Skip to content
Opens in a new window

[1] బేల్ కుంగుతున్నాడు. నెబో కుంగుతూ ఉన్నాడు. వాళ్ళ విగ్రహాలను జంతువులు, పశువులు మోస్తూ ఉన్నాయి. ఆ మోతలు అలసిపోయిన పశువులకు భారంగా ఉన్నాయి.

[2] బేల్, నెబో కూలుతూ కుంగుతూ ఉండి భారాన్ని విడిపించుకోలేక తామే బందీలుగా పోవడం జరుగుతూ ఉంది.

[3] “యాకోబు వంశంవారలారా! ఇస్రాయేల్ వంశంలో మిగిలినవారలారా! నేను చెప్పేది వినండి. మీరు గర్భంలో ఉన్నప్పటినుంచీ నేను మిమ్మల్ని భరించాను, జన్మించినప్పటి నుంచి మిమ్మల్ని ఎత్తుకొన్నాను.

[4] మీ ముసలితనంవరకు నేను అలాంటివాణ్ణే. మీకు తల వెండ్రుకలు నెరసేవరకు మిమ్మల్ని భరిస్తాను. మిమ్మల్ని చేసినది నేనే. ఎత్తుకొన్నది నేనే. నేను మిమ్మల్ని భరిస్తాను, రక్షిస్తాను.

[5] “వారు నాతో సమానమన్నట్లు ఎవరిని నాతో సాటిచేస్తారు? నన్ను ఎవరితో పోల్చి సమానులుగా చేస్తారు?

[6] కొంతమంది తమ సంచి నుంచి బంగారం పోసి, త్రాసులో వెండి తూచి, దానిని దేవతగా చేయడానికి కంసాలిని కూలికి పిలుస్తారు. దానికి సాష్టాంగపడి మ్రొక్కుతారు.

[7] వాళ్ళు భుజాలమీద దానిని ఎక్కించుకొని, మోసుకుపోయి, దానికి సిద్ధం చేసిన చోట నిలబెడతారు. అది అక్కడే నిలుస్తుంది. దాని స్థలంనుంచి అది కదలదు. మనిషి దానికి బిగ్గరగా విన్నపం చేసినా అది ఏమీ జవాబివ్వదు. వాడి కష్టంనుంచి వాణ్ణి రక్షించజాలదు.

[8] “అక్రమకారులారా! దానిని జ్ఞాపకముంచుకొని మీ మనసులలో గట్టిగా నాటనియ్యండి, బాగా ఆలోచించండి.

[9] చాలా కాలంక్రిందట జరిగినవాటిని జ్ఞప్తికి తెచ్చుకోండి. నేనే దేవుణ్ణి, ఇంకా ఏ దేవుడూ లేడు. నేనే దేవుణ్ణి, నాకు సమానుడంటూ ఎవ్వడూ లేడు.

[10] ఆదినుంచి అంతాన్ని తెలియజేసేవాణ్ణి. పూర్వకాలంనుంచి ఇంకా జరగబోయే సంగతులను తెలిపేవాణ్ణి. నా సంకల్పం నిలుస్తుందనీ నాకు ఇష్టం వచ్చినట్టెల్లా జరిగిస్తాననీ అంటున్నాను.

[11] తూర్పు నుంచి ‘క్రూరపక్షి’ని రప్పిస్తున్నాను. నా సంకల్పాన్ని నెరవేర్చడానికి దూరదేశంనుంచి ఆ మనిషిని పిలుస్తున్నాను. నేను ఏమి చెప్పానో అది జరిగిస్తాను. ఏమి సంకల్పించానో అది సాధిస్తాను.

[12] మొండిపట్టు పట్టి న్యాయంనుంచి దూరమైనవారలారా! నేను చెప్పేది వినండి.

[13] నా న్యాయాన్ని దగ్గరికి తెస్తున్నాను. అది దూరంగా లేదు. నా రక్షణ ఆలస్యంగా రాదు. నేను సీయోనుకు విముక్తి ప్రసాదిస్తాను. ఇస్రాయేల్‌కు నా మహిమాప్రకాశం అనుగ్రహిస్తాను.

యెషయా — Chapters