[1] “ఇడుగో నా సేవకుడు! నేను ఈయనకు అండగా ఉన్నాను. ఈయనను ఎన్నుకొన్నాను. ఈయన అంటే నా మనసుకు ఎంతో ఆనందం. ఈయనమీద నా ఆత్మను ఉంచాను. ఈయన జనాలకు న్యాయం జరిగిస్తాడు.
[2] ఈయన కేకలు వేయడు. అరవడు, తన స్వరం వీధిలో వినిపించదు.
[3] ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుతూ ఉన్న వత్తిని ఆర్పడు. ఈయన నమ్మకంగా న్యాయాన్ని జరిగిస్తాడు.
[4] లోకంలో న్యాయం స్థాపించేవరకు ఈయన నీరసించడు, నలిగిపోడు, సముద్రతీరస్థులు ఈయన ఉపదేశంకోసం ఆశాభావంతో ఎదురుచూస్తారు.”
[5] యెహోవా దేవుడు – ఆకాశాలను కలిగించి, వాటిని విశాలం చేసి, భూమిని పరచి, దానిమీద పుట్టినదంతా విస్తరింపజేసి, దానిమీద ఉన్న ప్రజలకు ప్రాణం, నడిచేవారికి జీవం ఇస్తూ ఉన్న యెహోవా దేవుడు ఆయనతో ఇలా అంటున్నాడు:
[6] “నేను – యెహోవాను – నీతి నిజాయితీ విషయంలో నిన్ను పిలిచాను. నేను నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడతాను.
[7] గుడ్డివారి కండ్లు తెరవడానికీ, ఖైదీలను చెరలోనుంచి బయటికి తేవడానికీ, చీకటిలో కూర్చుని ఉన్నవారిని బందీగృహంలోనుంచి వెలుపలికి తేవడానికీ నేను నిన్ను ప్రజకు ఒడంబడికగా చేస్తాను, జనాలన్నిటికీ నిన్ను వెలుగుగా నియమిస్తాను.
[8] నేను యెహోవాను. ఇదే నా పేరు. ఇంకెవరికీ నా ఘనతను ఇవ్వను. నాకు రావలసిన స్తుతి విగ్రహాలకు చెందనివ్వను.
[9] మునుపు నేను చెప్పిన సంగతులు జరిగాయి గదా. ఇప్పుడు క్రొత్త సంగతులు తెలియజేస్తున్నాను. జరిగేముందే వాటిని మీకు తెలుపుతున్నాను.”
[10] సముద్ర ప్రయాణం చేసేవారలారా! సముద్రంలో సమస్తమా! ద్వీపాల్లారా! ద్వీపవాసుల్లారా! యెహోవాకు క్రొత్త పాట పాడండి. భూమి కొనలనుంచి ఆయనను స్తుతించండి.
[11] ఎడారి, దాని గ్రామాలు, కేదారు నివాసాలు బిగ్గరగా పాడాలి. సెల పట్టణస్థులు సంతోషించాలి. వాళ్ళు పర్వత శిఖరాలనుంచి కేకలు పెట్టాలి.
[12] సముద్ర తీరస్థులు యెహోవాకు ఘనత ఆపాదించాలి. ఆయన కీర్తిని చాటించాలి.
[13] యెహోవా పరాక్రమశాలిలాగా బయలుదేరుతాడు. యుద్ధవీరుడిలాగా తన ఆసక్తిని పురికొలుపుకుంటాడు. తన శత్రువులమీద హుంకారం చేస్తాడు, వాళ్ళమీద విజయం సాధిస్తాడు.
[14] “చాలా కాలంనుంచి నేను ఊరుకొన్నాను. ఏమీ చెప్పకుండా నన్ను ఆపుకున్నాను. ఇప్పుడైతే కాన్పుకు వచ్చే స్త్రీలాగా మూలుగుతున్నాను, ఎగశ్వాసతో ఒగర్చుతున్నాను, రొప్పుతున్నాను.
[15] నేను పర్వతాలనూ కొండలనూ పాడు చేస్తాను. వాటిమీది చెట్టుచేమలన్నీ ఎండిపోయేలా చేస్తాను. నదులను లంకలుగా మారుస్తాను. మడుగులను ఇంకిపోయేలా చేస్తాను.
[16] గుడ్డివారిని వారికి తెలియని మార్గంలో నడిపిస్తాను. వారెరగని త్రోవల్లో వారికి దారి చూపుతాను. వారి ఎదుటే చీకటిని వెలుగుకు మారుస్తాను, వంకరటింకర స్థలాలను చదును చేస్తాను. నేను వారిని విడువక ఈ క్రియలను చేస్తాను.
[17] గాని, చెక్కిన విగ్రహాలమీద నమ్మకం పెట్టి, పోత విగ్రహాలను చూచి ‘మీరే మాకు దేవుళ్ళు’ అనేవాళ్ళు వెనక్కు తొలగిపోయి, పూర్తిగా సిగ్గుపాలవుతారు.
[18] “చెవిటివారలారా! వినండి. గుడ్డివారలారా! చూడండి, గమనించండి.
[19] నా సేవకుడు తప్ప ఇంకెవడు గుడ్డివాడు? నేను పంపిన వార్తాహరుడు తప్ప ఇంకెవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప, యెహోవా సేవకుడు తప్ప ఇంకెవడు అంధుడు?
[20] నీకు అనేక సంగతులు కనబడ్డాయి గాని, నీవు వాటిని చూడలేదు. నీ చెవులు తెరచి ఉన్నాయి గాని, ఏమీ వినడం లేదు.”
[21] తన నీతినిజాయితీ కోసం ధర్మశాస్త్రాన్ని ఘనపరచి గొప్ప చేయడం యెహోవాకు ఇష్టం అయింది.
[22] అయితే ఈ ప్రజను కొల్లగొట్టడం జరిగింది. వారు దోపిడీ అయ్యారు. వారంతా గుహలలో చిక్కుపడి ఉన్నారు. చెరసాలలో మాటు మణిగి ఉన్నారు. విడిపించేవాడెవడూ లేక దోపిడీకి గురి అయ్యారు. “వాళ్ళను తిరిగి పంపేయండి” అనేవాడెవడూ లేక కొల్లసొమ్మయ్యారు.
[23] మీలో ఎవరు దీనిని వింటారు? రాబోయే కాలంలో ఎవరు దీనిమీద మనసు పెడతారు?
[24] యాకోబు జనాన్ని దోపిడీగా అప్పగించినదెవడు? దోచుకొనేవాళ్ళకు ఇస్రాయేల్‌ను అప్పగించినదెవరు? మనం ఎవరికి విరోధంగా అపరాధం చేశామో ఆ యెహోవాయే గదా! వారు ఆయన విధానాలను అనుసరించక నిరాకరించారు, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
[25] అందుచేతే ఆయన వారిమీద తన కోపాగ్ని కుమ్మరించాడు. వారిని యుద్ధతీవ్రతకు గురి చేశాడు. దానివల్ల మంటలు వారిని చుట్టుకొన్నాయి గాని, వారు గ్రహించలేదు. అవి వారిని మాడ్చాయి గాని, వారు నేర్చుకోలేదు.