[1] న్యాయవంతులు నాశనం అవుతున్నారు గాని, దాని విషయం ఎవరూ తలపోయరు. భక్తిపరులను తీసివేయడం జరుగుతున్నది గాని, ఎవరూ గ్రహించరు. కీడు చూడకుండేలా న్యాయవంతులను తీసివేయడం జరుగుతుంది.
[2] వారు శాంతిలోకి ప్రవేశిస్తారు. యథార్థంగా ప్రవర్తించేవారు తమ పాడెలమీద విశ్రమిస్తారు.
[3] “అయితే మంత్రకత్తె కొడుకులారా! వేశ్య, జారుడి సంతానమా! మీరు ఇక్కడికి రండి!
[4] మీరు ఎవణ్ణి చూచి నోరు బాగా తెరచి నాలుక చాపుతున్నారు? మీరు తిరుగబడే వాళ్ళు, అబద్ధికులు.
[5] సిందూర వృక్షాలలో, పచ్చని ప్రతి చెట్టుక్రిందా మీరు కామాగ్నిలో మాడిపోతున్నారు. కనుమలలో, బండల సందులలో పిల్లలను చంపి బలిగా అర్పిస్తున్నారు.
[6] లోయలో ఉన్న రాళ్ళే మీ భాగం. అవే మీ వంతు. వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యాలు అర్పిస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంటే నాకు దయ రావాలా?
[7] “ఎత్తయిన, ఉన్నతమైన కొండమీద నీ పరుపు వేసుకొన్నావు. బలులు అర్పించడానికి నీవు అక్కడికే ఎక్కిపోయావు.
[8] నీవు తలుపుల వెనుక, ద్వారం బంధాల వెనుక నీ స్మృతి చిహ్నం ఉంచావు. నన్ను వదిలిపెట్టి బట్టలు విడిచి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకొన్నావు. ఎవరి మంచాన్ని నీవు ప్రేమించావో వాళ్ళతో ఒడంబడిక చేసుకొన్నావు. వాళ్ళ దిగంబరత్వాన్ని చూశావు.
[9] ఆలీవ్‌నూనె తీసుకొని రాజుదగ్గరికి వెళ్ళిపోయావు. పరిమళ ద్రవ్యాలు ఎక్కువగా సంపాదించుకొన్నావు. నీ రాయబారులను దూరానికి పంపావు. మృత్యు లోకం వరకు దిగజారిపోయావు.
[10] నీ దీర్ఘ ప్రయాణాలవల్ల నీవు అలసిపోయావు. అయినా మళ్ళీ ప్రాణం వచ్చినట్టయింది, గనుక నీవు నీరసించిపోలేదు.
[11] “నీవు ఎవణ్ణి చూచి భయపడి, హడలిపోయి, అబద్ధికుడివై, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఆలోచించకుండా ఉన్నావు? చాలా కాలంనుంచి నేను ఊరుకొన్నందుచేతేనా నీవు నాకు భయపడడం లేదు?
[12] నీ నీతినిజాయితీ ఎంతో, నీ క్రియలు ఎలాంటివో నేను వెల్లడి చేస్తాను. వాటివల్ల నీకు ఏమీ ప్రయోజనం ఉండదు.
[13] నీవు సహాయంకోసం కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను రక్షించాలి! వాటన్నిటినీ గాలి ఎగరగొట్టివేస్తుంది. ఉఫ్‌మని ఊదితే అవన్నీ కొట్టుకుపోతాయి. అయితే నన్ను నమ్ముకొన్నవారికి దేశం వారసత్వంగా లభిస్తుంది. నా పవిత్ర పర్వతం వారి స్వాధీనంలోకి వస్తుంది.”
[14] ఈ విధంగా ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు: “ఎత్తు చేయండి! ఎత్తు చేయండి! త్రోవను సిద్ధం చేయండి. అడ్డంగా ఉన్నవాటిని నా ప్రజల దారినుంచి తీసివేయండి.”
[15] ఎందుకంటే, ఉన్నతంగా ఉన్న ఆ మహాఘనుడు, పవిత్రుడు అనే పేరు ఉన్న ఆ శాశ్వతుడు ఇలా అంటున్నాడు: “ఉన్నతంగా ఉన్న పవిత్ర స్థలంలో నేను నివసిస్తూ ఉన్నాను. అహంభావం లేని వారి ఆత్మను బ్రతికించడానికి, నలిగిన హృదయం గలవారి హృదయాన్ని బ్రతికించడానికి నేను నలిగిన హృదయం గలవారి దగ్గర, అహంభావం లేనివారి దగ్గర కూడా నివసిస్తూ ఉన్నాను.
[16] “నేను శాశ్వతంగా వాదిస్తూ ఉండను. ఎల్లప్పుడూ కోపంగా ఉండను. అలాగుంటే, మనిషి ఆత్మ నీరసించి పోతుంది, నేను సృజించిన మనుషులు క్షీణించిపోతారు.
[17] అన్యాయార్జిత లాభంకోసం అతడు చేసిన అపరాధం చూచి, నేను కోపగించి అతణ్ణి కొట్టాను. అతడికి నా ముఖాన్ని కనబడకుండా కోపంతో దాచుకొన్నాను. అతడు తిరుగుబాటు చేస్తూ, తనకిష్టమైన త్రోవలో నడుస్తూ వచ్చాడు.
[18] అతడి ప్రవర్తన చూశాను. అయితే అతణ్ణి బాగు చేస్తాను. అతడికి దారి చూపుతాను. అతణ్ణి, అతడితో దుఃఖించేవారిని ఓదారుస్తాను.
[19] వారి పెదవులతో స్తుతి మాటలు పుట్టిస్తాను. దూరంగా ఉన్నవారికి, దగ్గరగా ఉన్న వారికి శాంతి, శాంతి అంటూ వారిని బాగు చేస్తాను. ఇది యెహోవా వాక్కు.”
[20] అయితే దుర్మార్గులు, బురదనూ మైలనూ పైకి వేస్తూ ఎప్పుడూ కదులుతూ విశ్రమించలేని సముద్రంలాంటివాళ్ళు.
[21] “దుర్మార్గులకు శాంతి అంటూ ఉండదు” అని నా దేవుడు అంటున్నాడు.