Skip to content
Opens in a new window

[1] ఈజిప్ట్ విషయం దేవోక్తి: యెహోవా మేఘమెక్కి ఈజిప్ట్‌కు త్వరగా వస్తూ ఉన్నాడు. ఈజిప్ట్ విగ్రహాలు ఆయన ఎదుట వణకుతూ ఉన్నాయి. ఈజిప్ట్‌వాళ్ళ గుండె కరిగిపోతూ ఉంది.

[2] సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నేను ఈజిప్ట్‌వాళ్ళమీదికి ఈజిప్ట్‌వాళ్ళను పురికొలుపుతాను. సోదరుడితో సోదరుడు, పొరుగువాడితో పొరుగువాడు పోరాడుతారు. పట్టణంమీద పట్టణం, రాజ్యంమీద రాజ్యం యుద్ధం చేస్తాయి.

[3] ఈజిప్ట్‌వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది. నేను వాళ్ళ ఆలోచనలను వమ్ము చేస్తాను. వాళ్ళు విగ్రహాల దగ్గర, మాంత్రికుల దగ్గర, కర్ణపిశాచం గల వాళ్ళదగ్గర, సోదెగాండ్ర దగ్గర విచారణ చేస్తారు.

[4] నేను ఈజిప్ట్‌వాళ్ళను క్రూరమైన అధిపతి వశం చేస్తాను. దౌర్జన్యపరుడైన రాజు వాళ్ళమీద అధికారం చేస్తాడు.”

[5] నైలు నది నీళ్ళు ఇంకిపోతాయి. నది మార్గం ఎండి పొడినేల అవుతుంది.

[6] కాలువలు కంపుకొడతాయి. ఈజిప్ట్ ప్రవాహాలు తగ్గిపోయి ఎండిపోతాయి. రెల్లు, తుంగలు వాడిపోతాయి.

[7] నైలు నది ఒడ్డున ఉన్న బీడులు, నైలు దగ్గర విత్తనాలు చల్లిన పొలాలు కూడా ఎండిపోతాయి. వాటి మొక్కలు కొట్టుకుపోయి కనిపించకుండా పోతాయి.

[8] చేపలు పట్టేవాళ్ళు మూలుగుతారు. నైలులో గాలం వేసేవాళ్ళంతా దుఃఖిస్తారు. నీళ్ళమీద వలలు వేసేవాళ్ళు కృశించిపోతారు.

[9] చక్కగా దువ్వబడ్డ జనుపనార పని చేసేవాళ్ళు, తెల్లని బట్టలు నేసేవాళ్ళు ఆశాభంగం చెందుతారు.

[10] ఈజిప్ట్ ఆధారాలు చితికిపోతాయి. కూలివాళ్ళంతా శోకిస్తారు.

[11] సోయను నగర నాయకులు తెలివితక్కువవాళ్ళు. ఫరో తెలివైన సలహాదారుల సలహా పశుప్రాయమైంది. “నేను జ్ఞానుల శిష్యుణ్ణి, పూర్వకాలంలో ఉన్న రాజుల సంతతివాణ్ణి” అని మీరు ఫరోతో ఎలా చెప్పగలరు?

[12] నీ జ్ఞానులు ఏమయ్యారు? సేనలప్రభువు యెహోవా ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా నిర్ణయించినదానిని వాళ్ళు గ్రహించి నీతో చెప్పాలి గదా!

[13] సోయను నాయకులు తెలివితక్కువ వాళ్ళయ్యారు. నోపు నగర నాయకులు మోసపోయారు. ఈజిప్ట్ జాతుల ప్రముఖులు దానిని తప్పుదారి పట్టించారు.

[14] యెహోవా వాళ్ళ ఆలోచనా శక్తిని తారుమారు చేశాడు. త్రాగుబోతు తన వాంతిలో తూలిపడే విధంగా ఈజిప్ట్ తన పని అంతట్లో తూలిపోయేలా వాళ్ళు చేస్తున్నారు.

[15] ఈజిప్ట్ ఏమీ చేయలేకపోతుంది తల గానీ, తోక గానీ, కొమ్మ గానీ, రెల్లు గానీ చేయగలిగే పని ఏమీ ఉండదు.

[16] ఆ రోజున ఈజిప్ట్‌వాళ్ళు స్త్రీలలాగా ఉంటారు. సేనలప్రభువు యెహోవా వాళ్ళకు పైగా తన చెయ్యి ఎత్తి ఊపేటప్పుడు, అది చూచి వాళ్ళు భయంతో వణకిపోతారు.

[17] యూదా దేశంవల్ల కూడా ఈజిప్ట్‌కు భయం కలుగుతుంది. సేనలప్రభువు యెహోవా వాళ్ళకు విరోధంగా సంకల్పించినదాని కారణంగా వాళ్ళలో ఎవరితో అయినా యూదా అంటే వాళ్ళు హడలిపోతారు.

[18] ఆ రోజు ఈజిప్ట్‌లో ఉన్న అయిదు పట్టణాల ప్రజలు కనానుభాష మాట్లాడుతారు, యెహోవా ప్రజలమని ప్రమాణం చేస్తారు. ఆ పట్టణాలలో ఒకదానిని “నాశనపురం” అంటారు.

[19] ఆ రోజుల్లో ఈజిప్ట్ మధ్య యెహోవాకు బలిపీఠం ఉంటుంది. దాని సరిహద్దుదగ్గర యెహోవాకు అంకితమైన స్తంభం ఉంటుంది.

[20] అది ఈజిప్ట్ దేశంలో, సేనలప్రభువు యెహోవాకు గుర్తుగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవాళ్ళ విషయం వాళ్ళు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వాళ్ళదగ్గరికి పరాక్రమశాలి అయిన రక్షకుణ్ణి పంపుతాడు. ఆయన వాళ్ళను రక్షిస్తాడు.

[21] యెహోవా తనను ఈజిప్ట్‌ప్రజలు తెలుసుకొనేలా చేస్తాడు. ఆ రోజున ఈజిప్ట్‌వాళ్ళు యెహోవాను తెలుసుకొంటారు. వాళ్ళు బలులూ నైవేద్యాలూ అర్పించి ఆయనను ఆరాధిస్తారు. యెహోవాకు మ్రొక్కుబడులను చేసుకొని వాటిని చెల్లిస్తారు.

[22] యెహోవా ఈజిప్ట్‌ను కొడతాడు, వాళ్ళను బాగు చేస్తాడు. వాళ్ళు యెహోవావైపు తిరుగుతారు, ఆయన వాళ్ళ ప్రార్థనలు అంగీకరించి వాళ్ళను బాగు చేస్తాడు.

[23] ఆ రోజుల్లో ఈజిప్ట్‌నుంచి అష్షూరుకు రహదారి ఉంటుంది. అష్షూరువాళ్ళు ఈజిప్ట్‌కు, ఈజిప్ట్‌వాళ్ళు అష్షూరుకు వస్తూ పోతూ ఉంటారు. ఈజిప్ట్‌వాళ్ళూ, అష్షూరువాళ్ళూ యెహోవాను ఆరాధించి సేవిస్తారు.

[24] ఆ రోజుల్లో ఈజిప్ట్ జనం, అష్షూరు జనంతో కూడా ఇస్రాయేల్‌ప్రజ మూడో జనమై భూమికి దీవెనగా ఉంటుంది.

[25] సేనలప్రభువు యెహోవా వాళ్ళను దీవిస్తూ “నా జనమైన ఈజిప్ట్‌వారు ధన్యులు. నా చేతులు చేసిన అష్షూరువారు ధన్యులు. నా సొత్తయిన ఇస్రాయేల్ ప్రజలు ధన్యులు” అంటాడు.

యెషయా — Chapters