[1] హిజ్కియారాజు పరిపాలించిన పద్నాలుగో సంవత్సరంలో అష్షూరు రాజైన సన్‌హెరీబు యూదాలోకి వచ్చి, ప్రాకారాలూ కోటలూ ఉన్న పట్టణాలన్నిటిపైబడి వాటిని లోపరచుకొన్నాడు.
[2] అప్పుడు అష్షూరు రాజు లాకీషు పట్టణం నుంచి జెరుసలంలో ఉన్న హిజ్కియారాజు మీదికి రబ్‌షాకేను గొప్ప సైన్యంతో పంపాడు. అతడు చాకలి పొలానికి పోయే త్రోవలో ఉన్న పై కోనేటి కాలువ చివరలో ఆగాడు.
[3] హిల్కీయా కొడుకూ, రాజభవనం మీద అధికారి అయిన ఎల్‌యాకీం, లేఖకుడు షెబ్నా, కార్యదర్శి ఆసాపు కొడుకు అయిన యోవాహు అతడి దగ్గరికి వెళ్ళారు.
[4] రబ్‌షాకే వారితో ఇలా అన్నాడు: “ఈ మాట హిజ్కియాతో చెప్పండి: మహా రాజైన అష్షూరు రాజు చెప్పేదేమిటంటే, నీవు నమ్ముకొన్న ఆధారం ఎంతమాత్రం?
[5] యుద్ధంకోసం ఆలోచనకూ బలానికీ బదులుగా వట్టి మాటలు పెట్టవచ్చుననుకుంటున్నావా? నీవు ఎవడిమీద నమ్మకం ఉంచి నా మీద తిరగబడ్డావు?
[6] ఇదుగో నీవు ఈజిప్ట్‌దేశంమీద నమ్మకం పెట్టావు గదా. ఈజిప్ట్ నలిగిన జమ్మురెల్లులాంటిది. దానిమీద ఆనుకొన్నవాళ్ళ చేతిలోకి అది గుచ్చుకుపోతుంది. ఈజిప్ట్ రాజైన ఫరోమీద నమ్మకం ఉంచినవాళ్ళందరికీ అంతే.
[7] పోనీ, ఒకవేళ మీరు మీ దేవుడు యెహోవామీద నమ్మకం ఉంచినవారని నీవు అంటావేమో. అయితే హిజ్కియా తీసివేసినది యెహోవా ఎత్తయిన పూజా స్థలాలూ బలిపీఠాలూ కావా? యూదావాళ్ళతో, జెరుసలంవాళ్ళతో ‘జెరుసలంలో ఉన్న బలిపీఠం ఎదుటే మీరు పూజించాలి’ అని హిజ్కియా చెప్పాడు గదా!
[8] హిజ్కియా! ఇప్పుడు నా యజమాని అయిన అష్షూరు రాజుతో పోటీ చేయండి! రెండు వేల గుర్రాలమీద ఎక్కించడానికి నీ దగ్గర రౌతులుంటే వాటిని నీకిస్తాను!
[9] లేకపోతే, నీవు నా యజమాని సేవకులైన అధిపతులలో అత్యల్పుణ్ణి ఎలా ఎదిరిస్తావు? రథాలు, రౌతులకోసం నీవు ఈజిప్ట్‌మీద నమ్మకం ఉంచావు గదా!
[10] యెహోవా ఆదేశం లేకుండానే నేను ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాననుకున్నావా? దండెత్తి వెళ్ళి ఈ దేశాన్ని నాశనం చేయమని యెహోవా తానే నాతో చెప్పాడు.”
[11] అప్పుడు ఎల్‌యాకీం, షెబ్నా, యోవాహు “దయ చూపి మీ సేవకులైన మాతో సిరియా భాషలో మాట్లాడండి. ఆ భాష మాకు వస్తుంది. యూదుల భాషలో మాట్లాడకండి. గోడమీద ఉన్నవారు వింటున్నారు గదా” అని రబ్‌షాకేతో చెప్పారు.
[12] అందుకు రబ్‌షాకే అన్నాడు, “మీ యజమానితో, మీతో మాత్రమే ఈ మాటలు చెప్పడానికి నా యజమాని నన్ను పంపాడనుకొంటున్నావా? మీలాగే గోడమీద కూర్చుని ఉన్నవాళ్ళు తమ మలం తినేటట్టు, తమ మూత్రం త్రాగేటట్టు నా యజమాని నన్ను వాళ్ళదగ్గరికి కూడా పంపాడు గదా.”
[13] అప్పుడు రబ్‌షాకే నిలబడి, యూదుల భాషలో బిగ్గరగా ఇలా చాటించాడు: “మహారాజైన అష్షూరు రాజు చెప్పినది వినండి.
[14] రాజుగారు చెప్పేదేమిటంటే, హిజ్కియాచేత మోసపోకండి. అతడు మిమ్మల్ని తప్పించలేడు.
[15] హిజ్కియా అంటున్నాడు గదా – ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తాడు. ఆయన ఈ నగరం అష్షూరు రాజు వశం చేయడు.’ అలా చెప్పి మిమ్మల్ని యెహోవామీద నమ్మకం ఉంచేటట్టు చేయనియ్యకండి.
[16] హిజ్కియా చెప్పేమాట వినవద్దు. అష్షూరు రాజు ఇలా చెపుతున్నాడు: ‘మీరు నాతో శాంతి చేసుకోండి. నగరంనుంచి బయటికి నాదగ్గరికి రండి. నేను వచ్చేవరకు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్షచెట్టు పండ్లు, తన అంజూరు చెట్టు పండ్లు తింటూ తన బావిలోని నీళ్ళు త్రాగుతాడు.
[17] తరువాత నేను వచ్చి, మిమ్మల్ని మీ సొంత దేశంలాంటి దేశానికి తీసుకుపోతాను. అది గోధుమలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం. ఆహారం, ద్రాక్ష తోటలున్న దేశం.’
[18] కనుక హిజ్కియా ‘యెహోవా మనల్ని విడిపిస్తాడు’ అంటూ మిమ్మల్ని నమ్మించడానికి చూస్తూ ఉంటే అతడి మాట మీరు వినవద్దు. ఏ దేశంవాళ్ళనయినా ఏ దేవుడైనా అష్షూరు రాజు చేతినుంచి విడిపించాడా?
[19] హమాతు, అర్పాదు పట్టణాల దేవుళ్ళు ఎక్కడ? సెపర్‌వయీంవాళ్ళ దేవుళ్ళు ఎక్కడ? ఏ దేవుడైనా షోమ్రోనును నా చేతిలోనుంచి విడిపించలేదేం?
[20] దేవుళ్ళలో ఏ దేవుడైనా తన దేశాన్ని నా చేతిలో నుంచి ఎప్పుడైనా విడిపించాడా చెప్పండి? యెహోవా నా చేతిలోనుంచి జెరుసలంను ఎలా విడిపిస్తాడు?”
[21] అంతకుముందు హిజ్కియారాజు “అతడికి ఏమీ జవాబు చెప్పకూడద”ని ప్రజలకు ఆజ్ఞ జారీ చేశాడు, గనుక వారు మౌనం వహించి ఒక్క మాట కూడా బదులు చెప్పలేదు.
[22] అప్పుడు రాజభవనం మీద అధికారీ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్‌యాకీం, లేఖకుడైన షెబ్నా, కార్యదర్శి ఆసాపు కొడుకు అయిన యోవాహు తమ బట్టలు చింపుకొని, హిజ్కియా దగ్గరికి వచ్చారు. రబ్‌షాకే మాటలు అతనికి తెలియజేశారు.