Skip to content
Opens in a new window

[1] రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో నేను ప్రభువును చూశాను. ఆయన పైకెత్తిన ఉన్నత సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన అంగీ అంచు దేవాలయాన్ని నింపివేసింది.

[2] ఆయనకు పైగా సెరాపులు నిలుచున్నారు. ప్రతి సెరాఫుకూ ఆరు రెక్కలున్నాయి. రెండు రెక్కలతో తన ముఖం కప్పుకొన్నాడు, రెంటితో తన కాళ్ళను కప్పుకొన్నాడు, రెంటితో ఎగురుతూ ఉన్నాడు.

[3] వారు ఒకరితో ఒకరు ఇలా బిగ్గరగా చెపుతూ ఉన్నారు: “సేనలప్రభువు యెహోవా పవిత్రుడు! పవిత్రుడు! పవిత్రుడు! లోకమంతా ఆయన ఘనతతో నిండిపోయింది.”

[4] వారి కంఠధ్వనికి గడపకమ్ముల పునాదులు కదిలాయి, దేవాలయం పొగతో నిండిపోయింది.

[5] అప్పుడు నేను “అయ్యో! నేను నాశనం అయ్యాను! ఎందుకంటే, నాకు అశుద్ధమైన పెదవులున్నాయి. అశుద్ధమైన పెదవులున్న ప్రజలమధ్య కాపురముంటున్నాను. సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా నా కంటికి కనబడ్డాడు” అన్నాను.

[6] అయితే ఆ సెరాఫులలో ఒకడు నా దగ్గరికి ఎగిరి వచ్చాడు. బలిపీఠం మీదనుంచి పట్టకారుతో తీసిన నిప్పుకణిక అతని చేతిలో ఉంది.

[7] అతడు నా నోటికి దానిని తగిలించి ఇలా అన్నాడు: “ఇదిగో, ఇది నీ పెదవులకు తగిలింది. నీ అపరాధం తొలగిపోయింది, నీ పాపం కప్పివేయబడింది.”

[8] అప్పుడు ప్రభువు “నేను ఎవరిని పంపిస్తాను? మాకోసం ఎవరు వెళ్తారు?” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నేను “ఇదిగో, నేను ఇక్కడ ఉన్నాను. నన్ను పంపించు” అన్నాను.

[9] అప్పుడు ఆయన అన్నాడు, “నీవు వెళ్ళి, ఈ ప్రజలతో ఈ విధంగా చెప్పు: ‘మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని, అర్థం చేసుకోరు. ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని, గ్రహించరు.’

[10] ఈ ప్రజల హృదయాలను మొద్దుబారి పోయేలా చెయ్యి! చెవులు కూడా మందం అయ్యేలా చెయ్యి! వారి కళ్ళను మూయించు! వారు కళ్ళతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని, నావైపు తిరిగి, నివారణ పొందకుండా అలా చేయాలి.”

[11] అందుకు నేను “ప్రభూ, ఎన్నాళ్ళవరకూ?” అని అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చాడు: “కాపురస్తులు లేకుండా పట్టణాలు నాశనమయ్యేవరకు, ఇళ్ళు నిర్మానుష్యం అయ్యేవరకు, దేశం పూర్తిగా పాడైపోయేవరకు,

[12] యెహోవా ఈ మనుషులను దూరంగా తొలగించేవరకు, దేశంలో అనేక స్థలాలు శిథిలాలయ్యేవరకు.

[13] ప్రజలలో పదో భాగం దేశంలో మిగిలి ఉంటుంది. అయినా దేశం మళ్ళీ నాశనమవుతుంది. సిందూర, మస్తకి వృక్షాలను నరికిన తరువాత వాటి మొద్దులు మిగిలి ఉంటాయి. అలాగే దేశంలో మొద్దులాగా పవిత్ర సంతానం మిగిలి ఉంటుంది.”

యెషయా — Chapters