Skip to content
Opens in a new window

[1] “కన్యకుమార్తె అయిన బబులోను! క్రిందికి దిగి దుమ్ములో కూర్చో. కల్దీయవాళ్ళ కుమారీ! సింహాసనం లేకుండా నేలమీద కూర్చో. నీవు మృదువుగా, నాజూకుగా ఉన్నావని మనుషులు ఇకనుంచి అనరు.

[2] తిరుగటిరాళ్ళను తీసుకొని పిండి విసరు! నీ ముసుకు పారవెయ్యి. కాలిమీద జీరాడే బట్ట పైకెత్తి నీ కాళ్ళు నగ్నంగా చేసి నదులు దాటిపో.

[3] నిన్ను దిగంబరిగా చేయడం జరుగుతుంది. నీ అవమానం వెల్లడి అవుతుంది. నేను ప్రతీకారం చేస్తాను. నీలో ఎవరినీ దయతో సందర్శించను.”

[4] మా విముక్తిదాత పేరు సేనలప్రభువు యెహోవా. ఆయన ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు.

[5] “కల్దీయవాళ్ళ కుమారీ! మౌనం వహించి కూర్చో. చీకటిలోకి పో. ఇకనుంచి నిన్ను ‘రాజ్యాలకు యజమానురాలు’ అని ఎవరూ అనరు.

[6] నేను నా ప్రజమీద కోపగించాను, నా సొత్తును పాడు చేశాను, వారిని నీ చేతికి అప్పగించాను. నీవు వారిమీద ఏమీ కరుణ చూపలేదు. ముసలివారిమీద కూడా చాలా బరువైన కాడిమ్రాను మోపావు.

[7] నీవు అనుకొన్నావు, ‘నేను శాశ్వతంగా యజమానురాలుగా ఉంటాను.’ ఈ సంగతులను గురించి నీవు ఆలోచించలేదు. వాటి ఫలితమేమిటో తలచుకోలేదు.”

[8] “గనుక ఇప్పుడు ఈ మాట విను సుఖాసక్తురాలా! నిర్భయంగా ఉంటూ, ‘నేనే ఉన్నాను. నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను వితంతువును కాబోను. సంతాన నష్టం పొందను’ అనుకొనేదానా! ఈ మాట విను:

[9] ఒక్క రోజులోనే హఠాత్తుగానే ఈ రెండూ నీకు సంభవిస్తాయి నీవు వితంతువు అవుతావు, సంతాన నష్టం పొందుతావు. నీకు మహా మంత్రవిద్య ఉన్నా, నీ మంత్రాలు అత్యధికంగా ఉన్నా ఆ రెండు విపత్తులు నిండుగా అనుభవిస్తావు.

[10] నీ చెడుగులో నీవు నిర్భయంగా ఉన్నావు ‘ఎవరూ నన్ను చూడరు’ అనుకొన్నావు. ‘నేనే ఉన్నాను. నేను తప్ప ఇంకెవరూ లేరు’ అని నీవు అనుకొన్నావు. ఆ విధంగా నీ విద్య, నీ జ్ఞానం నిన్ను భ్రమపరచాయి.

[11] విపత్తు నీమీదికి వస్తుంది. నీ మంత్రాలతో దానిని పోగొట్టలేక పోతావు. కీడు నీమీద పడుతుంది. నీవు ప్రాయశ్చిత్తం చేసి దానిని రాకుండా చేయలేవు. నీకు తెలియని నాశనం నీమీదికి అకస్మాత్తుగా వస్తుంది.

[12] సరే, చిన్నప్పటినుంచి ప్రయాసతో నీవు అభ్యసించిన మంత్రవిద్యతో, నీ అనేక మంత్రాలతో ఉండిపో. ఒకవేళ వాటివల్ల నీకు సహాయం చేకూరుతుందేమో, ఇతరులకు భయం కలుగుతుందేమో, చూద్దాం.

[13] నీవు విన్న అనేక ఆలోచనలచేత నీవు అలసిపోయావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవాళ్ళు నిలబడి, నీమీదికి వచ్చే విపత్తు రాకుండా చేసి నిన్ను రక్షిస్తారేమో చూద్దాం.

[14] అసలు వాళ్ళు వరిగడ్డిలాంటివాళ్ళు. అగ్ని వాళ్ళను కాల్చివేస్తుంది. మంటల బారినుంచి తమనే తప్పించుకోలేరు. అది చలి కాచుకోవడానికి నిప్పు కాదు, ఎదుట కూర్చుని ఉండతగ్గ నిప్పు కాదు.

[15] నీవు ఎవరితో కష్టపడ్డావో, చిన్నప్పటినుంచి ఎవరితో వ్యవహరించావో వాళ్ళు అలాంటివాళ్ళు అవుతారు. ప్రతివాడూ అవతలకు దారి తప్పిపోతున్నాడు. నిన్ను రక్షించగల వాడంటూ ఎవడూ లేడు.

యెషయా — Chapters