[1] “ఇస్రాయేల్ అనే పేరు కలిగి, యూదా సంతానమైన యాకోబు వంశమా! నీవు యెహోవా పేరుతోడని ప్రమాణాలు చేస్తావు, ఇస్రాయేల్ ప్రజల దేవుని విషయం మాట్లాడుతారు (అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు),
[2] ‘పవిత్ర నగరవాసులం’ అంటూ ఇస్రాయేల్ ప్రజల దేవునిమీద ఆధారపడుతావు (ఆయన పేరు సేనలప్రభువు యెహోవా). నీవు ఈ మాట విను.
[3] “మునుపు జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేశాను. వాటిని గురించిన మాటలు నా నోటనుంచి వెలువడ్డాయి. నేను వాటిని వెల్లడి చేశాను. ఉన్నట్టుండి నేను పని జరిగించాను, అవి సంభవించాయి.
[4] ఎందుకంటే, నీవు మూర్ఖుడివనీ, నీ మెడ నరాలు ఇనుములాంటివనీ, నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.
[5] అందుచేత చాలా కాలంక్రిందట ఆ సంగతులు నీకు తెలియజేశాను. ‘ఇలా చేసినది నా విగ్రహాలు. వాటిని నియమించినది నా చెక్కిన ప్రతిమ, పోతపోసిన నా విగ్రహం’ అని నీవు చెప్పలేకపోవాలని అవి జరగకముందే వాటిని నీకు ప్రకటించాను.
[6] నీవు ఆ సంగతులు విన్నావు. వాటన్నిటిని గురించి ఆలోచించు. నేను చెప్పినది నిజమని నీవు ఒప్పుకోవా? “ఇకనుంచి నీకు క్రొత్త సంగతులను తెలియజేస్తాను. ఆ సంగతులు గూఢమైనవి, నీకు తెలియనివి.
[7] ఇవి ఇప్పుడే కలిగినవి. చాలా కాలంక్రిందట ఇవి కలిగినవి కావు. ఈ రోజుకు ముందుగా నీవు వాటిని గురించి వినలేదు, గనుక ‘ఇవి నాకు తెలిసినవే’ అని నీవు చెప్పలేవు.
[8] నీవు వినలేదు, తెలుసుకోలేదు. చాలా కాలంనుంచి నీ చెవి తెరవబడలేదు. నీవు ద్రోహివని నాకు బాగా తెలుసు. నీవు పుట్టినప్పటినుంచి తిరుగబడేవాడివని అనిపించుకొన్నావు.
[9] “నేను నిన్ను నిర్మూలం చేయకుండా నా పేరుకోసం నా కోపం ఇప్పుడు కుమ్మరించను. నా కీర్తికోసం దానిని అదుపులో ఉంచుకొంటున్నాను.
[10] నేను నిన్ను పుటం పెట్టాను. వెండిలాగా కాక, బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
[11] నా కోసం, నా కోసమే, నేనిలా చేస్తున్నాను. నా పేరు అవమానానికి గురి కావాలా? నా ఘనత ఇంక ఎవరికీ చేకూరనివ్వను.
[12] “యాకోబూ! నేను పిలిచిన ఇస్రాయేలూ! నేను చెప్పేది విను. నేనే ఆయనను. నేను మొదటివాణ్ణి చివరివాణ్ణి.
[13] నా చేయి భూమికి పునాది వేసింది. నా కుడి చేయి ఆకాశాలను పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ ఏకంగా నిలబడుతాయి.
[14] మీరందరూ సమకూడి వచ్చి ఆలకించండి. మీ విగ్రహాలలో ఏది ఈ సంగతులను తెలియజేసింది? బబులోనుమీద యెహోవా సంకల్పాన్ని ఆయన ప్రేమించేవాడు నెరవేరుస్తాడు. అతని హస్తం కల్దీయవాళ్ళమీదికి వస్తుంది.
[15] నేను నేనే ఇది చెప్పాను. నేనే అతణ్ణి పిలిచాను. నేనే అతణ్ణి తీసుకువస్తాను. అతని రాకడ సఫలమవుతుంది.
[16] నా దగ్గరికి వచ్చి ఈ మాట వినండి: ఆరంభంనుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు. ఇవి సంభవించే కాలంలో నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు యెహోవాప్రభువు ఆయన ఆత్మతోకూడా నన్ను పంపాడు.
[17] “నీ విముక్తిదాత, ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడైన యెహోవా చెప్పేదేమిటంటే, నేను యెహోవాను, నీ దేవుణ్ణి. నీకు మేలు కలగాలని నీకు ఉపదేశం చేసేవాణ్ణి. నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించేవాణ్ణి.
[18] నీవు నా ఆజ్ఞలను పాటించాలని ఎంతో కోరేవాణ్ణి. వాటిని పాటించి ఉంటే నీ శాంతి నదిలాగా, నీ న్యాయం సముద్రం అలలలాగా ఉండి ఉండేవి.
[19] నీ సంతానం ఇసుకంత విస్తారంగా, నీ పిల్లలు లెక్కకు ఇసుకరేణువుల లాగా ఉండి ఉండేవారు. అలాంటప్పుడు వారి పేరును నా సముఖంనుంచి కొట్టివేయడం జరిగేది కాదు, నాశనం అయ్యేది కాదు.”
[20] బబులోనును విడిచివెళ్ళండి! కల్దీయవాళ్ళ దేశంనుంచి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును వెల ఇచ్చి విడుదల చేశాడు” అని ఆనంద ధ్వనులతో చాటించండి. భూమి కొనల వరకు అది వినిపించి ప్రకటించండి.
[21] ఎడారులలో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం కాలేదు. వారికోసం బండలోనుంచి నీళ్ళు పారేలా ఆయన చేశాడు. ఆయన ఆ బండ చీల్చాడు, నీళ్ళు ధారధారలుగా వెలువడ్డాయి.
[22] అయితే “దుర్మార్గులకు శాంతి అంటూ ఉండదు” అని యెహోవా అంటున్నాడు.