Skip to content
Opens in a new window

[1] “నేను కోరెషు పక్షాన జనాలను జయించడానికీ, రాజుల నడికట్లను విప్పడానికీ, అతడి ఎదుట ద్వారాలు వేయబడకుండా తలుపులు తీయడానికీ అతడి కుడిచెయ్యి పట్టుకొన్నాను. యెహోవా అభిషేకించిన కోరెషుతో చెప్పేదేమిటంటే,

[2] ‘నేను నీకు ముందుగా వెళ్తాను, కొండలను చదును చేస్తాను. కంచు తలుపులను పగులగొట్టివేస్తాను, ఇనుప గడియలను ముక్కలు చేస్తాను.

[3] చీకటి చోట్లలో మరుగైన నిధులనూ రహస్య స్థలాలలో కూడబెట్టిన ధనాన్నీ నీకిస్తాను. నేను పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవానని నీవు తెలుసుకోవాలని నా ఉద్దేశం.

[4] నీవు నన్ను ఎరుగకపోయినా, నా సేవకుడు యాకోబుకోసం, నేను ఎన్నుకొన్న ఇస్రాయేల్‌కోసం నేను పేరుపెట్టి నిన్ను పిలిచాను, నీకు బిరుదులను ఇచ్చాను.

[5] నేను యెహోవాను. వేరే దేవుడు లేడు. నేను తప్ప ఏ దేవుడూ లేడు.

[6] తూర్పునుంచి పడమటివరకు నేను తప్ప ఏ దేవుడూ లేడని జనాలు తెలుసుకొనేలా, నీవు నన్ను ఎరుగకపోయినా నేను నిన్ను సన్నద్ధుడుగా చేస్తాను. నేను యెహోవాను. నేను తప్ప ఏ దేవుడూ లేడు.

[7] నేను వెలుగును సృజించేవాణ్ణి, చీకటినీ కలిగించేవాణ్ణి. నేను క్షేమాన్నీ, విపత్తునూ కలిగించేవాణ్ణి.’

[8] “ఆకాశాల్లారా! పైనుంచి న్యాయాన్ని కురిపించండి! మబ్బులారా! దానిని వర్షించండి! భూమి తెరుచుకొంటుంది గాక! విముక్తి ఫలించేలా న్యాయాన్ని మొలిపిస్తుంది గాక! నేను యెహోవాను దానిని కలిగించాను.

[9] “మట్టి కుండపెంకులలో ఒక పెంకులాగా ఉండి తనను సృజించినవానితో పోరాడేవాడికి బాధ తప్పదు. జిగటమన్ను ‘నువ్వేం చేస్తున్నావు?, అని కుమ్మరిని అడుగుతుందా? ‘వీడికి చేతులు లేవు’ అని నీ చేతిపని నీ విషయం చెపుతుందా?

[10] తండ్రిని చూచి ‘నువ్వు కన్నదేమిటి?’ అని అడిగేవాడికి బాధ తప్పదు. ‘నువ్వు గర్భం ధరించినదేమిటి?’ అని తల్లిని అడిగేవాడికి బాధ తప్పదు.

[11] ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడూ సృష్టికర్తా అయిన యెహోవా చెప్పేదేమిటంటే, రాగల వాటి విషయంలో నా పిల్లలను గురించి నన్ను అడుగుతారా? నా చేతులు చేసే పనులను గురించి నాకు ఆజ్ఞ జారీ చేస్తారా?

[12] భూమిని కలిగించినది నేనే. దానిమీద మానవజాతిని సృజించినది నేనే. ఆకాశాలను పరచినది నా చేతులే. వాటిలో ఉన్న సమూహాలను నియమించినది నేనే.

[13] న్యాయాన్ని అనుసరించి నేను కోరెషును పురికొలుపుతాను. అతడి త్రోవలన్నీ తిన్ననివి చేస్తాను. అతడు నా నగరాన్ని మళ్ళీ కట్టిస్తాడు. విడుదలకోసమైన వెల గానీ, బహుమానం గానీ తీసుకోకుండా అతడు బందీలుగా వెళ్ళిన నా ప్రజను విడిపిస్తాడు.”

[14] యెహోవా ఇలా అంటున్నాడు: “ఈజిప్ట్‌వాళ్ళ కష్టార్జితం, కూషువాళ్ళ, పొడుగాటి సెబావాళ్ళ వర్తక లాభం నీ దగ్గరికి వచ్చి నీవి అవుతాయి. వాళ్ళు సంకెళ్ళతో బంధించబడి వచ్చి నీవెనుక నడుస్తారు. నీ ఎదుట సాష్టాంగపడి ‘నిజంగా నీతో దేవుడు ఉన్నాడు. వేరే దేవుడు లేడు. ఆయన తప్ప ఏ దేవుడూ లేడు’ అని చెప్పి నిన్ను ప్రాధేయపడుతారు.”

[15] ఇస్రాయేల్ ప్రజల దేవా, రక్షకా, నిజంగా నీవు నిన్ను మరుగు చేసుకొనే దేవుడవు.

[16] విగ్రహాలను చేసేవాళ్ళంతా సిగ్గు, అవమానం పాలవుతారు. వాళ్ళు ఏకంగా తలవంపులతో వెళ్ళిపోతారు.

[17] ఇస్రాయేలైతే యెహోవా మూలంగా రక్షణ పొందుతుంది. ఆ రక్షణ శాశ్వతమైనది. మీరు ఎన్నటికీ సిగ్గుకూ అవమానానికీ గురి కారు.

[18] యెహోవా ఆకాశాలను సృజించాడు. ఆయన దేవుడు, ఆయన భూమిని కలిగించి, రూపొందించి, సుస్థిరం చేశాడు. శూన్యంగా ఉండడానికి దానిని సృజించలేదు. నివాసస్థలంగా ఉండాలని రూపొందించాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను యెహోవాను. వేరే దేవుడు లేడు.

[19] నేను ఏదో చీకటి ప్రదేశంలో రహస్యంగా మాట్లాడలేదు. ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను యెహోవాను న్యాయమైన సంగతులు చెప్పేవాణ్ణి, యథార్థమైన సంగతులు చెప్పేవాణ్ణి.

[20] “సమకూడి రండి! జనాలలో తప్పించుకొన్న వారలారా! కలిసి దగ్గరికి రండి! తమ కొయ్య విగ్రహాన్ని మోస్తూ, రక్షించలేని దేవతకు ప్రార్థన చేసేవాళ్ళు తెలివితక్కువవాళ్ళు.

[21] మీ సంగతి నా సముఖంలో వివరించండి. వాళ్ళను కలిసి ఆలోచన చేసుకోనివ్వండి. ఈ విధంగా జరుగుతుందని పూర్వకాలంనుంచి తెలియజేసినదెవరు? చాలా కాలంక్రింద దానిని ప్రకటించినదెవరు? యెహోవా అనే నేనే గదా! నేను తప్ప ఇంకా ఏ దేవుడూ లేడు. నేనే న్యాయవంతుడైన దేవుణ్ణి. రక్షకుణ్ణి. నేను తప్ప ఏ దేవుడూ లేడు.

[22] “భూమి కొనలలో ఉన్నవారలారా! నావైపు తిరిగి విముక్తులు కండి! నేనే దేవుణ్ణి. ఇంకా ఏ దేవుడూ లేడు.

[23] నా ఎదుట ప్రతి మోకాలూ వంగుతుందనీ ప్రతి నాలుకా నాతోడని ప్రమాణం చేస్తుందనీ నేను నా సొంత పేరుమీద శపథం చేశాను. నా నోటనుంచి వెలువడ్డ ఆ మాట యథార్థమైనది. దానికి తిరుగు లేదు.

[24] ‘యెహోవాకే న్యాయం, బలం ఉన్నాయి’ అని అందరూ నా విషయం చెపుతారు.” ఆయనదగ్గరికే మనుషులు వస్తారు. ఆయనమీద కోపంతో మండిపడ్డవాళ్ళంతా సిగ్గుపాలవుతారు.

[25] ఇస్రాయేల్ సంతతివారంతా యెహోవా మూలంగా నిర్దోషుల లెక్కలో చేరి ఉత్సాహపడుతారు.

యెషయా — Chapters