[1] “దర్శనం లోయ” విషయం దేవోక్తి: ఏమి వచ్చి మీరంతా మిద్దెలమీదికి ఎక్కిపోయారు?
[2] అల్లరితో నిండిపోయి కేకలు వినిపిస్తూ ఉన్న నగరమా! ఉత్సాహమయమైన పట్టణమా! నీలో హతమైనవాళ్ళు ఖడ్గంచేత హతం కాలేదు. యుద్ధంలో చనిపోలేదు.
[3] నీ నాయకులంతా కలిసి పారిపోయారు. విల్లు ప్రయోగించకుండా వాళ్ళు పట్టబడ్డారు. శత్రువులు ఇంకా దూరంగా ఉండగానే పారిపోయినా మీలో దొరికిన వాళ్ళు పట్టబడ్డారు.
[4] అందుచేత “నా వైపునుంచి తిరుగండి. నేను భోరున ఏడుస్తాను. నా ప్రజలకు వచ్చిన నాశనం విషయం నన్ను ఓదార్చడానికి ప్రయత్నం చేయకండి” అన్నాను నేను.
[5] సేనలప్రభువు యెహోవా “దర్శనం లోయ”కు ఒక రోజున నియమించాడు. అది అల్లరితో, ఓటమితో, కలవరంతో కూడిన రోజు. గోడలను పడగొట్టే రోజు. కొండవైపు సహాయంకోసం అరిచే రోజు.
[6] ఏలాం అంబులపొదిని తీసుకొని పదాతి బలాన్ని, రథాలను, రౌతులను సమకూరుస్తూ ఉంది. కీర్ పట్టణం డాలుపై గవిసెన తీసివేస్తూ ఉంది.
[7] అందమైన నీ లోయల నిండా రథాలున్నాయి. రౌతులు నీ నగరద్వారం దగ్గర బారులు తీరుస్తూ ఉన్నారు.
[8] యూదానుంచి ముసుకును తీసివేయడం జరిగింది. ఆ రోజున నీవు “అడవినగరు”లో ఉన్న ఆయుధాల కోసం చూశావు.
[9] దావీదునగర ప్రాకారాలలో అనేక బీటలుండడం చూచి, క్రింది కోనేటిలో నీళ్ళను మీరు సమకూర్చారు.
[10] జెరుసలం ఇండ్లను లెక్కపెట్టి, నగరం గోడలను దృఢం చేయడానికి ఇండ్లను పడగొట్టారు.
[11] పాత కోనేటి నీళ్ళకోసం ఆ రెండు గోడలమధ్య చెరువు కట్టారు. అయితే దానిని చేయించినవాని వైపు మీరు చూడలేదు. చాలా కాలం క్రిందట దానిని నిర్మించినవాడంటే మీకు లక్ష్యం లేకపోయింది.
[12] ఆ రోజున మీరు ఏడ్చి రోదనం చేయాలని, తల బోడిచేసుకొని గోనెపట్ట కట్టుకోవాలని సేనల ప్రభువు యెహోవా మిమ్మల్ని పిలిచాడు.
[13] అయితే మీరు “రేపు చచ్చిపోతాం, గనుక తిందాం, త్రాగుదాం” అని చెప్పి, పశువులను వధిస్తూ, గొర్రెలను కోస్తూ, మాంసం తింటూ, ద్రాక్షమద్యం త్రాగుతూ, సంతోషిస్తూ, సంబరపడుతూ ఉన్నారు.
[14] అయితే, నా చెవులకు సేనలప్రభువు యెహోవా ఈ విషయం వెల్లడి చేశాడు: “మీరు చచ్చిపోయేంతవరకు కూడా ఈ మీ అపరాధానికి ప్రాయశ్చిత్తం కలగదు. ఇది సేనల ప్రభువు యెహోవా చెప్పిన మాట.”
[15] సేనలప్రభువు యెహోవా అన్నాడు, “భవనంలో కార్యనిర్వాహకుడైన షెబ్నాదగ్గరికి వెళ్ళి అతడితో ఈ విధంగా చెప్పు:
[16] ఇక్కడ నీ కోసం సమాధి తొలిపించుకోవడానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ నీకెవరు ఉన్నారు? ఎత్తయిన స్థలంలో సమాధి తొలిపించుకొంటున్నావు. బండలో నీకోసం విశ్రాంతి స్థలం తొలిపించుకొంటున్నావు.
[17] ఇదిగో! బలాఢ్యుడు విసరివేసే విధంగా యెహోవా నిన్ను గట్టిగా పట్టుకొని విసరివేయ బోతున్నాడు.
[18] ఆయన నిన్ను చెండులాగా చుట్టబెట్టి ఒక విశాలమైన దేశంలోకి విసరివేస్తాడు. అక్కడే నీవు చస్తావు. నీ ఘనమైన రథాలు అక్కడే ఉండిపోతాయి. నీవు నీ యజమాని ఇంటికి అవమానం తెచ్చిపెట్టేవాడివి.
[19] నిన్ను నీ పదవినుంచి తొలగించడం, నీ ఉద్యోగంనుంచి త్రోసివేయడం జరుగుతుంది.
[20] “ఆ రోజున నేను హిల్కీయా కొడుకూ నా సేవకుడూ అయిన ఎల్‌యాకీమును పిలుస్తాను,
[21] అతనికి నీ నిలువుటంగీని తొడిగించి, నీ నడికట్టు కట్టి, నీ అధికారం అతనికిస్తాను. అతడు జెరుసలం నివాసులకూ యూదా వంశీయులకూ తండ్రిగా ఉంటాడు.
[22] నేను దావీదు రాజవంశం తాళంచెవిని అతని భుజంమీద ఉంచుతాను. అతడు తెరిస్తే ఎవరూ మూయలేరు. అతడు మూసివేస్తే ఎవరూ తెరువలేరు.
[23] గట్టి చోట మేకు కొట్టినట్టు నేను అతణ్ణి మేకులాగా సుస్థిరమైన స్థానంలో ఉంచుతాను. అతడు తన తండ్రి వంశానికి ఘన సింహాసనంగా ఉంటాడు.
[24] మేకు మీద వ్రేలాడవేసినట్టు అతని మీద తన తండ్రి వంశానికి చెందే ఘనత అంతటినీ వ్రేలాడవేస్తారు. దాని సంతానమంతా చెంబులు, సీసాలు, చిన్న చిన్న పాత్రలలాంటి వాళ్ళంతా అతనిమీద వ్రేలాడుతారు.
[25] “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, ఆ రోజున గట్టి చోట కొట్టిన మేకు ఊడిపోతుంది. విరిగి పడుతుంది. దానిమీద వ్రేలాడే భారం నాశనం అవుతుంది.” ఇలా జరుగుతుందని యెహోవా అన్నాడు.