Skip to content
Opens in a new window

[1] జనాల్లారా! దగ్గరికి వచ్చి వినండి. లోక జాతుల్లారా! ఆలకించండి. భూమి, దానిమీద ఉన్నదంతా, లోకం, దానిలో పుట్టేదంతా వినాలి.

[2] యెహోవా అన్ని జనాలమీద కోపపడుతూ ఉన్నాడు. ఆయన వాటి సైన్యాలన్నిటిమీదా ఆగ్రహం ఉంది. ఆయన వాటిని నాశనానికి గురి చేసి సంహారానికి అప్పగిస్తాడు.

[3] వాటిలో హతమైనవాళ్ళను బయట పారవేయడం జరుగుతుంది. ఆ శవాలు కంపుగొడతాయి. వాళ్ళ రక్తంతో కొండలు కరిగిపోతాయి.

[4] ఆకాశాలలో ఉన్న సమూహమంతా కరిగిపోతుంది. చుట్టి ఉన్న పత్రంలాగా ఆకాశాలు చుట్టుకొనిపోతాయి. ద్రాక్షచెట్టునుంచి ఆకు వాడి, రాలే విధంగా, అంజూరుచెట్టునుంచి వాడిపోయిన ఆకు రాలే విధంగా ఆకాశాల సమూహమంతా రాలిపోతుంది.

[5] నిజంగా ఆకాశాలలో నా ఖడ్గం మత్తుగా త్రాగింది. ఇప్పుడు అది నేను నాశనానికి గురి చేసే జనమైన ఎదోం వాళ్ళ మీదికి దిగి వస్తూ ఉంది. అది వాళ్ళకు తీర్పు తీరుస్తుంది.

[6] యెహోవా ఖడ్గం రక్తమయమవుతుంది. అది క్రొవ్వుతో కప్పి ఉంది. ఆ రక్తం గొర్రెపిల్లలది, మేకలది. ఆ క్రొవ్వు పొట్టేళ్ళ మూత్రపిండాల క్రొవ్వు. ఎందుకంటే, బొస్రా పట్టణంలో యెహోవా బలి జరిగిస్తాడు, ఎదోంలో మహా సంహారం చేస్తాడు.

[7] వాటితో కూడా అడవిదున్నపోతులు, ఎద్దులు, కోడెలు కూలుతాయి. ఎదోంవాళ్ళ భూమి రక్తంతో నానుతుంది, మట్టి క్రొవ్వుతో కలసిపోతుంది.

[8] ఎందుకంటే, యెహోవా ప్రతిక్రియ దినాన్ని నియమించాడు. సీయోను పక్షాన ప్రతీకారం సంవత్సరాన్ని నియమించాడు.

[9] ఎదోం కాలువలు తారు అవుతాయి. దాని మట్టి గంధకంగా మారుతుంది. దాని భూమి కాలిపోతూ ఉన్న తారు అవుతుంది.

[10] అది రాత్రి గానీ, పగలు గానీ ఆరదు. దాని పొగ ఎప్పటికీ లేస్తూ ఉంటుంది. ఆ భూమి తరతరాలకూ పాడుగా ఉంటుంది. ఎన్నడూ ఎవడూ మళ్ళీ దానిలో పడి దాటడు.

[11] గూడకొంగలు, ముళ్ళపందులు దానిని ఆక్రమించుకొంటాయి. అది గుడ్లగూబకూ కాకికీ ఉనికిపట్టు అవుతుంది. యెహోవా నిరాకారం అనే కొలనూలు, శూన్యం అనే గుండును దానిమీద చాపుతాడు.

[12] రాజ్యానికి పిలవడానికి దాని ఘనులు ఉండరు. దాని నాయకులంతా గతించిపోతారు.

[13] దాని భవనాలలో ముళ్ళచెట్లు పెరుగుతాయి. దాని కోటలలో దురదగొండ్లు, గచ్చపొదలు అంకురిస్తాయి. ఆ దేశం నక్కలకు నివాసస్థలంగా, నిప్పుకోళ్ళకు ఉనికిపట్టుగా ఉంటుంది.

[14] ఎడారి ప్రాణులూ సివంగులూ అక్కడ కలసిమెలసి ఉంటాయి, అడవిమేకలు అరుస్తూ పిలుచుకొంటాయి. అక్కడ రాత్రిప్రాణులు దిగి విశ్రమ స్థలం చూచుకొంటాయి.

[15] గుడ్లగూబ అక్కడ గూడు కట్టి గుడ్లు పెట్టి పొదిగి తన పిల్లలను తన రెక్కల నీడలో సమకూరుస్తుంది. అక్కడ తెల్లగద్దలు తమ జాతి పక్షులను కలుసుకొంటాయి.

[16] యెహోవా గ్రంథంలో వెదకి చదువుకోండి. ఆ జంతువులలో ఏదీ లేకపోదు. దేని జతది దాని దగ్గర తప్పక ఉంటుంది. ఆయన నోటనుంచి ఆజ్ఞ వెలువడింది. ఆయన ఆత్మచేత అవి సమకూడుతాయి.

[17] ఆయన వాటికి వంతులను నిర్ణయించాడు. ఆయన కొలనూలు చేతపట్టుకొని ఆ దేశాన్ని విభాగించి ఇస్తాడు. అది ఎప్పటికీ వాటి స్వాధీనంలో ఉంటుంది. అవి తరతరాలకూ దానిలో ఉండిపోతాయి.

యెషయా — Chapters