Skip to content
Opens in a new window

[1] ఇదిగో, వినండి! ఒక రాజు ధర్మసమ్మతంగా రాజ్యపరిపాలన చేస్తాడు. అధికారులు న్యాయంతో అధికారం చేస్తారు.

[2] ఒక మనిషి గాలికి చాటుగా, గాలివానకు ఆశ్రయంగా ఉంటాడు. మెట్ట ప్రాంతంలో నీటి కాలువలాగా ఉంటాడు. ఆరిపోయిన ప్రదేశంలో గొప్ప బండ నీడలాగా ఉంటాడు.

[3] అప్పుడు చూచేవారి కండ్లు మందంగా ఉండవు. వినేవారి చెవులు ఆలకిస్తాయి.

[4] తొందరపడేవారి మనసుకు జ్ఞానం అర్థం అవుతుంది. నత్తివారి నాలుక తేటగా మాట్లాడుతుంది.

[5] మూర్ఖుణ్ణి ఘనుడని పిలవడం జరగదు. వంచకుణ్ణి ఉదారుడు అనరు.

[6] మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడుతాడు. చెడుగును గురించి ఆలోచిస్తాడు. భక్తిహీనంగా ప్రవర్తిస్తాడు. యెహోవా విషయం తప్పుగా మాట్లాడుతాడు. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చడు, దప్పిగొన్నవారికి నీళ్ళు ఇయ్యడు.

[7] వంచకుడి విధానాలు చెడ్డవి. దరిద్రుల ఫిర్యాదు న్యాయంగా ఉన్నా, అబద్ధాలతో ఆ దీనులను నాశనం చేయడానికి వాళ్ళు దురాలోచన చేస్తారు.

[8] ఘనబుద్ధి గలవారు ఘన కార్యాలు కల్పిస్తారు. వారు ఘనకార్యాల కారణంగా నిలిచివుంటారు.

[9] సుఖంగా వ్యర్థంగా బ్రతికే స్త్రీలారా! లేచి నేను చెప్పేది వినండి. నిశ్చింతగా ఉన్న కూతుళ్ళారా! నా మాటలు వినండి.

[10] ఒక సంవత్సరం కొన్ని రోజుల తరువాత ద్రాక్ష పంట కోతకు రాదు. ఏరడానికి పండ్లు ఉండవు, గనుక నిశ్చింతగా ఉన్నవారలారా, మీకు కలత కలుగుతుంది.

[11] సుఖంగా వ్యర్థంగా బ్రతికే స్త్రీలారా, వణకండి! నిశ్చింతగా ఉన్న కూతుళ్ళారా, కంగారుపడండి! మీ బట్టలన్నీ తీసివేసి మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి.

[12] రమ్యమైన పొలాల విషయం, ఫలవంతమైన ద్రాక్షచెట్ల విషయం గుండెలు బాదుకోండి.

[13] నా ప్రజల భూమిలో ముండ్లచెట్లు, గచ్చపొదలు పెరుగుతాయి. దాని విషయం, సంతోషమయమైన ఇళ్ళ విషయం, ఉల్లాసంగా ఉన్న ఈ నగరం విషయం దుఃఖించండి.

[14] నగరు వదలివేయబడుతుంది, జనసమూహాలున్న నగరం విడువబడుతుంది. కొండ, కావలి గోపురం ఎప్పటికీ పాడుగా ఉంటాయి. అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగా, మందలు మేసే స్థలాలుగా ఉంటాయి.

[15] పైనుంచి ఆత్మను మనమీద కుమ్మరించడం జరిగేవరకూ, ఎడారి ఫలవంతమైన భూమి అయ్యేవరకూ, ఫలవంతమైన భూమి వనం అనిపించుకొనేవరకూ అలా ఉంటుంది.

[16] అప్పుడు నిజాయితీ ఎడారిలో నివసిస్తుంది. న్యాయం ఫలవంతమైన భూమిలో నిలిచి ఉంటుంది.

[17] న్యాయం శాంతిని కలిగిస్తుంది. న్యాయం ఫలితం ఎప్పటికీ నిలిచి ఉండే ప్రసన్నత, నిబ్బరం.

[18] అప్పుడు నా ప్రజలు శాంతిమయమైన నివాసాలలో, సురక్షితమైన ఇళ్ళలో, కలత చెందని విశ్రాంతి స్థలాలలో నివసిస్తారు.

[19] వడగండ్లు అడవిని నేలమట్టం చేసినా, పట్టణం పూర్తిగా కూలిపోయినా,

[20] నీళ్ళున్న స్థలాలన్నిటి దగ్గర విత్తనాలు చల్లుతూ, ఎద్దులనూ గాడిదలనూ తిరగనిస్తూ ఉండే మీరు ఎంత ధన్యజీవులై ఉంటారు!

యెషయా — Chapters