[1] నా ప్రజలలో ఉన్న బీదల హక్కులను బిగపట్టడానికీ, అణగారిపోయినవారికీ న్యాయం చేకూరకుండా చేయడానికి అన్యాయమైన చట్టాలను ఏర్పరచేవాళ్ళకు, బాధకరమైన శాసనాలను రాయించే వాళ్ళకు బాధ తప్పదు.
[2] వితంతువులను దోపిడీకి గురి చేసి, అనాథలను దోచుకుందామని వాళ్ళ ఉద్దేశం.
[3] అయితే దూరంనుంచి విపత్తు వచ్చే శిక్ష దినాన మీరు ఏం చేస్తారు? సహాయంకోసం ఎవరిదగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యాన్ని ఎక్కడ దాచుకొంటారు?
[4] బందీలుగా పట్టబడి ముడుచుకోవడం, హతమై కూలడం – ఈ రెండే జరుగుతాయి. అయితే దీనితో ఆయన కోపం చల్లారలేదు, ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.
[5] “నా కోప దండనగా ఉన్న అష్షూరువాళ్ళకు బాధ తప్పదు. నా ఆగ్రహాన్ని సూచించే దుడ్డుకర్ర వాళ్ళ చేతిలో ఉంది.
[6] భక్తి లేని జనంమీదికి నేను వాళ్ళను పంపుతాను. దోపిడీసొమ్ము పట్టుకోవడానికి, కొల్లగొట్టడానికి, వారిని వీధులలోని బురదలాగా త్రొక్కడానికి, నా కోపానికి గురి అయిన వారిమీదికి వెళ్ళండని ఆజ్ఞ జారీ చేశాను.
[7] అయితే అష్షూరు రాజు అలా అనుకోవడం లేదు. అది అతడి ఆలోచన కాదు. నాశనం చేయాలనీ చాలా జనాలను నిర్మూలం చేయాలనీ అతడి ఆశయం.
[8] అతడు ఇలా అనుకొంటున్నాడు: ‘నా అధిపతులంతా రాజులే గదా!
[9] కలనో పట్టణం కర్‌కెమీషులాగా ఉంది గదా! హమాతు పట్టణం ఆరపాద్‌లాగా ఉంది గదా! షోమ్రోను దమస్కులాగా ఉంది గదా!
[10] విగ్రహాలను పూజించే రాజ్యాలు నా చేతికి చిక్కాయి గదా! వాటి విగ్రహాలు జెరుసలం, షోమ్రోనుల విగ్రహాలకంటే మించినవి గదా!
[11] షోమ్రోనుకూ దాని విగ్రహాలకూ నేను చేసినట్టు జెరుసలంకూ దాని విగ్రహాలకూ చేయలేనా?”
[12] సీయోనుకొండకూ జెరుసలంకూ వ్యతిరేకంగా ప్రభువు తన క్రియ అంతా ముగించిన తరువాత ఆయన ఇలా అనుకొంటాడు: “నేను అష్షూరు రాజును అతడి అహంభావ ఫలితాన్ని బట్టి, అతడి గర్వం గల చూపులకారణంగా శిక్షిస్తాను.
[13] అతడు ఈ విధంగా అనుకొంటున్నాడు: ‘నేను తెలివైనవాణ్ణి. నా చేతి బలంవల్ల, నా బుద్ధివల్ల అలా చేశాను. నేను జనాల సరిహద్దులను మార్చాను. వాటి ఖజానాలను దోచుకొన్నాను. మహా బలిష్ఠుడినై వాటి రాజులను త్రోసివేశాను.
[14] పక్షి గూటిలో మనిషి చెయ్యి పెట్టినట్లు జనాల ఆస్తి చేజిక్కించుకొన్నాను. విడవబడ్డ గుడ్లను మనిషి ఏరుకొంటే, రెక్కలు ఆడించేది, నోరు తెరిచేది కిచకిచలాడేది ఏమీ లేనట్టు నిరభ్యంతరంగా నేను లోకమంతటినీ సమకూర్చుకొన్నాను.’
[15] తనచేత నరికేవాణ్ణి చూచి గొడ్డలి గొప్పలు చెప్పుకొంటుందా? తనచేత కోసేవాణ్ణి చూచి రంపం పొగడుకొంటుందా? కోల తనను ఎత్తేవాణ్ణి ఆడించినట్లు ఉంది ఇది! దుడ్డుకర్ర కర్ర పూనినవాణ్ణి ఎత్తినట్లుంది!”
[16] అందుచేత సేనలప్రభువు యెహోవా బలిసిన అష్షూరువాళ్ళు చిక్కిపోయేలా చేస్తాడు. వాళ్ళ వైభవం క్రింద మండుతూవుండే మంటల్లాగా నిప్పు రాజుతుంది.
[17] ఇస్రాయేల్‌ప్రజల ‘వెలుగు’ నిప్పు అవుతుంది. వారి పవిత్రుడు మంటవుతాడు. ఆ మంట అష్షూరు ముండ్లచెట్లకూ కంటకాలకూ అంటుకొని వాటిని ఒక్క రోజునే దహించివేస్తుంది.
[18] రోగి క్షీణించిపోయే విధంగా దాని అడవి, ఫలవంతమైన పొలాల శోభను అది పూర్తిగా నాశనం చేస్తుంది.
[19] దాని అడవులలో చెట్లు కుర్రవాడు లెక్క పెట్టగలిగేటంత తక్కువగా మిగిలి ఉంటాయి.
[20] ఆ రోజున, ఇస్రాయేల్‌ప్రజలలో మిగిలేవారు, యాకోబు వంశంవారిలో తప్పించుకొనేవారు తమ్మును పడగొట్టినవాడి మీద ఇంకా ఆధారపడక, ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడైన యెహోవామీదే నిజంగా ఆధారపడుతారు.
[21] యాకోబు వంశీయులలో కొంతమంది మిగిలి బలాఢ్యుడైన దేవునివైపు తిరుగుతారు.
[22] ఇస్రాయేల్! సముద్రం ఇసుకలాగా ఉన్న వారిలో నీ ప్రజలు కొంతమంది మాత్రమే తిరిగి వస్తారు. నాశనం నిర్ణయించబడింది. దానితో న్యాయం వరదలాగా వస్తుంది.
[23] తాను నిర్ణయించిన నాశనం సేనలప్రభువు యెహోవా దేశమంతటికీ కలిగిస్తాడు.
[24] అందుచేత సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు: “సీయోనులో నివాసముంటున్న నా ప్రజలారా! ఈజిప్ట్‌వాళ్ళు చేసినట్టు అష్షూరువాళ్ళు దుడ్డుకర్రతో మిమ్మల్ని కొట్టి మీ మీద దండం ఎత్తినా వాళ్ళకు భయపడకండి.
[25] ఇంకా కొద్దికాలానికి నా కోపం చల్లారిపోతుంది. వాళ్ళను నాశనం చేయడానికి నా ఆగ్రహం తిరుగుతుంది.”
[26] ఓరేబు బండ దగ్గర మిద్యానువాళ్ళను హతం చేసినట్టే సేనలప్రభువు యెహోవా వాళ్ళమీద కొరడా ఝళిపిస్తాడు, ఈజిప్ట్‌లో చేసినట్టు నీళ్ళమీద తన దండం ఎత్తుతాడు.
[27] ఆ రోజున మీ భుజంమీద వాళ్ళు ఉంచిన బరువును తీసివేయడం, మీ మెడమీదనుంచి వాళ్ళ కాడి కొట్టివేయడం జరుగుతుంది.
[28] ఆష్షూరు వాళ్ళు ఆయాతుమీద పడుతున్నారు, మిగ్రోను గుండా వస్తున్నారు, మిక్‌మషులో సామాను ఉంచుతున్నారు,
[29] కొండ సందు దాటి, గెబలో ఈ రాత్రి గడుపుదా మంటున్నారు. రమా వణకుతూ ఉంది. సౌలు పట్టణమైన గిబియా పారిపోతున్నది.
[30] గిల్లీం కాపురస్తులారా! బిగ్గరగా కేకలు పెట్టండి. లాయిషా! విను. అయ్యో, అనాతోతు!
[31] మదమేనావాళ్ళు పారిపోతూ ఉన్నారు. గెబీం నివాసులు ఆశ్రయం కోసం వెదుకుతూ ఉన్నారు.
[32] ఈ రోజే సైన్యం నోబులో దిగుతుంది. సీయోను కుమారి పర్వతంవైపు, జెరుసలం కొండవైపు, వాళ్ళు పిడికిలి ఆడిస్తూ ఉన్నారు.
[33] అయితే చూడండి! సేనలప్రభువు యెహోవా భయంకరంగా కొమ్మలను నరికివేస్తాడు. చాలా పొడవైన చెట్లను పడగొట్టడం జరుగుతుంది. ఎత్తయినవి కూలుతాయి.
[34] అడవిలోని దట్టమైన పొదలను ఇనుప గొడ్డలితో నరికివేస్తాడు. లెబానోను బలాఢ్యుడి చేత కూలిపోతుంది.