[1] సీయోనూ! మేల్కో! నీ బలం తొడుక్కో! జెరుసలం! పవిత్ర నగరమా! నీ అందమైన వస్త్రాలను ధరించుకో! ఇకనుంచి సున్నతి పొందనివాళ్ళూ అశుద్ధులూ నీలోకి రారు.
[2] దుమ్ము దులుపుకో, జెరుసలం! లేచి కూర్చో. బందీవైన సీయోను కుమారీ! నీ మెడకట్లు విప్పివేసుకో.
[3] ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు అమ్ముడుపోయారు గాని వెలకు కాదు. డబ్బు ఇవ్వకుండానే మిమ్మల్ని విడుదల చేయడం జరుగుతుంది.”
[4] యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “మొదట నా ప్రజలు ఈజిప్ట్కు కొంతకాలం కాపురముండడానికి వెళ్ళారు. ఇటీవల అష్షూరు నిష్కారణంగా వారిని బాధించింది.
[5] నా ప్రజలను ఊరకే తీసుకుపోవడం జరిగింది. వారిమీద అధికారం చేసేవాళ్ళు విజయ ధ్వనులు చేస్తున్నారు. ఇది యెహోవా వాక్కు. రోజంతా ఎడతెరపి లేకుండా నా పేరును అవమానించడం జరుగుతూ ఉంది.
[6] గనుక ఇక్కడ నాకు ఏముంది? ఇది యెహోవా వాక్కు. నా ప్రజలు నా పేరును తెలుసుకొంటారు. ‘నేను ఇక్కడే ఉన్నాను’ అని చెప్పేది నేనే అని ఆ రోజున వారు తెలుసుకొంటారు.”
[7] శాంతి ప్రకటిస్తూ, శుభసమాచారం తెస్తూ, విముక్తి చాటిస్తూ శుభవార్త తీసుకువచ్చేవారి పాదాలు, ‘నీ దేవుడు పరిపాలిస్తున్నాడు’ అని సీయోనుతో చెప్పేవారి పాదాలు పర్వతాలమీద ఎంతో అందమైనవి.
[8] విను! నీ కావలివారు స్వరమెత్తుతున్నారు. ఏకంగా ఆనంద ధ్వనులు చేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు.
[9] జెరుసలం శిథిలాల్లారా! ఏకంగా ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజను ఆదరించాడు. జెరుసలంను విమోచించాడు.
[10] అన్ని జనాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం బయలుపరిచాడు. భూమి కొనలన్నిటికీ మన దేవుడిచ్చే విముక్తి కనబడుతుంది.
[11] ఆ స్థలాన్ని విడిచివెళ్ళండి! విడిచివెళ్ళండి. అక్కడనుంచి వెళ్ళిపోండి! అశుద్ధమైన దేనినీ తాకవద్దు. యెహోవా సేవాపాత్రలను మోసేవారలారా! దానిలోనుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి.
[12] అయితే మీరు త్వరపడి బయలుదేరరు. పారిపోయే విధంగా వెళ్ళరు. ఎందుకంటే, యెహోవా మీ ముందర నడుస్తాడు. ఇస్రాయేల్ ప్రజల దేవుడు మీ వెనుక కావలివాడుగా ఉంటాడు.
[13] “వినండి, నా సేవకుడు జ్ఞానంతో ప్రవర్తిస్తాడు. ఆయనను హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం, అధికంగా ఘనపరచడం జరుగుతుంది.
[14] నిన్ను చూచి చాలామంది ఏ విధంగా నిర్ఘాంతపోయారో అలాగే ఆయనను చూచి నిర్ఘాంతపోతారు. ఆయన ఆకారాన్ని ఏ మనిషి ఆకారంకంటే వికృతం చేయడం జరిగింది – ఆయన రూపం మనిషి రూపంలాగా కనిపించలేదు.
[15] అలాగే ఆయన అనేక జనాలను చిలకరిస్తాడు. ఆయన కారణంగా రాజులు నోరు మూసుకొంటారు, ఎందుకంటే తమకు చెప్పని సంగతులు వారు చూస్తారు, వినబడని సంగతులు గ్రహిస్తారు.”