[1] మీ దేవుడు ఇలా చెపుతున్నాడు: “నా ప్రజను ఓదార్చండి, వారిని ఓదార్చండి.
[2] జెరుసలంతో మృదువుగా మాట్లాడండి. దాని కష్టకాలం అయిపోయిందనీ, దాని అపరాధాలకు క్షమాపణ దొరికిందనీ, దాని పాపాలకు అది యెహోవాచేత రెండంతలుగా శిక్ష పొందిందనీ దానికి ప్రకటించండి.”
[3] ఎడారిలో ఒక వ్యక్తి ఇలా చాటిస్తూ ఉన్నాడు: “యెహోవాకోసం మార్గం సిద్ధం చేయండి. ఎడారిలో మన దేవునికోసం రాజమార్గం తిన్ననిది చేయండి.
[4] ప్రతి లోయనూ ఎత్తు చేయాలి. ప్రతి పర్వతాన్నీ కొండనూ అణచాలి. మెరక పల్లాలున్న స్థలాలు చదును కావాలి. కరుకైన ప్రదేశాలు మైదానం కావాలి.
[5] అప్పుడు యెహోవా శోభ వెల్లడి అవుతుంది. శరీరమున్న వారందరికీ అది కనిపిస్తుంది. ఇలా జరుగుతుందని యెహోవా తానే తెలియజేశాడు.”
[6] “చాటించు!” అని ఆజ్ఞ వినబడింది. “నేను చాటించవలసినదేమిటి?” అని అతడు అడిగాడు. “శరీరమున్నవారంతా గడ్డిలాంటివారు, వారి అందమంతా అడవి పువ్వుల్లాగా ఉంది.
[7] యెహోవా దానిమీద ఊదగానే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. ప్రజలు గడ్డిలాంటివారే.
[8] గడ్డి ఎండిపోతుంది గాని, మన దేవుని వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.”
[9] సీయోనుకు శుభవార్త ప్రకటించేవారలారా! ఎత్తయిన కొండ ఎక్కండి. జెరుసలంకు శుభవార్త ప్రకటించేవారలారా! బిగ్గరగా చాటించండి. భయపడక చాటించండి. యూదా పట్టణాలకు “ఇడుగో, మీ దేవుడు!” అని ప్రకటించండి.
[10] ఇదిగో వినండి! యెహోవాప్రభువు తానే బలప్రభావాలతో వస్తాడు. తనకోసం తన హస్తం పరిపాలిస్తుంది. ఆయన ఇచ్చే బహుమానం ఆయనదగ్గరే ఉంది. ఆయన ఇచ్చే వేతనం ఆయనతో కూడా వస్తుంది.
[11] ఆయన గొర్రెల కాపరిలాగా తన మందను కాస్తాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి, తన గుండెమీద ఆనించుకొని మోస్తాడు. పాలిచ్చేవాటిని మెల్లగా నడిపిస్తాడు.
[12] తన పుడిసిటిలో జలాల పరిమాణం తెలుసుకొన్న వాడెవడు? జేనతో ఆకాశాల కొలత చూచినవాడెవడు? భూమి మట్టిని కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసులో పర్వతాలను తూచినవాడెవడు? తూకంచేత కొండల బరువు చూచినవాడెవడు?
[13] యెహోవా ఆత్మను నడిపించిన వాడెవడు? ఆయనకు సలహాదారుడై ఆయనకు ఉపదేశం ఇచ్చినవాడెవడు?
[14] యెహోవా ఎవడిదగ్గర ఆలోచన అడిగాడు? ఆయనకు వివేకం కలిగించినదెవడు? న్యాయ మార్గం విషయం ఆయనకు నేర్పినదెవడు? ఆయనకు జ్ఞానోపదేశం ఇచ్చినదెవడు? తెలివి బోధించినదెవడు?
[15] జనాలు చేదనుంచి పడ్డ చుక్కలాగా ఉన్నాయి, త్రాసుమీది ధూళిలాగా ఉన్నాయి. ఆయన ద్వీపాలను తూచి చూస్తే అవి సన్నని దుమ్ములాగా ఉంటాయి.
[16] హోమాలకోసం లెబానోనులో ఉన్న పశువులు చాలవు. జ్వాలకోసం దాని అడవులు చాలవు.
[17] ఆయన దృష్టిలో జనాలన్నీ లేనట్టుగానే ఉన్నాయి. ఆయన అంచనాలో అవి శూన్యంగా ఉన్నాయి, శూన్యంకంటే తక్కువగానే ఉన్నాయి.
[18] అలాగైతే మీరు ఎవడితో దేవుణ్ణి పోలుస్తారు? ఏరూపంతో ఆయనను సరిచూస్తారు?
[19] విగ్రహం విషయం చూస్తే దానిని శిల్పి పోత పోస్తాడు, కంసాలి దానికి బంగారం తొడుగు చేస్తాడు, దానికి వెండి గొలుసులు చేస్తాడు.
[20] అలాంటిదానిని అర్పించలేని బీదవాడు పుచ్చిపోని మ్రాను ఎన్నుకొంటాడు. కదలని విగ్రహాన్ని తయారు చేయడానికి నేర్పుగల శిల్పిని వెదకి పిలుచుకొంటాడు.
[21] మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుంచి ఎవరూ మీతో చెప్పలేదా? భూమిస్థాపన విషయం మూలంగా మీరు గ్రహించలేదా?
[22] ఆయన భూగోళానికి పైగా కూర్చుని ఉన్నాడు. భూనివాసులు మిడతలలాగా కనిపిస్తూ ఉన్నారు. తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరుస్తాడు. నివాసం చేయడానికి డేరాలాగా వాటిని చాపుతాడు.
[23] ఆయన రాజులను లేకుండా చేస్తాడు, భూపతులను ఖాళీ చేస్తాడు.
[24] వాళ్ళు విత్తనంలాగా విత్తబడగానే, నాటబడగానే, భూమిలో వేరు తన్నేముందే, ఆయన వాళ్ళమీద ఊదుతాడు అంతే. వాళ్ళు వాడిపోతారు. సుడిగాలి పొట్టును తీసివేసే విధంగా ఆయన వాళ్ళను తీసివేస్తాడు.
[25] ఆ పవిత్రుడు అడిగేదేమిటంటే, “మీరు నన్ను ఎవడితో పోలుస్తారు? నన్ను ఎవడికి సాటి చేస్తారు?”
[26] ఆకాశాలవైపు చూడండి. వాటిని కలిగించినదెవరు? ఆ నక్షత్ర సమూహాలను ఒక్కొక్కటిగా బయలు దేరేలా చేసేవాడే గదా. ఆయన ప్రతిదానికీ పేరు పెట్టి పిలుస్తాడు. ఆయనకు అధిక ప్రభావం, అమిత బలం ఉండడం చేత ఒక్కటి కూడా విడిచిపెట్టడు.
[27] యాకోబు ప్రజలారా! ఇస్రాయేల్ ప్రజలారా! “మన పరిస్థితులు యెహోవాకు కనబడడం లేదు, మన హక్కులను ఆయన అలక్ష్యం చేస్తున్నాడు” అని మీరు చెప్పుకొంటున్నారు ఎందుకు?
[28] మీకు తెలియదా? మీరు వినలేదా? యెహోవా శాశ్వతంగా ఉన్న దేవుడు. భూదిగంతాలను కలిగించినవాడు ఆయనే. ఆయనకు అలసట, బడలిక అంటూ ఏమీ కలగదు. ఆయనకున్న జ్ఞానాన్ని పరిశోధించి తెలుసుకోవడం అసాధ్యం.
[29] అలసిపోయినవారికి ఆయన బలం ఇస్తాడు. నీరసించిపోయినవారికి బలాభివృద్ధి చేకూరుస్తాడు.
[30] కుర్రవాళ్ళు కూడా అలసట, బడలిక పడవచ్చు. యువకులు తొట్రుపడి కూలవచ్చు.
[31] అయితే యెహోవావైపు ఆశాభావంతో ఎదురు చూచేవారికి క్రొత్తబలం కలుగుతుంది. వారు గరుడపక్షిలాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు పరుగెత్తుతారు గాని, అలసిపోరు నడుస్తారు గాని బడలిక చెందరు.