Skip to content
Opens in a new window

[1] ఆ రోజులలో హిజ్కియాకు జబ్బు చేసింది. చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆమోజు కొడుకు యెషయాప్రవక్త అతని దగ్గరికి వచ్చి, అతనితో “యెహోవా చెపుతున్నాడు, నీవు చనిపోతున్నావు. బ్రతకవు, గనుక నీ ఇంటి విషయాలు సరిపెట్టుకో” అన్నాడు.

[2] అందుకు హిజ్కియా గోడవైపు ముఖం త్రిప్పుకొని,

[3] యెహోవాను ఇలా ప్రార్థించాడు: “యెహోవా! నీ ఎదుట నేను నమ్మకంగా యథార్థ హృదయంతో ప్రవర్తిస్తూ ఉండేవాణ్ణి. నీ దృష్టిలో ఏవి మంచివో అవి జరిగించేవాణ్ణి. అది తలచుకొమ్మని నిన్ను ప్రాధేయపడుతున్నాను.” హిజ్కియా వెక్కివెక్కి ఏడ్చాడు.

[4] అప్పుడు యెషయాకు యెహోవానుంచి వాక్కు వచ్చింది:

[5] “నీవు వెళ్ళి హిజ్కియాతో ఈ విధంగా చెప్పు: నీ పూర్వీకుడైన దావీదుయొక్క దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, నీ ప్రార్థన నేను విన్నాను. నీ కన్నీళ్ళు చూశాను. ఇంకా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్షు పెంచుతాను.

[6] అంతే కాకుండా, నిన్నూ ఈ నగరాన్నీ అష్షూరు రాజు చేతిలోనుంచి రక్షిస్తాను. ఈ నగరాన్ని కాపాడుతాను.

[7] యెహోవా తాను చెప్పినమాట నెరవేరుస్తాడనడానికి ఆయన మీకు ఇచ్చిన సూచన ఇదే:

[8] ఆహాజు చేయించిన నీడ గడియారంమీద ముందుకు పోయిన నీడ పది అంకెలు వెనక్కు పోయేలా చేస్తాను.” అప్పుడు సూర్యకాంతి దిగిన అంకెలలో పది అంకెలు తిరిగి ఎక్కింది.

[9] యూదా రాజు హిజ్కియా జబ్బుపడి మళ్ళీ ఆరోగ్యవంతుడైన తరువాత అతడు రచించినది:

[10] “నేను అనుకొన్నాను, నా జీవిత కాలం మధ్య భాగంలో నేను మృత్యులోక ద్వారాలగుండా పోవాలి. నా సంవత్సరాలలో మిగిలినవాటిని పోగొట్టుకోవాలి.

[11] నేను అనుకొన్నాను, యెహోవాను సజీవుల లోకంలో యెహోవాను మళ్ళీ చూడను. మృత్యులోక నివాసినై ఇంకా మనుషులను చూడను.

[12] “కాపరి డేరాలాగా నా ఉనికిపట్టును తీసివేయడం, నా దగ్గరనుంచి తొలగించడం జరిగింది. నేసేవాడిలాగా నేను నా జీవిత కాలాన్ని చుట్టుకొని ముగించాను. దేవుడు నన్ను మగ్గంనుంచి కత్తిరిస్తున్నాడు. ఉదయంనుంచి రాత్రివరకు నీవు నన్ను అంతం చేస్తున్నావు.

[13] ఉదయంవరకు నా మనసును శాంతం చేశాను. గాని, ఆయన సింహంలాగా నా ఎముకలన్నిటినీ విరగ్గొట్టివేశాడు. ఉదయంనుంచి రాత్రివరకు నీవు నన్ను అంతం చేస్తున్నావు.

[14] మంగలకత్తిపిట్టలాగా ఓదెకొంగలాగా నేను కూస్తూ ఉన్నాను, గువ్వలాగా మూలుగుతూ ఉన్నాను. పైకి చూచి చూచి నా కళ్ళు మందగిస్తున్నాయి. నాకు బాధ కలిగింది. యెహోవా! నాకు అండగా ఉండు.

[15] “అయితే నేను ఏమనను? ఆయన నాకు మాట ఇచ్చాడు. ఆయనే ఇలా జరిగించాడు. నాకు కలిగిన మనోవేదన కారణంగా నా సంవత్సరాలన్నీ నేను అణుకువగా నడుస్తాను.

[16] ప్రభూ! ఇలాంటివాటివల్ల మనుషులు బ్రతుకుతారు. వీటివల్ల నా ఆత్మకు జీవం ప్రాప్తించింది. నీవు నన్ను బాగు చేశావు. బ్రతికించావు.

[17] ఇంత వేదన నాకు క్షేమాన్ని కలిగించింది. నీవు నన్ను ప్రేమిస్తూ నాశనకరమైన అగాధంనుంచి విడిపించావు. నీ వీపు వెనుకవైపు నా పాపాలన్నీ పారవేశావు.

[18] ఎందుకంటే, మృత్యులోకంలో నీకు స్తుతి కలగదు. చావు నిన్ను కీర్తించదు. సమాధిలోకి దిగినవారు నీ విశ్వసనీయత కోసం ఎదురు చూడలేరు.

[19] సజీవులు నిన్ను స్తుతించగలరు. ఈ రోజు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నట్టు సజీవులే నిన్ను స్తుతించగలరు. తండ్రులు కొడుకులకు నీ విశ్వసనీయతను తెలియజేస్తారు.

[20] యెహోవా నన్ను రక్షించేవాడు. మనం బ్రతికినన్నాళ్ళు యెహోవా ఆలయంలో తంతివాద్యాలతో పాటలు పాడుతాం.”

[21] యెషయా “అంజూరుపండ్ల ముద్ద తీసుకొని ఆ కురుపుకు కట్టాలి. అప్పుడతడు బాగుపడతాడు” అన్నాడు.

[22] అంతకుముందు హిజ్కియా “నేను యెహోవా ఆలయానికి వెళ్తాననడానికి సూచన ఏమిటి?” అని అడిగాడు.

యెషయా — Chapters