Skip to content
Opens in a new window

[1] ఆ విషయం విని హిజ్కియారాజు తన బట్టలు చింపుకొన్నాడు, గోనెపట్ట కట్టుకొని యెహోవా ఆలయంలోకి వెళ్ళాడు,

[2] రాజభవనంమీద అధికారి అయిన ఎల్‌యాకీంను, లేఖకుడు షెబ్నాను, యాజులలో పెద్దవారిని ఆమోజు కొడుకైన యెషయాప్రవక్తదగ్గరికి పంపాడు. వారంతా గోనెపట్ట కట్టుకొన్నారు.

[3] వారు యెషయాతో ఇలా అన్నారు: “హిజ్కియా చెప్పేదేమిటంటే, ఈ రోజు బాధ, చీవాట్లు, తిరస్కారం ఉన్న రోజు. కాన్పుకు వచ్చి, కనేశక్తిలేని స్త్రీలాగా ఉన్నాం.

[4] జీవం గల దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజు తన సేవకుడైన రబ్‌షాకేను పంపించాడు. ఒకవేళ రబ్‌షాకే పలికిన మాటలు మీ దేవుడు యెహోవా విని, అష్షూరు రాజును శిక్షిస్తాడేమో. ఇక్కడ మిగిలి ఉన్న వారికోసం ప్రార్థించండి.”

[5] హిజ్కియారాజు సేవకులు యెషయాదగ్గరికి వచ్చిన తరువాత అతడు వారితో ఇలా అన్నాడు:

[6] “మీ యజమానితో ఇలా చెప్పండి యెహోవా చెప్పేదేమిటంటే, అష్షూరు రాజు క్రిందివాళ్ళు నన్ను దూషిస్తూ చెప్పిన మాటలు నీవు విన్నావు. ఆ మాటల కారణంగా భయపడవద్దు.

[7] ఇదిగో విను; నేను అతడి మనసుకు ఒక ఆలోచన పుట్టిస్తాను. అతడు వదంతి విని తన సొంత దేశానికి తిరిగి వెళ్తాడు. తన సొంత దేశంలోనే అతడు ఖడ్గంచేత కూలేలా చేస్తాను.”

[8] అంతలో అష్షూరు రాజు లాకీషును విడిచివెళ్ళి లిబ్నాను ముట్టడిస్తూ ఉన్నాడు. అది విని, రబ్‌షాకే తిరిగి వెళ్ళి అష్షూరు రాజును కలుసుకొన్నాడు.

[9] కూషు రాజైన తిర్‌హాకా తనమీదికి యుద్ధానికి బయలుదేరి వస్తున్నట్టు అష్షూరు రాజు విన్నాడు. గనుక అతడు వార్తాహరులను హిజ్కియాదగ్గరికి పంపిస్తూ ఇలా అన్నాడు:

[10] “మీరు యూదా రాజైన హిజ్కియాకు ఈ విధంగా చెప్పాలి: జెరుసలం అష్షూరు రాజు వశంలోకి రాదని నీవు నమ్ముకొన్న నీ దేవుడు చెపితే ఆయన నిన్ను మోసగించకుండా చూచుకో!

[11] అష్షూరు రాజులు దేశాలన్నిటినీ పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినవచ్చింది గదా. నీవు మాత్రం తప్పించుకొంటానని అనుకుంటున్నావా?

[12] గోజాను, హారాను, రెజెఫ్‌లను, తెలశ్శార్ పట్టణంలో ఉండే ఏదెన్‌వాళ్ళను నా పూర్వీకులు నాశనం చేసినప్పుడు ఆ జనాల దేవుళ్ళు వాళ్ళను విడిపించారా?

[13] హమాతు పట్టణం రాజు ఏమయ్యాడు? అర్పాద్ పట్టణం రాజు ఏమయ్యాడు? సెపర్వయీం, హేన, ఇవ్వా రాజులు ఏమయ్యారు?”

[14] హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ లేఖ అందుకొని దానిని చదివాడు. అప్పుడతడు యెహోవా ఆలయానికి వెళ్ళి యెహోవా సముఖంలో ఆ లేఖ తెరచి పరిచాడు.

[15] యెహోవా సన్నిధానంలో హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు:

[16] “సేనలప్రభువు యెహోవా! ఇస్రాయేల్ ప్రజల దేవా! కెరూబుల పైగా సింహాసనాసీనుడా! నీవే దేవుడవు. భూరాజ్యాలన్నిటిమీదా నీవు ఒక్కడవే దేవుడవు. ఆకాశాలు, భూమి కలగజేసినది నీవే.

[17] యెహోవా! చెవిబెట్టి దేవుణ్ణి దూషించడానికి సన్‌హెరీబు చెప్పి పంపిన పలుకులు విను.

[18] యెహోవా! అష్షూరు రాజులు జనాలన్నిటినీ వాళ్ళ దేశాలను నిజంగా పాడు చేశారు,

[19] వాళ్ళ దేవుళ్ళను మంటలపాలు చేశారు. అయితే ఆ దేవుళ్ళలో ఎవడూ దేవుడు కాదు గాని, కర్రతోనో రాళ్ళతోనో మనుషులు చేతులతో చేసిన పనులే. అందుచేతే వాళ్ళు ఆ దేవుళ్ళను నాశనం చేయగలిగారు.

[20] యెహోవా! మా దేవా! దయచూపి మమ్మల్ని సన్‌హెరీబు చేతిలోనుంచి విడిపించు. అప్పుడు, యెహోవా, నీవు ఒక్కడవే దేవుడవని భూరాజ్యాలన్నిటిలో ఉన్న ప్రజలు తెలుసుకొంటారు.”

[21] అప్పుడు ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకు ఇలా కబురంపాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: నీవు అష్షూరు రాజైన సన్‌హెరీబును గురించి నాకు ప్రార్థన చేశావు,

[22] గనుక అతణ్ణి గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: కన్య సీయోను నిన్ను తిరస్కారం చేస్తూ వెక్కిరిస్తూ ఉంది. జెరుసలం కుమారి నీ వెనుక తల ఊపుతూ ఉంది.

[23] నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరిమీద నీవు కేకలు పెట్టావు? గర్వంగా తలెత్తి చూచినది ఎవరి వైపు? ఇస్రాయేల్ ప్రజల పవిత్రుణ్ణి వ్యతిరేకించి ఇదంతా చేస్తూ ఉన్నావు,

[24] నీవు పంపినవాళ్ళ ద్వారా యెహోవాను దూషించావు. నీవు అన్నావు, ‘నాకు చాలా రథాలున్నాయి. వాటితో పర్వతాల శిఖరాలమీదికి ఎక్కాను. లెబానోను చివరి ప్రాంతాల దాకా వెళ్ళాను. అక్కడి ఎత్తయిన దేవదారు చెట్లను, సరళ వృక్షాలను నరికివేశాను. లెబానోను చివరి సరిహద్దుల వరకు, దాని సారవంతమైన అడవికి చేరుకున్నాను.

[25] నేను నీళ్ళ బావులు త్రవ్వాను. పరుల నీళ్ళు త్రాగాను. నేను ఈజిప్ట్‌లో అడుగు పెట్టి, ఈజిప్ట్ నదులన్నీ ఇంకిపోయేలా చేశాను.’

[26] “అయితే అలా జరగాలని చాలా కాలం క్రిందట నేనే నిర్ణయించానని నీవు వినలేదా? పూర్వకాలంలో దానిని సంకల్పించాను. ఇప్పుడు అలా జరిగేలా చేశాను. నీవు ప్రాకారాలూ కోటలూ ఉన్న పట్టణాలను పాడు చేసి కుప్పలుగా చేయడం నావల్లే జరిగింది.

[27] ఆ పట్టణాలవాళ్ళు దిక్కులేకుండా భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వాళ్ళు పొలంలో మొక్కలు, పచ్చని మొలకల్లాంటివారు. ఇంటికప్పుమీద పెరగకముందే మాడిపోయిన గడ్డిలాంటివారు.

[28] నీవు కూర్చోవడం, వెళ్ళడం, రావడం నాకు తెలుసు. నాకు వ్యతిరేకమైన నీ ఉద్రేకం కూడా తెలుసు.

[29] నాకు వ్యతిరేకమైన నీ ఉద్రేకం, నీ గర్వం విషయం నా చెవిని పడింది, గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్ళెం నీ నోటికి పెడతాను. నిన్ను త్రిప్పి, నీవు వచ్చిన దారినే పోయేలా చేస్తాను.

[30] “హిజ్కియా, దానికి నీకిదే సూచన ఈ సంవత్సరం ఊరకనే పండేది తింటావు. రెండో ఏట దానినుంచి కలిగే ధాన్యం తింటావు. మూడో ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్ష తోటలు నాటి, వాటి పండ్లు తింటారు.

[31] యూదావంశంలో శేషం క్రిందికి వేళ్ళు తన్ని, చిగిరించి, ఫలిస్తుంది.

[32] జెరుసలం నుంచి శేషం, సీయోనుకొండ నుంచి తప్పించుకొన్నవారు బయలు దేరుతారు. సేనలప్రభువు యెహోవా ఆసక్తి ఇది సాధిస్తుంది.

[33] కనుక అష్షూరు రాజు విషయం యెహోవా ఇలా చెపుతున్నాడు: అతడు ఈ నగరంలో అడుగు పెట్టడు. బాణం కూడా వేయడు. డాలు పట్టుకొని ఈ నగరం దగ్గరికి రాడు. ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.

[34] అతడు వచ్చినదారినే తిరిగి వెళ్ళిపోతాడు. అతడు ఈ నగరంలోకి రాడు. ఇది యెహోవా వాక్కు.

[35] నా కోసం, నా సేవకుడైన దావీదుకోసం నేను ఈ నగరాన్ని కాపాడి రక్షిస్తాను.”

[36] అప్పుడు యెహోవా దూత బయలుదేరి, అష్షూరువాళ్ళ శిబిరంలో లక్ష ఎనభై అయిదు వేలమందిని హతం చేశాడు. ప్రొద్దున మనుషులు లేచి చూస్తే వారంతా మృతదేహాలు!

[37] అప్పుడు అష్షూరు రాజైన సన్‌హెరీబు తిరిగి వెళ్ళిపోయాడు. నీనెవె నగరం చేరి అక్కడ ఉండిపోయాడు.

[38] ఒకరోజు అతడు నిసరోక్ అనే తన దేవుడి గుడిలో పూజ చేస్తూ ఉంటే, తన కొడుకులు అద్రెమ్మెలెక్, షరెజెర్ ఖడ్గంతో అతణ్ణి చంపారు, అరారాతు ప్రాంతానికి పారిపోయారు. అతడి స్థానంలో అతడి కొడుకు ఏసర్‌హద్దోను రాజయ్యాడు.

యెషయా — Chapters