[1] ద్వీపాల్లారా! నేను చెప్పేది వినండి. దూరంగా ఉన్న జనాల్లారా! ఆలకించండి. నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా జననంనుంచి ఆయన నా పేరు ప్రస్తావించాడు.
[2] ఆయన నా నోరు పదునైన కత్తిగా చేశాడు. తన చేతి నీడలో నన్ను దాచాడు. నన్ను మెరుగుపెట్టిన బాణంగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టాడు.
[3] “ఇస్రాయేలూ, నీవు నా సేవకుడివి. నీలో నా ఘనతను ప్రదర్శిస్తాను” అని నాతో చెప్పాడు.
[4] అయితే నేను అన్నాను, “వ్యర్థంగా కష్టపడ్డాను. నిష్ఫలంగా, వృథాగా నా బలం ప్రయోగించాను. అయినా నాకు రావలసినది యెహోవాదగ్గర ఉంది, నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది.”
[5] యెహోవా దృష్టిలో గౌరవనీయుణ్ణి. నా దేవుడు నాకు బలంగా ఉన్నాడు. నేను ఆయనకు సేవకుడుగా ఉండాలనీ, ఆయన దగ్గరికి యాకోబును తిరిగి రప్పించాలనీ, ఇస్రాయేల్‌ను ఆయన దగ్గర సమకూర్చాలనీ ఆయన నన్ను గర్భంలో రూపొందించాడు. యెహోవా ఇప్పుడు ఇలా అంటున్నాడు:
[6] “నీవు యాకోబు గోత్రాలను మళ్ళీ పైస్థితికి తేవడానికీ ఇస్రాయేల్‌లో తప్పించుకొన్నవాళ్ళను తీసుకు రావడానికీ నా సేవకుడుగా ఉండడం స్వల్ప విషయం. నా రక్షణ భూమికొనలకు వ్యాపించేలా నిన్ను ఇతర జనాలకు వెలుగుగా చేస్తాను.”
[7] మనుషుల తృణీకారానికీ ఈ ప్రజల ద్వేషానికీ గురి అయి, పరిపాలకులకు సేవకుడుగా ఉన్నవానితో ఇస్రాయేల్ ప్రజల విముక్తిదాతా, పవిత్రుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “నమ్మకంగా ఉన్న యెహోవా కారణంగా, నిన్ను ఎన్నుకొన్న ఇస్రాయేల్ ప్రజల పవిత్రుని కారణంగా రాజులు నిన్ను చూచి నిలబడుతారు, అధికారులు నీ ఎదుట వంగుతారు.”
[8] యెహోవా చెప్పేదేమిటంటే, “అనుకూల సమయంలో నీ ప్రార్థనకు నేను జవాబిస్తాను, రక్షణ దినంలో నీకు సహాయం చేస్తాను. నీవు బందీలతో ‘బయలుదేరండి’ అనీ, చీకటిలో ఉన్న వారితో ‘బయటికి రండి’ అనీ చెప్పేలా, ఈ దేశాన్ని సరి చేసి పాడైన వారసత్వాలను మళ్ళీ పంచిపెట్టేలా నిన్ను కాపాడుతాను, ప్రజకు ఒడంబడికగా చేస్తాను.
[9] త్రోవల ప్రక్కన వారు మేస్తారు. చెట్లులేని కొండలన్నిటిమీదా వారికి మేత దొరుకుతుంది.
[10] వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకొని వెళ్తాడు, నీటి బుగ్గలదగ్గరికి వారిని నడిపిస్తాడు, గనుక ఆకలిదప్పులంటూ వారికేమీ ఉండవు. ఎడారి వేడిమి గానీ, ఎండ గానీ వారిని బాధించవు.
[11] నా పర్వతాలన్నిటినీ త్రోవలకు మారుస్తాను. నా రాజమార్గాలను ఎత్తుగా చేయడం జరుగుతుంది.
[12] చూడండి! వీరు దూరంనుంచి వస్తున్నారు. వీరు ఉత్తర దిక్కునుంచి, పడమటి దిక్కునుంచి వస్తున్నారు. వీరు సీనీం దేశంనుంచి వస్తున్నారు.
[13] యెహోవా బాధకు గురియైన తన వారిమీద జాలిపడుతాడు, తన ప్రజను ఓదారుస్తాడు గనుక ఆకాశాల్లారా! ఆనంద ధ్వనులు చేయండి! భూమీ! సంతోషించు! పర్వతాల్లారా! ఆనంద గీతాలు పాడండి!
[14] “అయితే సీయోను ‘యెహోవా నన్ను విడిచిపెట్టాడు. ప్రభువు నన్ను మరచిపొయ్యాడు’ అంది.
[15] స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డమీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? ఒకవేళ అలాంటివారు మరవవచ్చు. గాని, నేను నిన్ను మరవను!
[16] చూడు! నా అరచేతుల మీద నిన్ను చెక్కాను! నీ గోడలు ఎప్పటికీ నా ఎదుట ఉన్నాయి.
[17] నీ కొడుకులు త్వరగా వస్తున్నారు. నిన్ను పడగొట్టి నాశనం చేసినవాళ్ళు నిన్ను విడిచివెళ్తున్నారు.
[18] తలెత్తి చుట్టూరా చూడు! నీ కొడుకులందరూ సమకూడి నీదగ్గరికి వస్తున్నారు. నీవు వారందరినీ ఆభరణంగా ధరించుకొంటావు. వారు పెళ్ళికూతురు ధరించుకొన్న ఒడ్డాణంలాగా ఉంటారు. నా జీవంతోడని ప్రమాణం చేస్తున్నాను. ఇది యెహోవా వాక్కు.
[19] “నీవు పాడైపోయి నిర్జనంగా ఉన్నా, నీ దేశం నాశనమైపోయినా ఇప్పుడు నీ నివాసులకు నీ భూమి ఇరుకుగా ఉంటుంది. నిన్ను దిగమ్రింగివేసినవాళ్ళు దూరంగా ఉంటారు.
[20] నీవు నీ పిల్లలను కోల్పోయిన తరువాత నీకు పుట్టిన కొడుకులు నీ చెవులలో, ‘ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది. ఇంకా విశాలమైన ప్రాంతం మాకియ్యి’ అంటారు.
[21] అప్పుడు నీవు ‘నా పిల్లలను కోల్పోయి, గొడ్రాలుగా ఉండి, దేశభ్రష్టురాలినై అటూ ఇటూ తిరుగులాడవలసి వచ్చింది. వీరు ఎవరివల్ల నాకు పుట్టారు! వీరిని పెంచిందెవరు? నేను ఒంటరిగానే విడవబడ్డాను. వీరు ఎక్కడనుంచి వచ్చారు?’ అనుకొంటావు.”
[22] సేనలప్రభువు యెహోవా అంటున్నాడు: “ఇదిగో విను. నేను జనాలకు చేతితో సైగ చేస్తాను. జనాలవైపు నా పతాకమెత్తుతాను. వారు నీ కొడుకులను తమ చేతులతో తీసుకువస్తారు, నీ కూతుళ్ళను తమ భుజాల మీద మోసుకువస్తారు.
[23] నీకు రాజులు పెంచే తండ్రులుగా, వారి రాణులు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వారు నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. నీ పాదాల దుమ్మును నాకుతారు. అప్పుడు నేను యెహోవాననీ నాకోసం ఆశతో చూచేవారికి ఆశాభంగం కలగదనీ నీవు తెలుసుకొంటావు.”
[24] బలాఢ్యుల చేతిలోనుంచి దోపిడీ సొమ్మును తీసుకురావడం, క్రూరులు పట్టిన బందీలను విడిపించడం సాధ్యమా?
[25] అందుకు యెహోవా ఇలా అంటున్నాడు: “బలాఢ్యులు పట్టిన బందీలను కూడా విడిపించడం, క్రూరుల దోపిడీ కూడా తప్పించడం జరుగుతుంది. నీతో పోరాడేవాళ్ళతో నేనే పోరాడుతాను. నీ పిల్లలను నేనే రక్షిస్తాను.
[26] నిన్ను బాధించేవాళ్ళను తమ శరీరాలను తామే తినేలా చేస్తాను. మద్యంతో మత్తుగా ఉన్నట్టు వారి రక్తంతో వారు మత్తుగా ఉంటారు. అప్పుడు నేను యెహోవాను యాకోబు బలవంతుణ్ణి నీ రక్షకుణ్ణనీ నీ ముక్తిప్రదాతననీ మనుషులంతా తెలుసుకొంటారు.