Skip to content
Opens in a new window

[1] నా ప్రియుణ్ణి గురించి పాడుతాను. నా ప్రియుడి ద్రాక్షతోట విషయం పాడుతాను. సారవంతమైన భూమి ఉన్న కొండమీద నా ప్రియుడికి ద్రాక్షతోట ఉంది.

[2] ఆయన దాన్ని బాగా త్రవ్వాడు. రాళ్ళను తీసివేశాడు. దానిలో మేలిరకం ద్రాక్ష తీగె నాటించాడు. తోట మధ్య కావలిగోపురం కట్టాడు. దానిలో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించాడు. ద్రాక్ష పండ్లు పండాలని ఎదురు చూశాడు. కాని, అది కాసినది కారు ద్రాక్షలే.

[3] “అందుచేత జెరుసలం కాపురస్తులారా, యూదా వారలారా, నా ద్రాక్షతోట విషయం నాకు న్యాయం చెప్పండి.

[4] నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటే చేయగలిగినది ఇంకేమిటి? ద్రాక్షపండ్లకోసం నేను ఎదురు చూస్తే అది ఎందుకు కారు ద్రాక్షలు కాసింది?

[5] “ఇప్పుడు నేను నా ద్రాక్షతోటకు ఏమి చేస్తానో మీకు తెలియచేస్తాను, వినండి. దాని కంచెను తీసివేస్తాను. తోట నాశనం అవుతుంది. దాని గోడ పడగొట్టివేస్తాను. ఇతరులు దానిని త్రొక్కుతారు.

[6] తోట పాడుపడేలా చేస్తాను. దానిని చక్కబెట్టడం, పారతో త్రవ్వడం జరగదు. దానిలో ముండ్లచెట్లు, కంటకాలు మొలుస్తాయి. దానిమీద వర్షించవద్దని మేఘాలకు ఆజ్ఞ జారీ చేస్తాను.”

[7] సేనలప్రభువైన యెహోవా ద్రాక్షతోట ఇస్రాయేల్ వంశమే. ఆయనకు ఇష్టమైన వనం యూదావారే. న్యాయం కనబడాలని ఎదురు చూశాడు కాని, కనిపించినది రక్తపాతమే. న్యాయం కావాలని చూశాడు గాని, రోదనం మాత్రమే వినబడింది.

[8] మీరు మాత్రమే దేశంలో ఉండాలని స్థలం మిగులకుండా ఉండేవరకు ఇంటికి ఇల్లు కలుపుకొంటూ, పొలానికి పొలం చేర్చుకొంటూ ఉండేవారలారా, మీకు బాధ తప్పదు.

[9] సేనలప్రభువు యెహోవా ఇలా తేటగా చెప్పడం నేను విన్నాను: “నిజంగా ఘనమైన గొప్ప ఇండ్లు అనేకం పాడైపోతాయి. వాటిలో ఎవరూ కాపురముండరు.

[10] పది ఎకరాల ద్రాక్షతోట ఇరవై లీటర్ల రసం మాత్రమే ఇస్తుంది. పది తూముల గింజల పంట తూము మాత్రమే అవుతుంది.”

[11] మద్యం త్రాగాలని ఉదయమే లేచి, ద్రాక్షమద్యం తమకు మంట పుట్టించేవరకు చాలా రాత్రివరకు తాగేవాళ్ళకు బాధ తప్పదు.

[12] వాళ్ళ విందులలో ఆయా తంతివాద్యాలు, కంజర్లు, పిల్లనగ్రోవులు, ద్రాక్షమద్యం ఉంటాయి. వాళ్ళు యెహోవా చర్యలను గమనించరు. ఆయన చేతులు చేసినవాటి విషయంలో అలక్ష్యంగా ఉన్నారు.

[13] అందుచేత, నా ప్రజలు తెలివి లేక, బందీలుగా దేశాంతరం పోతారు, వారిలో ఘనులు ఆహారం లేక పస్తుంటారు. సామాన్యులు దప్పిచేత నీరసించిపోతారు.

[14] కనుక మృత్యులోకం గొప్ప ఆశపెట్టుకొని, అపరిమితంగా నోరు తెరుస్తూ ఉంది; జెరుసలం ఘనులూ సామాన్యులూ దాని అల్లరి, ఉత్సవ ధ్వనులతోపాటు అందులోకి దిగిపోతారు.

[15] అల్పులూ ఘనులూ అణగిపోతారు. గర్విష్ఠుల చూపు క్రుంగిపోతుంది.

[16] అయితే సేనలప్రభువు యెహోవా తీర్పు తీర్చి గౌరవం పొందుతాడు. పవిత్రుడైన దేవుడు తన న్యాయవర్తన మూలంగా తాను పవిత్రుడుగా కనుపరుచు కొంటాడు.

[17] అప్పుడు అక్కడి గొర్రెపిల్లలు తమ పచ్చిక మైదానాలలో ఉన్నట్టే మేస్తాయి. గొప్పవాళ్ళ శిథిలాల మధ్య పరాయివాళ్ళు భోజనం చేస్తారు.

[18] అబద్ధం అనే త్రాళ్ళతో చెడుగును లాక్కొనేవాళ్ళకు బాధ తప్పదు. బండి మేకులతో లాక్కొన్నట్టు పాపాన్ని లాక్కొనేవాళ్ళకు బాధ తప్పదు.

[19] “మేము దేవుని క్రియ చూచేలా ఆయన త్వరపడి దానిని శీఘ్రంగా ముగించాలి. మేము ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి సంకల్పాన్ని తెలుసుకొనేలా దానిని నెరవేరనియ్యి” అనేవాళ్ళకు బాధ తప్పదు.

[20] చెడుగును మంచి, మంచిని చెడుగు అనేవాళ్ళకు బాధ తప్పదు.

[21] తమ దృష్టికి తాము తెలివైనవాళ్ళమని, తమ అంచనాలో తాము వివేకంగల వాళ్ళమని భావించుకొనేవాళ్ళకు బాధ తప్పదు.

[22] ద్రాక్షమద్యం త్రాగడంలో వీరులకూ వేరు వేరు మద్యపానాలను కలపడంలో సామర్థ్యం గలవాళ్ళకూ బాధ తప్పదు.

[23] లంచం తీసుకొని దుర్మార్గులు నిర్దోషులని తీర్పు తీర్చి, నిర్దోషులకు న్యాయాన్ని చేకూర్చకుండా ఉండేవాళ్ళకు బాధ తప్పదు.

[24] వాళ్ళు సేనలప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడి వాక్కును తృణీకరించారు, గనుక మంటలు చెత్తను కాల్చివేసే విధంగా, ఎండిన గడ్డి మంటల్లో బూడిద అయ్యేవిధంగా, వాళ్ళ వేరు కుళ్ళిపోతుంది. వాళ్ళ పువ్వు దుమ్ములాగా పైకి ఎగిరిపోతుంది.

[25] వాళ్ళ ప్రవర్తన కారణంగా యెహోవా కోపం ఆయన ప్రజలమీద మండుతూ ఉంది. ఆయన వాళ్ళమీదికి చేయి చాచి వాళ్ళను కొట్టాడు. పర్వతాలు వణికాయి. ఇంతగా జరిగినా ఆయన కోపం చల్లారలేదు. తన చేయి ఇంకా చాపుతూ ఉన్నాడు.

[26] ఆయన దూరంగా ఉన్న జనాలకు పతాకం ఎత్తుతాడు. భూమి కొననుంచి సైన్యాన్ని రప్పించడానికి ఈల వేస్తాడు. అదిగో అది శీఘ్రంగా, వేగంగా వస్తూ ఉంది.

[27] వాళ్ళలో ఎవడూ అలసిపోవడం లేదు. తొట్రుపడడం లేదు. ఎవడూ నిద్రపోవడం లేదు, కునకడం లేదు. ఎవడి నడికట్టూ విడిపోవడం లేదు, ఎవడి పాదరక్షలవారూ తెగిపోవడం లేదు.

[28] వాళ్ళ బాణాలు పదును గలవి. వాళ్ళ విండ్లన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి. వాళ్ళ గుర్రాల డెక్కలు చెకుముకి రాళ్ళలాంటివి. వాళ్ళ రథ చక్రాలు సుడిగాలిలాగా తిరుగుతూ ఉన్నాయి.

[29] వాళ్ళ గర్జన ఆడసింహం చేసే గర్జనలాంటిది. వాళ్ళు కొదమ సింహాలలాగా గర్జిస్తూ ఉన్నారు. వేటను పట్టుకొని గుర్రుమనే ధ్వని చేస్తూ ఉన్నారు. దానిని ఎత్తుకుపోతారు. తప్పించేవాడెవడూ లేడు.

[30] ఆ రోజున వాళ్ళు జనంమీద సముద్రఘోషలాగా గర్జన చేస్తారు. ఎవరైనా దేశంవైపు చూస్తే చీకటి, దురవస్థ కనిపిస్తాయి. అక్కడి మబ్బులచేత వెలుగు కూడా చీకటి అవుతుంది.

యెషయా — Chapters