Skip to content
Opens in a new window

[1] “అరీయేల్‌కు బాధ! దావీదు కాపురం ఏర్పరచుకొన్న అరీయేల్ నగరానికి బాధ! సంవత్సరం వెంట సంవత్సరం గడవనియ్యండి. మీ పండుగలను క్రమంగా జరగనియ్యండి.

[2] అయితే నేను అరీయేల్‌కు కష్టదశ రప్పిస్తాను. దానిలో దుఃఖం, విలాపం ఉంటాయి. అది నాకు నిప్పుగూడులాగా ఉంటుంది.

[3] నేను నీ చుట్టూరా ముట్టడి వేస్తాను. నీకెదురుగా కోట కట్టి, ముట్టడి దిబ్బలు వేస్తాను.

[4] అప్పుడు నీవు అణగారిపోయి నేలనుంచి మాట్లాడుతావు. నీ మాటలు దుమ్మునుంచి నిట్టూర్పులలాగా వస్తాయి. నీ స్వరం శవం స్వరంలాగా నేలనుంచి వస్తుంది. నీ పలుకులు దుమ్ములోనుంచి గుసగుసలుగా వినబడుతాయి.”

[5] హఠాత్తుగా ఒక్క క్షణంలో నీ శత్రువుల సమూహం ధూళిగా మారుతుంది, ఆ క్రూరుల మూకలు ఎగిరిపోయే పొట్టులాగా అవుతాయి.

[6] ఉరుముతో, భూకంపంతో, మహా శబ్దంతో, సుడిగాలితో, తుఫానుతో, నాశనం చేసే మంటలతో సేనలప్రభువు యెహోవా నిన్ను సందర్శిస్తాడు.

[7] అరీయేల్‌తో యుద్ధం చేసే సమస్త జనాల సమూహాలు, పోరాడుతూ దానినీ దాని కోటనూ ముట్టడించే వాళ్ళంతా రాత్రి వచ్చే కలలాగా ఉంటారు, స్వప్న దర్శనంలాగా ఉంటారు.

[8] ఆకలిగొన్నవాడు కలలో భోజనం చేస్తాడు గాని, మేల్కొన్నప్పుడు ఇంకా ఆకలితోనే ఉంటాడు. దప్పిగొన్నవాడు కలలో నీళ్ళు త్రాగుతాడు గాని, మేల్కొన్నప్పుడు ఇంకా దాహంతోనే నీరసిస్తూ ఉంటాడు. సీయోను కొండపైబడి యుద్ధం చేసే సమస్త జనాల సమూహాలకూ అలాగే ఉంటుంది.

[9] జాగు చేయండి! నివ్వెరపడండి! మిమ్మల్ని మీరే గ్రుడ్డివారుగా చేసుకోండి! చూపు లేకుండా ఉండండి! ద్రాక్షమద్యం త్రాగకుండా మత్తుగా ఉండండి! మద్యపానం లేకుండా తూలుతూ ఉండండి!

[10] యెహోవా మిమ్మల్ని గాఢ నిద్రామత్తులను చేశాడు, మీ కండ్లను మూసివేశాడు, మీ తలలకు ముసుకు వేశాడు.

[11] మీకు ఈ దర్శనమంతా ముద్రలచేత ముద్రించిన పుస్తకంలో ఉన్న మాటలలాగా ఉంది. ఆ పుస్తకం చదువు వచ్చినవాడికి ఇచ్చి “దయచేసి దీనిని చదవండి” అని అడిగితే, అతడు అంటాడు గదా “చదవలేను. అది ముద్రలు వేసి మూయబడి ఉంది.”

[12] చదువులేని వాడికిచ్చి “దయచేసి దీనిని చదవండి” అని అడిగితే, అతడు “నాకు చదువు రాదు” అంటాడు గదా.

[13] ప్రభువు అంటున్నాడు: “ఈ ప్రజలు నోటి మాటలతో నాదగ్గరికి వస్తున్నారు. తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు గాని, వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వాళ్ళు నాపట్ల చూపే భయభక్తులకు మానవ కల్పితమైన నియమాలే ఆధారం.

[14] అందుచేత మరోసారి నేను ఈ ప్రజలపట్ల అద్భుతం జరిగిస్తాను, చాలా ఆశ్చర్యకరమైన అద్భుతం జరిగిస్తాను. వారి జ్ఞానుల జ్ఞానం గతించిపోతుంది, వారి తెలివి అంతర్ధానమైపోతుంది.”

[15] తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని దాచిపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళకు బాధ తప్పదు. “మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలుసు?” అనుకొని చీకటిలో తమ క్రియలు చేసేవాళ్ళకు బాధ తప్పదు.

[16] మీది ఎంత వక్రబుద్ధి! కుమ్మరి మట్టికంటే మించినవాడు కాడనుకొంటారా? చేయబడ్డ వస్తువు దానిని చేసినవాణ్ణి గురించి “అతడు నన్ను చేయలేదు” అనవచ్చా? పాత్ర దానిని రూపొందించిన వ్యక్తిని గురించి “అతడికి ఏమీ తెలివి లేదు” అనవచ్చా?

[17] ఇంకా కొద్దికాలంలోనే లెబానోను ఫలవంతమైన తోట అవుతుంది గదా. ఆ ఫలవంతమైన తోట అడవి అనిపించుకొంటుంది.

[18] ఆ రోజున పుస్తకం చదివి వినిపిస్తే చెవిటివారు ఆ మాటలు వింటారు. గుడ్డివారు చీకటిలోనుంచి, గాఢాంధకారంలోనుంచి చూడగలుగుతారు.

[19] యెహోవా కారణంగా దీనులు మరి ఎక్కువగా సంతోషిస్తారు. అందరిలో బీదలు ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి కారణంగా ఆనందిస్తారు.

[20] దౌర్జన్యపరులు లేకుండా పోతారు. పరిహాసకులు గతించిపోతారు. చెడుగు చేయడానికి చూచేవాళ్ళంతా నాశనం అవుతారు.

[21] ఒక్క మాటతో ఇతరులను అపరాధులుగా చేసేవాళ్ళు, న్యాయస్థానంలో వాదించేవాళ్ళను చేజిక్కించుకొనే వాళ్ళు, మాయ మాటలు చేత నిర్దోషులకు న్యాయం చేకూరకుండా చేసేవాళ్ళు నాశనం అవుతారు.

[22] అందుచేత అబ్రాహామును విడుదల చేసిన యెహోవా యాకోబువంశాన్ని గురించి ఇలా అంటున్నాడు: “ఇకమీదట యాకోబు ప్రజలు సిగ్గుపడరు. ఇప్పుడు వారి ముఖాలు పాలిపోవు.

[23] వారి సంతానం, వారి మధ్య నేను చేతులతో చేసిన క్రియను చూచినప్పుడు నా పేరు పవిత్రమని భావించుకొంటారు. యాకోబుయొక్క పవిత్రుడి పవిత్రతను ఒప్పుకొంటారు. ఇస్రాయేల్ యొక్క దేవునిపట్ల భయభక్తులతో ప్రవర్తిస్తారు.

[24] దారి తప్పినవారు వచ్చి జ్ఞానం నేర్చుకొంటారు. సణిగినవారు ఉపదేశానికి లోబడుతారు.”

యెషయా — Chapters