Skip to content
Opens in a new window

[1] “నా సేవకుడైన యాకోబూ! నేను ఎన్నుకొన్న ఇస్రాయేలూ! ఇప్పుడు విను!

[2] నిన్ను సృజించి గర్భంలో నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా చెప్పేదేమిటంటే, యాకోబూ! నా సేవకుడా! నేను ఎన్నుకొన్న యెషూరూనూ! భయపడకు!

[3] దప్పిగొన్న వ్యక్తిమీద నీళ్ళనూ, ఎండినభూమిమీద ప్రవాహాలనూ కుమ్మరిస్తాను. నీ సంతానంమీద నా ఆత్మనూ నీ వంశస్థులమీద నా ఆశీస్సులనూ కుమ్మరిస్తాను.

[4] నీటి కాలువలదగ్గర ఉన్న నిరవంజి చెట్లలాగా గడ్డిలో వారు పెరుగుతారు.

[5] ఒక మనిషి ‘నేను యెహోవావాణ్ణి’ అంటాడు. ఇంకొకడు తనకు యాకోబు అనే పేరు పెట్టుకొంటాడు. ఇంకొకడు ‘యెహోవాకు చెందినవాణ్ణి’ అని తన చేతిమీద వ్రాసి ఇస్రాయేలనే మారుపేరు పెట్టుకొంటాడు.

[6] “ఇస్రాయేల్ ప్రజల రాజూ, విముక్తిదాతా, సేనలప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, నేను మొదటివాణ్ణీ, చివరివాణ్ణీ. నేను తప్ప ఏ దేవుడూ లేడు.

[7] నావంటివాడెవడు ఉన్నాడు? ఎవడైనా ఉంటే, ఈ పురాతన ప్రజను నేను స్థాపించినప్పటినుంచి జరిగిన సంగతులనూ, రాబోయే సంగతులనూ నా ఎదుట తెలియజేసి వివరంగా చెప్పాలి. అవును, రాబోయే సంగతులను గురించి తెలియజేయాలి.

[8] మీరు వణకవద్దు, భయపడవద్దు, చాలా కాలం క్రిందట నేను మీకు ఈ సంగతులను వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరే దేవుడున్నాడా, చెప్పండి. నేను తప్ప వేరే ఆధారశిల లేడు. అలాంటివాణ్ణెవణ్ణీ ఎరగను.

[9] “విగ్రహాలను చేసేవాళ్ళంతా వట్టివాళ్ళు. వాళ్ళకు ఇష్టమైనవి కూడా పనికిమాలినవి. వాటి తరఫున మాట్లాడేవాళ్ళు గుడ్డివాళ్ళే. వాళ్ళకు తెలివి లేదు. వాళ్ళు సిగ్గుపాలవుతారు.

[10] ఎవడైనా పనికిరాని దేవతను రూపొందిస్తే, విగ్రహాన్ని పోతపోస్తే,

[11] అతడి తోడివాళ్ళంతా సిగ్గుపాలవుతారు. శిల్పులు మానవమాత్రులే. వాళ్ళంతా సమకూడి నిలబడాలి. వాళ్ళు ఏకంగా భయానికీ, కలవరానికీ గురి అవుతారు.

[12] “కుమ్మరి ఇనుప పనిముట్టును తీసుకొని నిప్పుకణాలలో దానితో పనిచేస్తాడు. సుత్తెతో విగ్రహాన్ని రూపొందించి, తన చేతి బలంతో దానిని చేస్తాడు. అతడికి ఆకలి వేస్తుంది, బలం పోతుంది. నీళ్ళు త్రాగక పూర్తిగా అలసిపోతాడు.

[13] వడ్రంగి కొలనూలు వేస్తాడు, ఆకారం వ్రాసి ఉలితో చక్క చేసి, కంట్రోణితో గురుతులు పెట్టి దానిని రూపొందిస్తాడు. గుడిలో దానిని ఉంచాలని మనిషి రూపాన్ని – అందమైన మనిషి ఆకారాన్ని – చేస్తాడు.

[14] ఒక మనిషి దేవదారు చెట్లను నరికివేస్తాడు. లేదా, ఏదైనా సరళ వృక్షాన్ని గానీ, సిందూర వృక్షాన్ని గానీ ఎన్నుకొని అడవి చెట్లలో పెరగనిస్తాడు. లేదా, ఒక రకమైన దేవదారు చెట్టును నాటుతాడు. వాన దానిని పెరిగేలా చేస్తుంది.

[15] తరువాత అది వంటచెరుకుగా పనికి వస్తుంది. దానిలో కొంత తీసుకొని చలిమంట వేసుకొంటాడు. నిప్పు రాజబెట్టి రొట్టెలు కాలుస్తాడు. అంతేగాక, ఒక ముక్క తీసుకొని ఒక దేవతను చేస్తాడు, దానిని పూజిస్తాడు. విగ్రహాన్ని చేసి దానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు.

[16] కొయ్యలో సగం అగ్నితో కాలుస్తాడు. దానితో మాంసం వండి తిని తృప్తిపడతాడు. చలి కాచుకొంటూ ‘చలి కాచుకొన్నాను. అగ్ని బాగుంది’ అంటాడు.

[17] మిగిలిన కొయ్య తీసుకొని తనకోసం దేవతగా ఒక విగ్రహాన్ని చేయించుకొంటాడు. దాని ఎదుట సాష్టాంగపడి దానికి మొక్కుతాడు. దానికి ప్రార్థన చేసి, ‘నువ్వు నా దేవుడివి. నన్ను రక్షించు’ అంటాడు.

[18] “వాళ్ళకేమీ తెలియదు, ఏమీ అర్థం కాదు. వాళ్ళ కళ్ళకు బురద అలికినట్లుంది. వాళ్ళు ఏమీ చూడరు. వాళ్ళ హృదయాలు మూయబడ్డాయి. వాళ్ళు ఏమీ గ్రహించరు.

[19] ఎవడూ ఆలోచించడు. ‘కొయ్యలో సగం నిప్పులో కాల్చాను. నిప్పులమీద రొట్టెలు కాల్చాను, మాంసం వండుకొని తిన్నాను. మిగిలిన కొయ్యతో అసహ్యమైనదానిని చేస్తానా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడతానా?’ అని చెప్పడానికి ఎవడికీ తెలివి లేదు, గ్రహింపు లేదు.

[20] అలాంటివాడు బూడిదను మెక్కుతున్నాడు. తన మోసపోయిన మనసు తనను తప్పుదారి పట్టించింది. అతడు తనను రక్షించుకోలేడు. ‘నా కుడిచేతిలో ఉన్న ఈ వస్తువు అబద్ధం’ అనుకోలేడు.

[21] “యాకోబూ! ఇస్రాయేలూ! ఈ సంగతులు మనసులో ఉంచుకో. నీవు నా సేవకుడవి. నేను నిన్ను నియమించాను. ఇస్రాయేలూ, నీవు నా సేవకుడివి. నేను నిన్ను మరువను.

[22] మంచును చెదరగొట్టినట్టు, మబ్బును తొలగించినట్టు నేను నీ అక్రమాలను, పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను వెల ఇచ్చి విడిపించాను. గనుక నా దగ్గరికి తిరిగి రా!”

[23] యెహోవా ఆ కార్యం చేశాడు. ఆకాశాల్లారా! ఆనంద ధ్వనులు చేయండి. భూమి అగాధ స్థలాల్లారా! కేకలు పెట్టండి. పర్వతాల్లారా! అరణ్యమా! దానిలోని ప్రతి వృక్షమా! సంగీత నాదం చేయండి. యెహోవా వెల ఇచ్చి యాకోబును విడిపించాడు. ఇస్రాయేల్‌లో తన ఘనతను ప్రదర్శిస్తాడు.

[24] గర్భంలో నిన్ను రూపొందించిన నీ విమోచకుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను యెహోవాను. అన్నిటికీ కర్తను నేనే. నేనే ఆకాశాలను వ్యాపింపజేశాను, నేనే భూమిని పరచాను.

[25] నేను అబద్ధ ప్రవక్తలు చెప్పే సూచనలను వమ్ము చేసేవాణ్ణి; సోదెగాండ్రను పిచ్చివాళ్ళుగా కనుపరచేవాణ్ణి; జ్ఞానులను వెనక్కు తిప్పి వాళ్ళ విద్య అవిద్యగా వెల్లడి చేసేవాణ్ణి;

[26] నా సేవకుడి మాటలను స్థిరపరచేవాణ్ణి; నా వార్తాహరుల ఆలోచనలను సాధించేవాణ్ణి; జెరుసలం విషయం ‘అది నివాసస్థలంగా ఉంటుంది’ అనీ, యూదా పట్టణాల విషయం ‘వాటిని కట్టడం జరుగుతుంది’ అనీ, వాటి శిథిలాల విషయం ‘వాటిని బాగు చేస్తాను’ అనీ చెప్పేవాణ్ణి;

[27] లోతైన నీళ్ళతో ‘ఇంకిపో! నీ ప్రవాహాలు ఇంకిపోయేలా చేస్తున్నాను’ అనేవాణ్ణి;

[28] కోరెషు విషయం ‘అతడు నా మంద కాపరి, నా సంకల్పాన్నంతా నెరవేరుస్తాడు. అతడు జెరుసలంను ఉద్దేశించి దానిని మళ్ళీ కట్టడం జరగాలి, దాని దేవాలయానికి పునాది వేయాలి అంటాడు’ అని చెప్పేవాణ్ణి.

యెషయా — Chapters