[1] అయితే యెహోవా యాకోబు వంశంవారిమీద జాలిపడుతాడు, మరోసారి ఇస్రాయేల్‌ప్రజలను ఎన్నుకొంటాడు, వారిని స్వదేశంలో నివసించేలా చేస్తాడు. విదేశీయులు వారి దగ్గరికి చేరుతారు, యాకోబు వంశంవారితో ఏకం అవుతారు.
[2] ఇతర జనాలు వారిని వారి స్వదేశానికి తీసుకువస్తారు. ఆ జనాలు ఇస్రాయేల్ వంశంవారి స్వాధీనమై వారికి దాసదాసీజనం అవుతారు. ఇస్రాయేల్‌ప్రజలు తమను బందీలుగా చేసినవాళ్ళను బందీలుగా చేస్తారు, తమను అణగద్రొక్కినవాళ్ళను పరిపాలిస్తారు.
[3] యెహోవా నీ బాధనుంచి, ఆయాసంనుంచి, కఠిన దాస్యంనుంచి నిన్ను విడిపించి నీకు విశ్రాంతి ప్రసాదించే రోజున
[4] నీవు బబులోను రాజు విషయం ఉపమాన రూపంలో ఇలా అంటావు: “ఇతరులను అణగద్రొక్కినవాడు ఎలా అంతరించాడో చూడండి! అతడి ఉన్మాదం అయిపోయింది!
[5] దుర్మార్గుల దుడ్డుకర్రనూ పరిపాలకుల రాజదండాన్నీ యెహోవా విరగ్గొట్టివేశాడు.
[6] వాళ్ళు కోపంతో ఎడతెరిపి లేకుండా జాతులను దెబ్బలు కొట్టినవాళ్ళు. ఆగ్రహించి దౌర్జన్యంతో విరామం లేకుండా జనాలను లోబరచుకొన్నవాళ్ళు.
[7] ఇప్పుడు లోకమంతా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. జనాలు ఆనంద గీతాలు ఆలపిస్తారు.
[8] తమాల వృక్షాలూ, లెబానోను దేవదారు చెట్లూ నీ విషయం ‘నీవు పడినప్పటినుండి మమ్మల్ని నరికివేయడానికి ఎవ్వడూ మాదగ్గరికి రావడం లేదు’ అంటూ సంతోషిస్తాయి.
[9] “నీవు వస్తూ ఉంటే నిన్ను కలుసుకోవడానికి క్రింద మృత్యులోకం కదులుతూ ఉంది. అది నీ రాకడకు ప్రేతాత్మలను – మునుపు లోకంలో ఉన్న నాయకులందరి ఆత్మలనూ – పురికొలుపుతూ ఉంది, జనాల రాజులందరి ఆత్మలనూ వాళ్ళ సింహాసనాల మీదనుంచి లేపుతూ ఉంది.
[10] వాళ్ళంతా నిన్ను చూచి, ‘నీవు కూడా మాలాగా బలహీనుడవయ్యావు! మాలాంటి వాడివయ్యావు!’ అంటారు.
[11] నీ వైభవాన్ని, నీ తంతివాద్యాల స్వరంతోపాటు మృత్యులోకంలో పడవేయడం జరిగింది. నీ క్రింద కీటకాలు వ్యాపిస్తూ ఉన్నాయి. పురుగులు నిన్ను కప్పుతూ ఉన్నాయి.
[12] ప్రకాశమానమైన వేకువ చుక్కా! నీవు ఆకాశంనుంచి ఎలా పడ్డావో చూడు! ఒకప్పుడు నీవు జనాలను పడగొట్టేవాడివి. నీవెలా నేలమట్టం అయ్యావో చూడు!
[13] నీవు మనసులో ఇలా అనుకొన్నావు గదా ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను. దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను.
[14] మేఘాలకు పైగా ఎక్కిపోతాను. సర్వాతీతుడితో సరిసమానమవుతాను.’
[15] “అయితే నీవు మృత్యులోకంలో, అగాధం లోతుల్లోకి త్రోసివేయబడ్డావు.
[16] నిన్ను చూచినవాళ్ళు తేరి చూస్తూ నీ విషయం ఇలా తలపోస్తున్నారు: ‘భూమిని కదిలించి రాజ్యాలను వణికించినవాడు వీడేనా?
[17] లోకాన్ని ఎడారిగా చేసి, దాని పట్టణాలను పడగొట్టి, తాను బందీలుగా పట్టినవారిని తమ ఇండ్లకు వెళ్ళనియ్యనివాడు వీడేనా!’
[18] “జనాల రాజులలో ప్రతివాడూ తన సొంత సమాధిలో ఘనతతో పడుకొంటాడు.
[19] నీవైతే తిరస్కారానికి గురి అయిన కొమ్మల్లాగా నీ సమాధిలోనుంచి పారవేయబడ్డావు. కత్తిపాలై చచ్చినవాళ్ళ శవాలు నిన్ను కప్పుతున్నాయి – అగాధంలో ఉన్న రాళ్ళ దగ్గరికి దిగిపోయినవాళ్ళ శవాలు నిన్ను కప్పుతున్నాయి. నీవు తొక్కబడ్డ పీనుగులాగా అయ్యావు.
[20] వాళ్ళతోకూడా నిన్ను పాతిపెట్టడం జరగదు. ఎందుకంటే, నీ దేశాన్ని పాడుచేశావు, నీ ప్రజలను హతమార్చావు. దుర్మార్గుల సంతానం ఇంకెప్పుడూ జ్ఞాపకానికి రారు.
[21] తమ పూర్వీకుల అపరాధాల కారణంగా, అతడి కొడుకులను సంహారం చేసే స్థలాన్ని సిద్ధం చేయండి. వాళ్ళు అభివృద్ధి చెంది దేశాన్ని స్వాధీనం చేసుకోకూడదు, భూతలం అంతటా పట్టణాలను కట్టకూడదు.
[22] సేనల ప్రభువు యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను వాళ్ళమీదికి వచ్చి, బబులోనుకు పేరును, మిగిలినవాళ్ళను, కొడుకులను, సంతతివాళ్ళను లేకుండా కొట్టివేస్తాను. ఇది యెహోవా వాక్కు.
[23] నేను దానిని ముళ్ళపందులకు ఉనికిపట్టుగా, చిత్తడి నేలగా చేస్తాను. నాశనం అనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.”
[24] సేనల ప్రభువు యెహోవా శపథం చేసి ఇలా అన్నాడు: “నేను సంకల్పించినట్టే జరిగితీరుతుంది. నేను ఆలోచించినట్టే తప్పక నెరవేరుతుంది.
[25] నా దేశంలో అష్షూరువాణ్ణి చితగ్గొట్టి వేస్తాను. నా కొండలమీద వాణ్ణి నలగద్రొక్కివేస్తాను. వాడి కాడిని నా ప్రజల మీదనుంచి తీసివేయడం, వాడు ఉంచిన భారాన్ని వారి భుజాలమీదనుంచి తొలగించడం జరుగుతుంది.”
[26] లోకమంతటి విషయం యెహోవా నిర్ణయించినది ఇదే. అన్ని జనాలమీదా చాచిన చేయి ఇదే.
[27] సేనల ప్రభువు యెహోవా దానిని నిర్ణయించాడు. ఎవరు రద్దుచేయగలరు? ఆయన చేయి చాచి ఉంది. దానిని ఎవరు వెనక్కు త్రిప్పగలరు?
[28] ఆహాజురాజు చనిపోయిన సంవత్సరంలో ఈ దేవోక్తి వచ్చింది:
[29] ఫిలిష్తీయ దేశమా! నిన్ను కొట్టిన దండం విరిగిపోయిందని అంతగా సంతోషించకు. ఆ సర్ప వంశంనుంచి కట్లపాము బయలుదేరుతుంది. దాని ఫలం మిణ్ణాగు.
[30] బీదలందరిలో బీదలకు భోజనం దొరుకుతుంది. దరిద్రులు సురక్షితంగా పడుకొంటారు. కాని, నేను నీ సంతానాన్ని కరవుచేత చంపిస్తాను. అది నీకు మిగిలేవాళ్ళను నాశనం చేస్తుంది.
[31] ద్వారమా! రోదనం చేయి! పట్టణమా! కేకలు వెయ్యి! ఫిలిష్తీయా! నీవు భయంతో కరిగిపోవాలి. ఉత్తరదిక్కునుంచి పొగ లేస్తూ ఉంది. వచ్చేవాడి సైన్యంలో వెనుకబడ్డ వాడెవ్వడూ లేడు.
[32] ఆ జాతి రాయబారులకు ఏ జవాబివ్వాలి? “యెహోవా సీయోనును స్థాపించాడు. ఆయన ప్రజలలో బాధకు గురి అయినవారికి దానిలో ఆశ్రయం దొరుకుతుంది.”