[1] మోయాబు దేశం విషయం దేవోక్తి. మోయాబులో ఉన్న ఆర్ పాడైపోయింది, ఒకే రాత్రిలో నాశనమైంది! మోయాబులో ఉన్న కీర్ పాడైపోయింది, ఒకే రాత్రిలో నాశనమైంది!
[2] ఏడ్వడానికి వాళ్లు గుడికి, ఎత్తయిన పూజాస్థలంమీద ఉన్న దీబోనుకు ఎక్కిపోతున్నారు. మోయాబువాళ్ళు నెబో విషయం, మేదేబా విషయం రోదనం చేస్తున్నారు. ప్రతి తలనూ బోడిచేయడం, ప్రతి గడ్డాన్నీ గొరిగించడం జరిగింది.
[3] తమ వీధులలో వాళ్ళు గోనెపట్ట కట్టుకొన్నారు. తమ మిద్దెలమీద, ఊళ్ళ విశాల స్థలాలలో అందరూ రోదనం చేస్తున్నారు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.
[4] హెష్‌బోనువాళ్ళు, ఏలాలేవాళ్ళు కేకలు వేస్తున్నారు. వాళ్ళ కంఠధ్వని యాహసువరకు వినబడుతున్నది. గనుక మోయాబు సైనికులు అరుస్తున్నారు. వాళ్ళ మనసులు ఆందోళన పడుతున్నాయి.
[5] “మోయాబు విషయం నేను అంతరంగంలో అరుస్తున్నాను. దాని పలాయితులు సోయరువరకు, ఎగ్లాత్‌షలీషీయా వరకు పారిపోతున్నారు. లూహీతు ఎక్కుడు త్రోవలో వెళ్ళిపోతూ ఏడుస్తూ ఉన్నారు. నాశనమయ్యామని కేకలు వేస్తూ హొరొనయీం త్రోవలో పోతున్నారు.
[6] నిమ్రీనులో ఉన్న నీళ్ళు ఇంకిపోయాయి. గడ్డి ఎండిపోయింది. చెట్టుచేమలు వాడిపొయ్యాయి. పచ్చనిది అంటూ ఏదీ మిగలలేదు.
[7] గనుక వాళ్ళు సంపాదించి కూడబెట్టిన ఆస్తిని నిరంజిచెట్లున్న నది అవతలకు మోసుకుపోతారు.
[8] రోదనం మోయాబు సరిహద్దులవరకు వ్యాపించింది. ఏడ్పు ఎగ్లయీం వరకు, బేర్‌యేలీం వరకు వినబడింది.
[9] ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తమయ్యాయి. ఇంతేగాక, నేను దీమోను మీదికి ఇంకా బాధలు రప్పిస్తాను. మోయాబునుంచి పారిపోయినవాళ్ళమీదికీ ఆ దేశంలో మిగిలిన వాళ్ళమీదికీ సింహాన్ని రప్పిస్తాను.”