Skip to content
Opens in a new window

[1] దమస్కు విషయం దేవోక్తి: దమస్కు నగరం కాకుండా పోతుంది. అది శిథిలాలవుతుంది.

[2] ఆరోయేర్ పట్టణాలు నిర్జనమవుతాయి. అవి గొర్రెల మందలు మేసే స్థలాలవుతాయి. అవి అక్కడ పడుకొంటాయి. వాటిని బెదరించడానికి ఎవరూ ఉండరు.

[3] ఎఫ్రాయింకు కోటలు లేకుండా పోతాయి. దమస్కుకు రాజ్యం లేకుండా ఉంటుంది. ఇస్రాయేల్‌ప్రజ వైభవానికి జరిగినట్టు సిరియావాళ్ళలో మిగిలేవాళ్ళకు జరుగుతుంది” అని సేనలప్రభువు యెహోవా చెపుతున్నాడు.

[4] ఆ రోజు యాకోబు వైభవం హీనదశ చెందుతుంది. అతడి కొవ్విన శరీరం కృశించిపోతుంది.

[5] పంట కోసేవాడు దంట్లు కోసినట్లు, అతడి చెయ్యి కంకులు కోసినట్లు ఉంటుంది. రెఫాయిం లోయలో మనిషి పరిగె ఏరినట్లుంటుంది.

[6] అయినా దానిలో పరిగె పండ్లు మిగిలి ఉంటాయి. ఆలీవ్‌చెట్టు దులిపివేస్తే పైకొమ్మల చివరను రెండు మూడు పండ్లు మిగిలి ఉన్నట్లు, ఫలవంతమైన కొమ్మలలో నాలుగు అయిదు పండ్లు మిగిలి ఉన్నట్లు ఉంటుంది అని ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా అంటున్నాడు.

[7] ఆ కాలంలో మనుషులు తమను సృజించినవాని వైపు చూస్తారు, ఇస్రాయేల్‌ప్రజల పవిత్రునివైపు తమ కండ్లు తిప్పుకొంటారు.

[8] గాని, తాము చేతులతో చేసిన బలిపీఠాలవైపు చూడరు, వ్రేళ్ళతో చేసిన ఆషేరాదేవి స్తంభాల వైపు, ధూపవేదికల వైపు కూడా చూడరు.

[9] ఆ కాలంలో, ఇస్రాయేల్‌ప్రజల భయంచేత వాళ్ళు విడిచివెళ్ళిన బలమైన పట్టణాలు నిర్జనమైన అడవులలాగా, కొండసీమలలాగా ఉంటాయి. ఆ దేశం పాడైపోతుంది.

[10] ఎందుకంటే, నీవు నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి మరచి పొయ్యావు. నీకు కోటగా ఉన్న ఈ ఆధారశిలను జ్ఞాపకం ఉంచుకోలేదు. అందుచేత నీవు అందమైన తోటలను నాటినా, విదేశీయ ద్రాక్ష చెట్లను నాటినా,

[11] వాటిని నాటే రోజున వాటిచుట్టూ కంచె వేసినా, పొద్దున్నే నీవు వేసిన విత్తనాలు పూసేలా చేసినా, గాయాలూ, మానని బాధా కలిగే రోజున పంట అంతర్ధానం అవుతుంది.

[12] అయ్యో! అనేక జనాలు గర్జించడం వినబడుతూ ఉంది, ఆ గర్జన సముద్రాల గర్జనలాంటిది. జాతులు గొప్ప ప్రవాహాల ఘోషలాగా ఘోషిస్తూ ఉన్నాయి.

[13] జాతులు విస్తార జలాల ఘోషలా ఘోషిస్తూ ఉన్నా, ఆయన వాటిని మందలించేటప్పుడు అవి దూరంగా పారిపోతాయి. కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోయే విధంగా, తుఫాను ఎదుట గిరగిర తిరిగే కసవు ఎగిరిపోయే విధంగా అవి కొట్టుకుపోతాయి.

[14] సాయంకాల సమయంలో హఠాత్తుగా భయం కలుగుతుంది. ఉదయం కాకముందే అవి లేకపోతాయి. ఇదే మమ్మల్ని దోచుకొనేవాళ్ళ వంతు. మమ్మల్ని కొల్లగొట్టేవాళ్ళకు పట్టే గతి ఇదే.

యెషయా — Chapters