Skip to content
Opens in a new window

[1] దౌర్జన్యానికి గురి కాని దౌర్జన్యపరుడా! నీకు బాధ తప్పదు. ద్రోహానికి గురి కాని ద్రోహీ! నీకు బాధ తప్పదు. నీవు దౌర్జన్యం చేయడం ముగించాక దౌర్జన్యానికి గురి అవుతావు. నీవు ద్రోహం చేయడం ముగించాక ద్రోహానికి గురి అవుతావు.

[2] యెహోవా, నీ కోసం ఎదురు చూస్తున్నాం. మామీద దయ చూపు. ప్రతి ఉదయమూ మాకు బలంగా ఉండు, బాధ కాలంలో మాకు రక్షణగా ఉండు.

[3] మహా ఘోష విని జనాలు పారిపోతాయి. నీవు నిలబడగానే జాతులు చెదరిపోతాయి.

[4] జనాల్లారా! చీడపురుగులు కొట్టివేసినట్టు మీ దోపిడీ దోచుకోబడుతుంది. మిడతల గుంపు ఎగిరిపడే విధంగా శత్రువులు దానిమీద పడుతారు.

[5] యెహోవా పైన నివసిస్తున్నాడు. ఆయన మహా ఘనత పొందినవాడు. ఆయన సీయోనును న్యాయంతో నీతినిజాయితీతో నింపేవాడు.

[6] ఆయన మీ కాలానికి సుస్థిరమైన ఆధారంగా ఉంటాడు. ఆయనే రక్షణ బుద్ధి జ్ఞాన సమృద్ధి అయి ఉంటాడు. యెహోవాను గురించిన భయభక్తులు ఆయన ఇచ్చే ఐశ్వర్యమే.

[7] చూడండి! వాళ్ళ శూరులు వీధులలో సహాయంకోసం కేకలు వేస్తున్నారు. వాళ్ళ శాంతి రాయబారులు భోరున ఏడుస్తున్నారు.

[8] రహదారులు విడిచిపెట్టబడ్డాయి. త్రోవలలో బాటసారులు లేరు. సంధి భంగమైంది. పట్టణాలు తృణీకారానికి గురి అయ్యాయి. ఇతరులకంటే గౌరవం లేదు.

[9] దేశం దుఃఖిస్తూ, క్షీణిస్తూ ఉంది. లెబానోను సిగ్గుపాలై వాడిపోతూ ఉంది. షారోను ఎడారి అయింది. బాషాను, కర్మెల్ పర్వతం చెట్ల ఆకులు రాలిపోతున్నాయి.

[10] యెహోవా అంటున్నాడు, “ఇప్పుడు నేను నిలబడుతాను. ఇప్పుడు నా గొప్పతనాన్ని ప్రదర్శిస్తాను. ఇప్పుడు నాకు ఘనత తెచ్చుకొంటాను.

[11] మీరు పొట్టును గర్భం ధరించి వరిగడ్డిని కంటారు. మీ ఊపిరి మంటలై మిమ్మల్ని దహించివేస్తుంది.

[12] సున్నం బట్టీలలాగా, నరికి ఉండి మంటల్లో కాలుతూ ఉన్న ముళ్ళలాగా జనులను కాల్చడం జరుగుతుంది.

[13] దూరంగా ఉన్నవారలారా! నేను చేసినదాని విషయం వినండి. దగ్గరగా ఉన్న వారలారా! నా బలప్రభావాలను తెలుసుకోండి.”

[14] సీయోనులో ఉన్న పాపులు హడలిపోతున్నారు. భక్తిలేని వాళ్ళు వణకుతున్నారు. “మనలో ఎవడు దహించే మంటతో ఉండిపోగలడు? మనలో ఎవడు శాశ్వతంగా కాలుతూ ఉండేదానితో నిలిచి ఉండగలడు?”

[15] నీతినిజాయితీని అనుసరించి నడుస్తూ, యథార్థంగా మాట్లాడుతూ, బలవంతాన వచ్చే లాభాన్ని తిరస్కరిస్తూ లంచం తన చేతికి చిక్కకుండా చేస్తూ, హత్య అనే మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుగును చూడకుండా కళ్ళు మూసుకొని ఉండేవాడు పైన నివాసం చేస్తాడు.

[16] అతనికి పర్వత శిఖర శిలలు ఆశ్రయంగా ఉంటాయి. అతనికి ఆహారం దొరుకుతుంది, నీళ్ళ సరఫరా ఎప్పుడూ ఆగదు.

[17] రాజు తన అందంలో నీ కంటికి కనబడుతాడు. చాలా దూరానికి వ్యాపిస్తూ ఉన్న దేశం నీకు కనిపిస్తుంది.

[18] మునుపు నీవు భయపడిననాటి విషయం తలపోస్తావు, “జనాభా లెక్కలు వ్రాసేవాడెక్కడ? తూచేవాడెక్కడ? బురుజులను లెక్కించిన వాడెక్కడ?”

[19] కఠినమైన ఆ జనాన్ని నీవు ఇకనుంచి చూడవు. గ్రహించలేని కష్టమైన భాష, నీకు అర్థం కాని విదేశీ భాష మాట్లాడిన ఆ జనాన్ని మళ్ళీ చూడవు.

[20] మన మహోత్సవాలు జరిగే సీయోను నగరాన్ని చూడు. ప్రశాంతమైన నివాసంగా, ఎన్నడూ తొలగిపోని గుడారంగా జెరుసలం నీ కంటికి కనబడుతుంది. దాని మేకులను ఊడదీయడం, దాని త్రాళ్ళతో ఒక్కటి కూడా తెంచడం ఎన్నడూ జరగదు.

[21] అక్కడ యెహోవా మనకు మహా నాయకుడుగా ఉంటాడు. అది విశాలమైన నదులు, కాలువలు ఉన్న స్థలమై ఉంటుంది. వాటిలో తెడ్ల ఓడ ఏదీ నడవదు. గొప్ప ఓడ అక్కడికి రాదు.

[22] యెహోవా మనకు న్యాయమూర్తి. యెహోవా మనకు శాసనకర్త. యెహోవా మనకు రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.

[23] నీ ఓడ త్రాళ్ళు సడలిపొయ్యాయి. ఓడ స్తంభం అడుగు గట్టిగా పట్టుబడడం లేదు. చాపను విప్పడం జరగలేదు. అప్పుడు సమృద్ధి అయిన దోపిడీ సొమ్ము విభాగించడం జరుగుతుంది. కుంటివారు కూడా దోపిడీ సొమ్ము పంచుకొంటారు.

[24] “నాకు జబ్బు చేసింది” అని సీయోనులో నివాసం చేసే వారెవరూ అనరు. దానిలో నివసించే ప్రజల అపరాధం పరిహారం అవుతుంది.

యెషయా — Chapters