[1] “నా విషయం అడగనివారిని నా దగ్గరికి రానిచ్చాను. నన్ను వెదకనివారికి నేను దొరికాను. నా పేర ప్రార్థన చేయని జనంతో ‘ఇదిగో! నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను’ అన్నాను.
[2] మూర్ఖంగా ఉండే ప్రజవైపు నేను రోజంతా చేతులు చాపాను. వారు తమ ఆలోచనలను అనుసరిస్తూ చెడ్డ త్రోవలలో నడుచుకొంటూ ఉన్నారు.
[3] తోటలలో బలులు అర్పిస్తూ, ఇటికెల కుప్పలమీద ధూపం వేస్తూ, నా కళ్ళెదుటే ఎల్లప్పుడూ నాకు కోపం రేపుతూ ఉన్నారు.
[4] వారు సమాధుల మధ్య కూర్చుని ఉంటారు. రహస్యంగా జాగరణ చేస్తారు. పంది మాంసం తింటారు. అసహ్యమైన వంటకం వారి పాత్రలలో ఉంది.
[5] వారు ‘నీ కంటే నేను పవిత్రుణ్ణి. నా దగ్గరికి రావద్దు! దూరంగా ఉండు!’ అంటారు. వారు నా ముక్కు పుటాలలో పొగలాగా, రోజంతా మండుతూ ఉండే నిప్పులాగా ఉన్నారు.
[6] “నా ఎదుట గ్రంథంలో ఇది వ్రాసి ఉంది: నేను ఊరుకోను. ప్రతీకారం చేసి తీరుతాను. మీ అపరాధాలకూ మీ పూర్వీకుల అపరాధాలకూ మీరు అనుభవించేలా ప్రతిఫలమిచ్చితీరుతాను.
[7] ఈ ప్రజలు పర్వతాల మీద ధూపం వేసినందుచేత, కొండలమీద నన్ను దూషణకు గురి చేసినందుచేత, మునుపు చేసిన పనులకు కూడా వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను” అని యెహోవా అంటున్నాడు.
[8] యెహోవా అంటున్నాడు, “ద్రాక్ష గుత్తిలో రసం ఇంకా కనబడితే, మనుషులు ‘దానిలో మంచి రసం ఉంది. దానిని నష్టం చేయవద్దు’ అంటారు. అలాగే నా సేవకులకోసం నేను చేస్తాను. ఈ ప్రజలను అందరినీ నాశనం చేయను.
[9] యాకోబు వంశంలో సంతానాన్ని పుట్టిస్తాను. యూదాలో నా పర్వతాలను స్వాధీనం చేసుకొనేవారిని పుట్టిస్తాను. నేను ఎన్నుకొన్నవారు వాటికి వారసులుగా ఉంటారు. నా సేవకులు అక్కడ నివాసం చేస్తారు.
[10] నన్ను వెదికిన నా ప్రజలకోసం షారోను గొర్రెల మేత భూమి అవుతుంది. ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది.
[11] “అయితే యెహోవాను వదలిపెట్టి, నా పవిత్ర పర్వతాన్ని మరచి, గాద్‌కు ఆహారనైవేద్యాలు అర్పిస్తూ, మనీకి పానార్పణలు చేసేవారలారా,
[12] నేను ఖడ్గాన్ని మీకు అదృష్టంగా నియమిస్తాను. మీరంతా సంహారానికి లోనవుతారు. ఎందుకంటే నేను పిలిచినప్పుడు మీరు జవాబియ్యలేదు, నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు. నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు, నాకు ఇష్టం కానివాటిని కోరుకొన్నారు.
[13] “అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇదిగో వినండి! నా సేవకులు భోజనం చేస్తారు గాని, మీరు ఆకలిగొంటారు. నా సేవకులు పానం చేస్తారు గాని, మీరు దప్పిగొంటారు. నా సేవకులు ఆనందిస్తారు గాని, మీరు సిగ్గుపాలవుతారు.
[14] నా సేవకులు ఆనందమయమైన హృదయాలతో పాటలు పాడుతారు గాని, మీరు హృదయవేదనతో ఏడుస్తారు. మనోదుఃఖంతో రోదనం చేస్తారు.
[15] నేను ఎన్నుకొన్నవారికి మీ పేరు శాప వచనంగా విడిచిపోతారు. యెహోవాప్రభువు మిమ్మల్ని హతమారుస్తాడు గాని, తన సేవకులకు ఆయన మరో పేరు పెడతాడు.
[16] అప్పుడు దేశంలో దీవెనకోసం ప్రార్థన చేసేవారు నమ్మతగిన దేవుని పేరటే ప్రార్థన చేస్తారు. దేశంలో శపథం చేసేవారు నమ్మతగిన దేవునితోడు అంటూ శపథం చేస్తారు. మునుపు ఉన్న కష్టాలను మరవడం జరుగుతుంది. అవి నా కంటికి కనబడకుండా పోతాయి.
[17] “ఇదిగో, నేను క్రొత్త ఆకాశాలనూ క్రొత్త భూమినీ సృజించబోతున్నాను. మునుపటి సంగతులు మనసులో ఉండవు. జ్ఞప్తికి రావు.
[18] నేను సృజించబోయే వాటికారణంగా సంతోషించండి. శాశ్వతంగా ఆనందించండి. నేను జెరుసలంను ఆనందకరమైన స్థలంగా, దాని ప్రజను సంతోషకారణంగా సృజించబోతున్నాను.
[19] నేను జెరుసలంను చూచి ఆనందిస్తాను, నా ప్రజను చూచి సంతోషిస్తాను. అప్పటినుంచి ఏడుపు, రోదనం జెరుసలంలో వినబడవు.
[20] “అప్పటినుంచి కొద్ది రోజులే బ్రతికే శిశువులు ఉండరు. ముసలివారు కాలం నిండకుండా చనిపోరు. నూరు సంవత్సరాలవాడు యువకుడుగా చనిపోతాడు. నూరు సంవత్సరాల వయసు ఉన్న పాపాత్ముడు శాపానికి గురి అవుతారు.
[21] ప్రజలు ఇండ్లను కట్టి వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలను నాటించి వాటి పండ్లను తింటారు.
[22] వారు కట్టే ఇండ్లలో ఇతరులు కాపురముండరు. వారు నాటించినవాటిని ఇతరులు తినరు. నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంతగా ఉంటుంది. నేను ఎన్నుకొన్నవారు తాము చేతులతో చేసేవాటిని చాలా కాలం ఉపయోగించుకొంటారు.
[23] వారు వృధాగా ప్రయాసపడరు. విపత్తుకే పిల్లలను కనరు. యెహోవా దీవించే ప్రజగా ఉంటారు. వారి సంతానం కూడా అలాగే ఉంటారు.
[24] వారు ప్రార్థన చేయకముందే నేను వారికి జవాబిస్తాను. వారు విన్నపం చేస్తూ ఉండగానే నేను వింటాను.
[25] తోడేళ్ళూ గొర్రెపిల్లలూ కలిసి మేస్తాయి. సింహాలు ఎద్దుల్లాగా గడ్డి తింటాయి. పాము నోట్లో ధూళిపడి తింటుంది. నా పవిత్రమైన కొండ అంతట్లో అవి హాని చేయవు, నాశనం చేయవు. ఇది యెహోవా వాక్కు.”