Skip to content
Opens in a new window

[1] సముద్రతీరాన ఉన్న ఎడారి విషయం దేవోక్తి: దక్షిణ ప్రదేశంలో సుడిగాలులు వీచే విధంగా ఎడారినుంచి భయంకర దేశంనుంచి విపత్తు వస్తూ ఉంది.

[2] క్రూరమైన సంఘటనలను సూచించే దర్శనం నాకు కనబడింది. ద్రోహులు ద్రోహం చేస్తారు. దోపిడీగాళ్ళు దోచుకొంటారు. “ఏలాం దేశమా! బయలుదేరు! మాదీ దేశమా! ముట్టడి వెయ్యి! అది కలిగించిన మూలుగులన్నిటినీ నేను మానిపిస్తాను.”

[3] ఇందుచేత నా నడుముకు చాలా వేదన పట్టింది. స్త్రీకి పట్టిన కాన్పునొప్పులలాంటి నొప్పులు నాకు కలిగాయి. నేను విన్నదాని కారణంగా అల్లాడిపోతున్నాను. చూచినదాని కారణంగా హడలిపోతున్నాను.

[4] నాకు జారుగుండె పడింది. మహా భయం నాకు ముంచుకువస్తూ ఉంది. నాకు చాలా ఇష్టమైన సంధ్యవేళ భయంకరమైపోయింది.

[5] భోజనం కోసం బల్లలను సిద్ధం చేస్తున్నారు, తివాసీలు పరుస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు అధిపతులారా, లెండి! డాళ్ళకు చమురు రాయండి!

[6] ఎందుకంటే ప్రభువు నాతో ఇలా అన్నాడు: “నీవు వెళ్ళి కావలివాణ్ణి పెట్టు. అతడు తనకు కనిపించేదానిని తెలియజేయాలి.

[7] రౌతులు జత జతలుగా రావడం, గాడిదల వరుస, ఒంటెల వరుస రావడం అతడికి కనిపించినప్పుడు అతడు మెళుకువగా ఉండాలి, చాలా మెళుకువగా ఉండాలి.”

[8] సింహం గర్జించేవిధంగా కావలివాడు బిగ్గరగా అరచాడు: “నా యజమానీ! పగలు నేను ఎప్పుడూ కావలిగోపురం మీద నిలుచునే ఉన్నాను. రాత్రి అంతా కావలి కాస్తూ ఉన్నాను.

[9] ఇదిగో! జతజతలుగా రౌతుల గుంపు వస్తూ ఉంది. ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నిటినీ ఆయన నేలమీద పడేసి ముక్కలు చేశాడు’ అంటున్నాడొకడు.”

[10] కళ్ళంలో నూర్చబడ్డ నా జనమా! ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనలప్రభూ అయిన యెహోవా నాకు వినిపించిన సంగతి మీకు తెలియజేస్తున్నాను.

[11] దూమా విషయం దేవోక్తి: “కావలివాడా! రాత్రి ఎంత వేళైంది? కావలివాడా! రాత్రి ఎంత వేళైంది?” అని ఒక వ్యక్తి శేయీరు కొండనుంచి కేక వేసి నన్ను అడుగుతున్నాడు.

[12] కావలివాడు “ఉదయం వస్తుంది. రాత్రి కూడా వస్తుంది. మీరు అడగాలనుకొంటే అడగండి. తిరిగి రండి” అంటున్నాడు.

[13] అరేబియా విషయం దేవోక్తి: దెదాను జాతివారైన వర్తకుల సార్థవాహమా! అరబి ఎడారిలో రాత్రి గడుపు.

[14] తేమా కాపురస్తులారా! దప్పిగొన్నవాళ్ళకు నీళ్ళు తెండి. ఆహారం తీసుకొని, పారిపోయినవారిని కలుసుకోండి.

[15] కత్తిబారినుంచి, దూసిన కత్తిబారినుంచి వాళ్ళు పారిపోతున్నారు. ఎక్కుపెట్టిన వింటి బారినుంచి, తీవ్ర యుద్ధంనుంచి పారిపోతున్నారు.

[16] ప్రభువు నాతో చెప్పేదేమిటంటే, “కూలివాళ్ళ లెక్కప్రకారం ఒకే సంవత్సరం లోపల కేదారువాళ్ళ వైభవమంతా నాశనమవుతుంది.

[17] కేదారువాళ్ళ పరాక్రమశాలురైన విలుకాండ్లలో కొద్దిమందే మిగులుతారు.” ఇలా జరుగుతుందని ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా అంటున్నాడు.

యెషయా — Chapters