన్ని నిర్మూలం చేస్తాడు. యూఫ్రటీసు నది మీద చెయ్యి ఆడించి వడగాలి వీచేలా చేస్తాడు. దానిని కొట్టి ఏడు పాయలుగా చేస్తాడు. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటగలిగేట్టు అలా చేస్తాడు.
[16] ఈజిప్ట్‌దేశంనుంచి ఇస్రాయేల్‌ప్రజలు వచ్చినప్పుడు వారికి దారి కలిగినట్టు, అష్షూరునుంచి ఆయన ప్రజలలో మిగిలినవారు వచ్చేటప్పుడు వారికి రాజమార్గం ఉంటుంది.