[1] ఇదిగో వినండి. సేనలప్రభువు యెహోవా పోషణ, ఆధారం జెరుసలంనుంచి, యూదానుంచి తీసివేయ బోతున్నాడు. అన్నపానాల ఆధారమంతా, పోషణ అంతా,
[2] బలాఢ్యులను సైనికులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదె చెప్పేవాళ్ళను, పెద్దలను,
[3] యాభైమందికి అధిపతులను, ఘనులను, ఆలోచనకర్తలను, శిల్పశాస్త్రంలో ఆరితేరినవాళ్ళను, యుక్తిగల మాంత్రికులను తీసివేయ బోతున్నాడు.
[4] నేను ఆ ప్రజలమీద అధిపతులుగా కుర్రవాళ్ళను నియమిస్తాను. పిల్ల చేష్టలు చేసేవాళ్ళు వాళ్ళను పరిపాలిస్తారు.
[5] ప్రజలలో ప్రతి ఒక్కరూ తోడివాళ్ళపట్ల, పొరుగువాళ్ళపట్ల కఠినంగా వ్యవహరిస్తారు. పెద్దలమీద యువకులూ, ఘనులమీద నీచులూ గర్వించి వారిని ఎదిరిస్తారు.
[6] ఒక మనిషి తన తండ్రి ఇంట్లో తన తోబుట్టినవాణ్ణి పట్టుకొని, “నీకు పైవస్త్రం ఉంది. మాకు నాయకుడుగా ఉండు, ఈ శిథిలాలను నీ అధీనంలో ఉంచుకో” అంటాడు.
[7] అయితే ఆ రోజున అతడు “నేను బాగు చేసేవాణ్ణి కాను. నా ఇంట్లో భోజనం, బట్టలు లేవు. నన్ను ప్రజానాయకుడుగా చేయకూడదు” అని చెప్తాడు.
[8] జెరుసలం తొట్రుపడింది. యూదా నాశనమయింది. వారి మాటలు, చర్యలు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి. వారు ఆయన ఘనమైన దృష్టికి తిరుగుబాటు చేస్తున్నారు.
[9] వారి ముఖకవళికలే వారిమీద సాక్ష్యం ఇస్తున్నాయి. తమ అపరాధాన్ని దాచిపెట్టక సొదొమ పట్టణంవాళ్ళలాగే దానిని ప్రదర్శిస్తున్నారు. తమమీదికి తామే విపత్తును తెచ్చిపెట్టు కొన్నారు. వారికి బాధ తప్పదు.
[10] “మీకు మేలు కలుగుతుంది” అని న్యాయవంతులతో చెప్పు. వారు తమ క్రియల ఫలితం అనుభవిస్తారు.
[11] దుర్మార్గులకు బాధ తప్పదు. వాళ్ళ వ్యవహారాలకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది.
[12] నా ప్రజలు! – యువకులు వారిని అణచివేస్తున్నారు, స్త్రీలు వారిని పరిపాలిస్తున్నారు! నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని త్రోవ తప్పిస్తున్నారు, మీ మార్గాలను నాశనం చేస్తున్నారు.
[13] యెహోవా వాదించడానికి నిలబడ్డాడు. ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలుచున్నాడు.
[14] యెహోవా తన ప్రజల పెద్దలకూ నాయకులకూ తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు నా ద్రాక్షతోటను నాశనం చేశారు. మీరు దోచుకొన్న దరిద్రుల వస్తువులు మీ ఇండ్లలో ఉన్నాయి.
[15] నా ప్రజలను నలగ్గొట్టడానికి, బీదల ముఖాలను నూరడానికి మీకు ఏమైనా హక్కు ఉందా?”
[16] యెహోవా ఇంకా చెప్పేదేమిటంటే, “సీయోను నగర స్త్రీలు విర్రవీగుతున్నారు. మెడ చాచి, ఓర చూపులు చూస్తూ, తమ కాళ్ళ గజ్జెలను మ్రోగిస్తూ, కులుకుతూ నడుస్తూ ఉండేవాళ్ళు.”
[17] అందుచేత ప్రభువు సీయోనునగర స్త్రీల నడినెత్తి వెండ్రుకలు ఊడిపడేలా చేస్తాడు. యెహోవా వాళ్ళ దిగంబరత్వం బట్టబయలు చేస్తాడు.
[18] ఆ రోజున ప్రభువు వాళ్ళ అలంకారాన్ని తీసివేస్తాడు – ఆ పాద కడియాలనూ, శిరో భూషణాలనూ, చంద్రవంక కంఠ భూషణాలనూ,
[19] చెవిపోగులనూ, గాజులనూ, ముసుకులనూ,
[20] కుళ్ళాయిలనూ, కాళ్ళ గొలుసులనూ, ఒడ్డాణాలనూ, పరిమళం బరిణెలనూ, తాయెత్తులనూ,
[21] ఉంగరాలనూ, ముక్కు కమ్ములనూ,
[22] చాలా వెల గల బట్టలనూ, పైవస్త్రాలనూ, పైటలనూ, డబ్బుసంచులనూ,
[23] చేతి అద్దాలనూ, శ్రేష్ఠమైన చేతి రుమాళ్ళనూ, తలగుడ్డలనూ, శాలువులనూ తీసివేస్తాడు.
[24] అప్పుడు పరిమళానికి బదులు కంపు, ఒడ్డాణాలకు బదులు త్రాడు, అల్లిన జడలకు బదులు బోడి తలలు, శ్రేష్ఠమైన దుస్తులకు బదులు గోనెపట్ట, అందానికి బదులు వాతలు ఉంటాయి.
[25] నీ మనుషులు ఖడ్గంచేత కూలుతారు. నీ బలాఢ్యులు యుద్ధంలో హతమవుతారు.
[26] సీయోను ద్వారాలకు రోదనం, దుఃఖం కలుగుతాయి. నగరం నిర్జనమై నేల కూర్చుని ఉంటుంది.