[1] “నీకు వెలుగు వచ్చింది, గనుక లేచి ప్రకాశించు! యెహోవా శోభ నీమీద ఉదయించింది.
[2] చూడు, భూమిని చీకటి కమ్ముతూ ఉంది. కటిక చీకటి జనాలను కమ్ముతూ ఉంది. అయితే యెహోవా నీమీద ఉదయిస్తూ ఉన్నాడు. ఆయన శోభ నీమీద కనబడుతూ ఉంది.
[3] జనాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు.
[4] “తలెత్తి చుట్టూరా చూడు. అందరూ సమకూడి నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తూ ఉన్నారు. నీ కూతుళ్ళు చంకనెత్తబడి వస్తూ ఉన్నారు.
[5] నీవు చూచేటప్పుడు కాంతిమయుడవు అవుతావు. నీ గుండె సంతోషంతో కొట్టుకొంటూ ఉప్పొంగిపోతుంది. సముద్ర సమృద్ధి నీ దగ్గరికి తేవడం జరుగుతుంది. జనాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది.
[6] ఒంటెల గుంపులు – మిద్యానునుంచీ ఏయిఫానుంచీ వచ్చిన ఒంటెల గుంపులు నీ దేశమంతటా వ్యాపిస్తాయి. షేబ దేశంవారంతా బంగారాన్నీ ధూపద్రవ్యాన్నీ తీసుకువస్తారు. వారు యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు.
[7] కేదారు ప్రాంతం గొర్రెల, మేకల మందలన్నీ నీ దగ్గరికి సమకూడుతాయి. నెబాయోతు ప్రాంతం పొట్టేళ్ళు నీ సేవలో ఉపయోగపడుతాయి. అని నా బలిపీఠంమీద బలులుగా అంగీకారం అవుతాయి. నేను నా ఘనమైన ఆలయాన్ని ఘనంగా చేస్తాను.
[8] “మేఘాలలాగా, తమ గూళ్ళకు ఎగసివచ్చే గువ్వలలాగా ఎగిరివస్తూవున్న మీరెవరు?
[9] ద్వీపవాసులు నాకోసం తప్పక చూస్తారు. నీ దేవుడు యెహోవా నిన్ను ఘనపరచినందుచేత ఇస్రాయేల్ పవిత్రుడైన ఆయన పేరుప్రతిష్ఠల కారణంగా తర్‌షీషు ఓడలు ముందు వస్తాయి. అవి నీ కొడుకులను తమ వెండి బంగారాలతో కూడా దూరంనుంచి తెస్తాయి.
[10] “విదేశీయులు నీ గోడలను నిర్మిస్తారు. వారి రాజులు నీకు సేవ చేస్తారు. నేను నిన్ను కోపంతో కొట్టినా, అనుగ్రహంతో నీమీద జాలిపడుతాను.
[11] మనుషులు ఇతర దేశాల ఐశ్వర్యాన్ని నీ దగ్గరికి తెచ్చేందుకు నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్ళు మూసివేయడం జరగదు. అవి ఎప్పటికీ తెరచి ఉంటాయి. ఆ జనాల ఊరేగింపులో రాజులు ఉంటారు.
[12] నిన్ను సేవించడానికి నిరాకరించే జనం గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. అలాంటి వాటిని నిర్మూలం చేయడం తప్పక జరుగుతుంది.
[13] “నా పవిత్రాలయమున్న స్థలానికి అలంకారంకోసం లెబానోనులోని మేలిరకమైన దేవదారు వృక్షాలూ సరళ వృక్షాలూ గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు. నా పాదాలు పెట్టుకొనే స్థలాన్ని నేను ఘనంగా చేస్తాను.
[14] నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడుతారు. నిన్ను తృణీకరించినవాళ్ళంతా వచ్చి నీ పాదాలమీద పడుతారు. నిన్ను ‘యెహోవా నగరం’ అనీ ‘ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి సీయోను’ అనీ అంటారు.
[15] “నీవు విసర్జనకూ ద్వేషానికీ గురి కావడానికీ, నీ మార్గాన దాటేవాళ్ళు ఎవరూ లేకపోవడానికీ బదులుగా శాశ్వతమైన శోభగా ఉండేలా నిన్ను మారుస్తాను. తరతరాలకు సంతోషకారణంగా నిన్ను చేస్తాను.
[16] నీవు జనాల పాలు కుడుస్తావు. రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నేనే – యెహోవాను – నీ రక్షకుణ్ణి అనీ యాకోబు బలవంతుడైన దేవుణ్ణి అనీ విముక్తి దాతను అనీ నీవు తెలుసుకొంటావు.
[17] నేను కంచుకు బదులు బంగారాన్నీ తెప్పిస్తాను. ఇనుముకు బదులు వెండిని, కర్రకు బదులు కంచును, రాళ్ళకు బదులు ఇనుమును తెప్పిస్తాను. నేను నీకు శాంతిని అధికారిగా, న్యాయాన్ని పరిపాలకుడుగా నియమిస్తాను.
[18] అప్పటినుంచి నీ దేశంలో దౌర్జన్యం అనే మాట కూడా వినబడదు. నీ సరిహద్దులో పాడు, నాశనం ఏమీ ఉండవు. నీ గోడలను ‘విముక్తి’, నీ ద్వారాలను ‘స్తుతి’ అంటావు.
[19] “అప్పటినుంచి పగటివేళ ప్రొద్దు నీకు వెలుగుగా ఉండదు. వెన్నెల నీమీద ప్రకాశించదు. యెహోవా తానే నీకు శాశ్వత కాంతిగా ఉంటాడు. నీ దేవుడు నీకు శోభగా ఉంటాడు.
[20] నీ ప్రొద్దు ఇంకా ఎన్నడూ క్రుంకదు, నీ వెన్నెల తగ్గదు. యెహోవా తానే నీకు శాశ్వతమైన కాంతిగా ఉంటాడు. నీ దుఃఖ దినాలు అంతం అవుతాయి.
[21] అప్పుడు నీ ప్రజలందరూ న్యాయవంతులుగా ఉంటారు. దేశం శాశ్వతంగా వారి స్వాధీనంలో ఉంటుంది. వారు నా ఘనతకోసం నేను నాటిన అంకురం, నేను చేతులతో చేసిన పని.
[22] మీలో అందరికంటే అల్పుడు వేయిమంది అవుతాడు, చిన్నవాడు బలమైన జనం అవుతాడు. నేను యెహోవాను. తగిన కాలంలో దీనిని త్వరగా జరిగిస్తాను.”