Skip to content
Opens in a new window

[1] ఎడారిలో ఉన్న సెలనుంచి దేశపరిపాలకుడికి సీయోను కుమారి పర్వతానికి గొర్రెపిల్లలను కానుకగా పంపండి.

[2] మోయాబు స్త్రీలు అరనోను రేవులదగ్గర, గూటినుంచి చెదరి అటూ ఇటూ ఎగిరే పక్షులలాగా ఉన్నారు.

[3] “మాకు సలహా చెప్పు, నిర్ణయం చెయ్యి. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నంలో నీ నీడ మామీద ఉండేలా చెయ్యి. పారిపోయినవారిని దాచిపెట్టు. శరణాగతులను పట్టియ్యకు.

[4] మోయాబు పలాయితులను నీతో ఉండనియ్యి. వినాశకారి బారినుంచి వాళ్ళకు ఆశ్రయంగా ఉండు”. దౌర్జన్యపరులు అంతరించిపోతారు. నాశనం మానిపోతుంది. దేశాన్ని అణగద్రొక్కినవాళ్ళు దానిలో లేకుండా అంతర్ధానమవుతారు.

[5] అప్పుడు కృపతో సింహాసనం స్థాపించడం జరుగుతుంది. దావీదు గుడారంలోనుంచి నమ్మకమైనవాడొకడు ఆ సింహాసనమెక్కుతాడు. ఆ వ్యక్తి తీర్పు తీర్చేటప్పుడు ధర్మం అనుసరిస్తాడు, న్యాయం శీఘ్రంగా జరిగిస్తాడు.

[6] మోయాబువాళ్ళు ఎంతో గర్వం గల వాళ్ళని మేము విన్నాం. వాళ్ళ గర్వం, మిడిసిపాటు, అహంభావం, దర్పం విషయం మాకు వినబడింది. అయితే వాళ్ళ డంబాలు వట్టివి.

[7] గనుక మోయాబువాళ్ళు రోదనం చేస్తారు. వాళ్ళంతా మోయాబు విషయం రోదనం చేస్తారు. కీర్‌హరెశెత్‌లోని ద్రాక్షపండ్ల అడలు దొరకక మీరు మూలుగుతారు.

[8] ఎందుకంటే, హెష్బోను పొలాలు సిబ్మాలో ద్రాక్షచెట్లు వాడిపొయ్యాయి. అక్కడి మేలిరకమైన ద్రాక్షచెట్లను దేశాల పరిపాలకులు త్రొక్కివేశారు. ఒకప్పుడు వాటి తీగలు యాజరు వరకు ఉన్నాయి. ఎడారికి ప్రాకాయి, ఇంకా సాగిపోయి సముద్రం వరకు వ్యాపించాయి.

[9] అందుచేత యాజరువాళ్ళు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్ష తీగలకోసం ఏడుస్తాను. హెష్‌బోను! ఏలాలే! నా కన్నీళ్ళతో నిన్ను తడుపుతాను. నీ ఎండకాలం పండ్ల గురించి, నీ కోత గురించి సంతోషించడం అయిపోయింది.

[10] సంతోషం, ఉల్లాసం ఫలవంతమైన పొలాలనుంచి మానిపొయ్యాయి, ద్రాక్షతోటలలో పాటలు, ఉత్సాహధ్వనులు వినబడడం లేదు. గానుగ తొట్లలో ద్రాక్షపండ్లను ఎవడూ త్రొక్కడం లేదు. అక్కడి సంతోషం మానేలా నేను చేశాను.

[11] మోయాబుకోసం నా అంతరంగం సితారా తంతులలాగా వణకుతూ ఉంది. కీర్‌హరెశెతు కోసం నా ఆంతర్యం మూలుగుతూ ఉంది.

[12] మోయాబువాళ్ళు పూజాస్థలానికి వెళ్ళి అలసిపోయేటప్పుడు, ప్రార్థన చేయడానికి గుడికి వెళ్ళేటప్పుడు ప్రయోజనం ఉండదు.

[13] మునుపు యెహోవా మోయాబు విషయం చెప్పిన వాక్కు అదే.

[14] ఇప్పుడు యెహోవా ఇంకా అంటున్నాడు, “కూలివాళ్ళ లెక్కప్రకారం మూడేళ్ళలోగా మోయాబు వైభవం, దాని పెద్ద జనసమూహాలు తృణీకారానికి గురి అవుతాయి. వాళ్ళలో కొద్దిమందే మిగులుతారు. వాళ్ళూ అల్పులుగా ఉంటారు.”

యెషయా — Chapters