[1] “దప్పిగొన్నవారలారా! మీరంతా నీళ్ళ దగ్గరికి రండి. డబ్బు లేని వారలారా! మీరు వచ్చి, కొని, తినండి! రండి! డబ్బు లేకుండానే, ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షరసం, పాలు కొనండి!
[2] ఆహారం కానిదానికి డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు? తృప్తి కలిగించనిదానికి మీ కష్టార్జితం ఎందుకిస్తారు? నా మాట వినండి.
[3] “చెవి ఒగ్గి నాదగ్గరికి రండి, నా మాట వినండి. అప్పుడు మీ ప్రాణం దక్కించుకొంటారు. నేను మీతో శాశ్వతంగా నిలిచివుండే ఒడంబడిక చేస్తాను. దావీదుకు వాగ్దానం చేసిన అమోఘమైన అనుగ్రహం మీకు చూపిస్తాను.
[4] నేను జనాలకు అతణ్ణి సాక్షిగా నియమించాను, జనాలకు నాయకుడుగా, అధిపతిగా నియమించాను.
[5] నీకు తెలియని జనాలను నీవు పిలుస్తావు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఘనపరచాడు. ఆయన ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు. నిన్ను ఎరగని జనాలు ఆయనకారణంగా నీ దగ్గరికి త్వరగా వస్తాయి.”
[6] యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయనను వేడుకోండి.
[7] దుర్మార్గులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవారు తమ తలంపులను మానాలి. వారు యెహోవావైపు తిరగాలి. అప్పుడు ఆయన వారిని కరుణిస్తాడు. వారు మన దేవునివైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు.
[8] యెహోవా చెప్పేదేమిటంటే, “నా ఆలోచనలు మీ ఆలోచనలలాంటివి కావు. మీ విధానాలు నా విధానాలలాంటివి కావు.
[9] ఆకాశాలు భూమికంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాలకంటే, నా ఆలోచనలు మీ ఆలోచనలకంటే ఉన్నతంగా ఉన్నాయి.
[10] వాన, మంచు ఆకాశంనుంచి వచ్చి భూమిని తడుపుతాయి, దానినుంచి మొక్కలు మొలిపించి ఫలించేలా చేసి, చల్లడానికి విత్తనాలనూ తినడానికి ఆహారాన్నీ ఇస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగిపోవు.
[11] నా నోటనుంచి వెలువడ్డ వాక్కు అలాగే ఉంటుంది. అది నిష్ఫలంగా నాదగ్గరికి తిరిగి రాదు. అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది, నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.
[12] “మీరు సంతోషంతో బయలుదేరుతారు. మిమ్మల్ని శాంతితో బయటికి నడిపించడం జరుగుతుంది. మీ ఎదుట పర్వతాలు, కొండలు ఆనంద ధ్వనులు చేస్తాయి. మైదానంలో చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.
[13] ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండి చెట్లకు బదులు గొంజి చెట్లు పెరుగుతాయి. అది యెహోవాకు పేరుప్రతిష్ఠలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.