Skip to content
Opens in a new window

[1] ఇది యూదా దేశాన్ని గురించి, జెరుసలం గురించి ఆమోజు కొడుకు యెషయాకు వచ్చిన దర్శనం. ఇది యూదా రాజులు ఉజ్జియా, యోతాం, ఆహాజు, హిజ్కియా రోజులలో వచ్చినది.

[2] ఆకాశాల్లారా, ఆలకించండి! భూమీ, విను! యెహోవా ఇలా మాట్లాడుతున్నాడు: “నేను పిల్లలను పెంచి పోషించాను. వారు నాకు ఎదురు తిరిగారు.

[3] ఎద్దుకు తన యజమాని తెలుసు, గాడిదకు సొంతగాడు మేత పెట్టే స్థలం తెలుసు. గాని, ఇస్రాయేల్ జనానికి తెలివి లేదు. నా ప్రజ గ్రహించరు.”

[4] అయ్యో! ఇది పాపిష్టి జనం. అపరాధాల మోత క్రింద వంగిపోయిన ప్రజ, చెడుగు చేసేవంశం, వినాశకరమైన జాతి. వారికి బాధ తప్పదు. వారు యెహోవాను వదలిపెట్టారు, ఇస్రాయేల్ ప్రజల పవిత్రుణ్ణి తిరస్కరించారు, ఆయనను విడిచి తొలగిపోయారు.

[5] మీరు ఇంకా తిరుగుబాటు చేస్తూ, దెబ్బలకు గురి అవుతారెందుకు? మీ తల అంతా గాయాలే! మీ గుండె అంతా నీరసించిపోయింది.

[6] అరికాలినుంచి నెత్తివరకు క్షేమం అంటూ ఎక్కడా లేదు. అంతటా గాయాలూ దెబ్బలూ పచ్చి పుండ్లూ. వాటిని ఎవ్వరూ పిండలేదు, కట్టలేదు, నూనెతో మెత్తన చేయలేదు.

[7] మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు తగలబడి పోయాయి. మీ ఎదుటే విదేశీయులు మీ భూమి పంట మింగివేస్తున్నారు. ఈ నాశనం ఇతర జనాలకు జరిగే నాశనంలాంటిది.

[8] సీయోను కుమారి మిగిలి ఉంది. అది ద్రాక్షతోటలో ఉన్న గుడిసెలాగా, దోసపాదుల మధ్య ఉన్న పాకలాగా ఉంది; ముట్టడికి గురి అయిన పట్టణంలాంటిది.

[9] సేనల ప్రభువు యెహోవా మనలో కొద్దిమందిని బ్రతకనిచ్చాడు; లేకపోతే మనం సొదొమ, గొమొర్రాలాగా అయివుండేవాళ్ళమే.

[10] సొదొమ నాయకులారా! యెహోవా వాక్కు ఆలకించండి. గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశం వినండి.

[11] యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు చేసే అనేక బలులు నాకెందుకు? హోమాలుగా అర్పించిన పొట్టేళ్ళు, బాగా మేసిన పశువుల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి. ఎద్దుల రక్తం, గొర్రెపిల్లల రక్తం, మేకల రక్తం అంటే నాకేమి ఇష్టం లేదు.

[12] మీరు నా సన్నిధానంలోకి వచ్చేటప్పుడు నా ఆవరణాలను త్రొక్కమని మిమ్మల్ని ఎవరు అడిగారు?

[13] ఇకనుంచి మీ వ్యర్థ నైవేద్యాలను తేవద్దు. మీరు అర్పించే ధూపం నాకు అసహ్యం! అమావాస్య, విశ్రాంతి దినాలు, సభలు జరుగుతూనే ఉన్నాయి గాని, మీ దుష్ట సమావేశాలను నేను ఓర్చుకోలేను.

[14] మీ అమావాస్య ఉత్సవాలూ నియామకమైన పండుగలూ నాకు అసహ్యం! అవి నాకు బాధకరం! వాటిని సహించలేక విసుగు చెందాను!

[15] “మీరు మీ చేతులు చాపి ప్రార్థన చేసేటప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు దాచుకొంటాను. మీరు ఎంత ప్రార్థించినా నేను చెవినిబెట్టను. మీ చేతులనిండా రక్తమే.

[16] కడుక్కోండి! మిమ్మల్ని శుద్ధి చేసుకోండి! మీ చెడు క్రియలు నాకు కనబడకుండా తొలగించివేయండి. చెడుగు చేయడం మానండి!

[17] మంచి చేయడం నేర్చుకోండి! న్యాయాన్ని అనుసరించండి! హింసకు గురి అయినవారిని విడిపించండి! తండ్రి లేని పిల్లలకు న్యాయం చేకూర్చండి! వితంతువుల పక్షాన వాదించండి!”

[18] యెహోవా అంటున్నాడు: “రండి, మన వివాదం తీర్చుకొందాం. మీ పాపాలు రక్తవర్ణమైనా అవి మంచులాగా తెల్లగా అవుతాయి. అవి కెంపులాగా ఎర్రనివైనా అవి తెల్లని గొర్రె బొచ్చులాగా తెల్లగా అవుతాయి.

[19] మీరు ఇష్ట పూర్వకంగా నా మాట వింటే భూమిమీద ఉన్న మంచివాటిని తింటారు.

[20] సమ్మతించక, తిరుగుబాటు చేస్తే మీరు కత్తిపాలు అవుతారు.” ఇది యెహోవా నోటినుంచి వచ్చిన మాట.

[21] అయ్యో, నమ్మకమైన నగరం వేశ్యలాగా అయిపోయింది! ఒకప్పుడు అది న్యాయంతో నిండి ఉన్నది. అది నీతినిజాయితీకి ఉనికిపట్టే! ఇప్పుడైతే దానిలో హంతకులు కాపురముంటున్నారు.

[22] నీ వెండి కల్మషం అయింది, నీ ద్రాక్షరసం నీళ్ళతో కలిసి చెడిపోయింది.

[23] నీ అధికారులు ద్రోహులు, దొంగల మిత్రులు. లంచం అంటే వాళ్ళకు చాలా ఇష్టం. వాళ్ళు బహుమతులకోసం తహతహలాడుతూ ఉండేవాళ్ళు. తండ్రి లేని పిల్లలకు న్యాయం చేకూర్చరు. వితంతువుల వ్యాజ్యాలు విచారించరు.

[24] అందుచేత సేనలప్రభువు యెహోవా – ఇస్రాయేల్ ప్రజల బలాఢ్యుడు – ఇలా అంటున్నాడు: “నా శత్రువుల విషయం నాకు ఉపశమనం కలుగుతుంది. నా విరోధులమీద నేను పగ తీర్చుకొంటాను.

[25] నీకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. పూర్తిగా నీ కల్మషాన్ని శుద్ధి చేసి, నీలో కలిసిన మిశ్రిత లోహపదార్థాలను తీసివేస్తాను.

[26] పూర్వం ఉన్నట్టు నీకు న్యాయమూర్తులను మళ్ళీ ఇస్తాను. ఆదిలో ఉన్నట్టు నీకు ఆలోచనకర్తలను మళ్ళీ నియమిస్తాను. ఆ తరువాత నిన్ను ‘న్యాయాన్ని అనుసరించే నగరం’, ‘నమ్మకమైన నగరం’ అంటారు.

[27] “సీయోనుకు న్యాయంచేత విముక్తి కలుగుతుంది. దేవునివైపు మళ్ళీ తిరిగినదాని నివాసులకు నీతినిజాయితీచేత విమోచనం కలుగుతుంది.

[28] అక్రమకారులూ పాపులూ ధ్వంసం అయిపోతారు.

[29] మీకు ఇష్టం ఉన్న సిందూర వృక్షాల విషయం మీరు సిగ్గుపాలవుతారు. మీకు సంతోషకరమైన తోటల విషయం మీ ముఖాలు ఎర్రబారుతాయి.

[30] మీరు ఆకులు వాడిపోతున్న సిందూర వృక్షంలాగా, నీళ్ళు లేని తోటలాగా అవుతారు.

[31] బలవంతులు చితుకుల్లాగా అవుతారు, వాళ్ళ పని నిప్పుకణంలాగా అవుతుంది. వాళ్ళు వాళ్ళ పనితోపాటు కాలిపోతారు. మంటలు ఆర్పేవారంటూ ఎవ్వరూ ఉండరు.”

యెషయా — Chapters