Skip to content
Opens in a new window

[1] యెహోవా అంటున్నాడు: “నా రక్షణ ఆసన్నమైంది. నా నీతినిజాయితీ త్వరలో వెల్లడి అవుతుంది, గనుక న్యాయాన్ని పాటించండి, నిజాయితీతో ప్రవర్తించండి.

[2] ఇలా బ్రతుకుతూ, ఈ సంగతులలో దృఢంగా నిలుస్తూ ఉండేవ్యక్తి ధన్యజీవి. విశ్రాంతిదినాన్ని అపవిత్రం చేయక దానిని పాటిస్తూ, తన చేయి ఏ చెడుగూ చేయనియ్యకుండా ఉండేవ్యక్తి ధన్యజీవి.”

[3] యెహోవాపక్షం చేరిన ఏ విదేశీయుడూ “యెహోవా తన ప్రజలోనుంచి నన్ను వెలివేసితీరతాడు” అనుకోకూడదు. ఏ నపుంసకుడూ “నేను ఎండిన చెట్టును” అనుకోకూడదు.

[4] యెహోవా ఇలా అంటున్నాడు: “నా విశ్రాంతిదినాలను పాటిస్తూ, నాకు ఇష్టమైనవాటిని కోరుకొంటూ, నా ఒడంబడికలో దృఢంగా నిలుస్తూవుండే నపుంసకులకు

[5] నా ఆలయంలో నా గోడలలోపల ఒక భాగం ఇస్తాను. కొడుకులకంటే, కూతుళ్ళకంటే మంచి పేరుప్రతిష్ఠలు వారికి ప్రసాదిస్తాను. శాశ్వతమైన పేరుప్రతిష్ఠలు ప్రసాదిస్తాను. వాటిని ఎన్నటికీ కొట్టివేయడం జరగదు.

[6] విదేశీయులు ఆయనకు సేవ చేయడానికి, ఆయన పేరును ప్రేమించి ఆయనను ఆరాధించడానికి యెహోవా పక్షం చేరితే, విశ్రాంతిదినాన్ని అపవిత్రం చేయక పాటిస్తూ, నా ఒడంబడికలో దృఢంగా నిలుస్తూ ఉంటే,

[7] వారిని నా పవిత్ర పర్వతానికి తీసుకువస్తాను. నా ప్రార్థనాలయంలో వారిని ఆనందించేలా చేస్తాను. నా బలిపీఠంమీద వారు సమర్పించే హోమాలూ బలులూ నాకు అంగీకారంగా ఉన్నాయి. ఎందుకంటే నా ఆలయం జనాలన్నిటికీ ప్రార్థన ఆలయమని అంటారు.”

[8] ఇస్రాయేల్ ప్రజలలో చెదరిపోయినవారిని సమకూర్చే యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: “ఇంతకుముందు నేను సమకూర్చినవారు గాక ఇతరులను కూడా వారిదగ్గరికి సమకూరుస్తాను.”

[9] పొలంలో ఉన్న జంతువులారా! అడవిలో ఉన్న మృగాల్లారా! రండి! తినండి!

[10] ఈ ప్రజల కావలివాళ్ళు గుడ్డివాళ్ళు. వాళ్ళందరూ తెలివితక్కువవాళ్ళు. వాళ్ళందరూ మొరగలేని మూగ కుక్కలలాంటివాళ్ళు. పడుకొని కలలు కంటారు. నిద్ర అంటే వాళ్ళకు చాలా ఇష్టం.

[11] వాళ్ళు తిండికోసం అత్యాశ ఉన్న కుక్కలలాంటివాళ్ళు. ఎంత తిన్నా వాళ్ళకు తృప్తి కలగదు. వాళ్ళు తెలివి లేని కాపరులు. వాళ్ళందరూ తమకిష్టమైన త్రోవకు తొలగేవాళ్ళు. ప్రతివాడూ స్వలాభంకోసం వెదకుతాడు.

[12] వాళ్ళు అంటారు, “నేను ద్రాక్షమద్యం తెప్పిస్తాను. సారాయి కడుపునిండా త్రాగుదాం రండి. రేపు ఈ రోజులాగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది.”

యెషయా — Chapters