[1] యెహోవా నాతో అన్నాడు, “పెద్ద పలక తీసుకొని, మామూలు వ్రాతతో దానిమీద ఈ మాటలు వ్రాయి: ‘మహేర్ షాలాల్ హాష్‌బజు.’
[2] నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఊరియాయాజిని, యెబెరెకయా కొడుకు జెకర్యాను పెట్టుకొంటాను.”
[3] తరువాత నేను దేవునిమూలంగా పలికే ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళాను. ఆమె గర్భం ధరించి కొడుకును కన్నది. అప్పుడు యెహోవా “అతడికి ‘మహేర్ షాలాల్ హాష్‌బజు’ అనే పేరు పెట్టు.
[4] ఆ పిల్లవాడు ‘నాయనా’ ‘అమ్మా’ అనడం నేర్చుకోకముందే అష్షూరు రాజు దమస్కు సంపత్తునూ షోమ్రోను దోపిడీ సొమ్మునూ ఎత్తుకుపోతాడు” అని నాతో అన్నాడు.
[5] యెహోవా ఇంకా నాతో అన్నాడు,
[6] “ఈ ప్రజలు ప్రశాంతంగా పారే షిలోహు నీళ్ళు వద్దని, రెజీను, రెమలయా కొడుకు విషయంలో సంతోషిస్తూ ఉన్నారు.
[7] ప్రభువు అష్షూర్ రాజూ అతడి సర్వ ప్రతాపమూ అనే బలమైన యూఫ్రటీస్ నదిలోని విస్తారమైన నీళ్ళను వారిమీదికి రప్పిస్తాడు. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి, ఒడ్డులన్నిటిమీద పొర్లిపారుతాయి.
[8] అవి యూదా దేశంమీదికి వచ్చి దానిని ముంచివేస్తాయి. నీళ్ళ మట్టం మెడలవరకు హెచ్చుతుంది. ఇమ్మానుయేల్! దాని వరదలు పక్షి చాపిన రెక్కలలాగా నీ దేశ వైశాల్యమంతా వ్యాపిస్తాయి.”
[9] జనాల్లారా! రేగండి, ఓడిపోండి! దూర దేశాల్లారా! వినండి! ఆయుధాలు కట్టుకొని ఓడిపోండి! ఆయుధాలు కట్టుకొని ఓడిపోండి!
[10] ఆలోచన చేసుకోండి! అది భంగమవుతుంది. ఆశయం తెలియజేయండి. అది నెరవేరదు. ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు.
[11] యెహోవా తన బలీయమైన చెయ్యి నామీద ఉంచి, ఈ ప్రజల తీరుతెన్నులను అనుసరించకూడదని నన్ను హెచ్చరించి ఇలా అన్నాడు:
[12] “ఈ ప్రజలు ‘కుట్ర’ అని చెప్పే ప్రతిదీ కుట్ర అనుకోవద్దు. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు. దానివల్ల హడలిపోవద్దు.
[13] సేనలప్రభువు యెహోవానే పవిత్రుడుగా గౌరవించాలి. మీరు హడలిపోయి భయపడవలసినవాడు ఆయనే.
[14] అప్పుడు ఆయన మీకు పవిత్ర ఆశ్రయంగా ఉంటాడు. కాని, ఆయన ఇస్రాయేల్‌యొక్క రెండు రాజవంశాలకు తగిలే రాయిగా, తొట్రుపాటు బండగా ఉంటాడు. జెరుసలం నగరవాసులకు బోనుగా, ఉచ్చుగా ఉంటాడు.
[15] వారిలో చాలామంది తొట్రుపడుతారు, కూలి చితికిపోతారు, చిక్కుపడి పట్టబడుతారు.”
[16] ఈ హెచ్చరిక మాటలను కట్టి, ఈ ఉపదేశాన్ని ముద్రించి నా శిష్యులకు అప్పగించు.
[17] నేను యెహోవాకోసం ఆశతో ఎదురు చూస్తాను. ఆయన యాకోబు వంశానికి తన ముఖం కనబడకుండా చేశాడు గాని, నేను ఆయనమీద నమ్మకముంచుతాను.
[18] నన్నూ దేవుడు నాకిచ్చిన పిల్లలనూ చూడండి. సీయోనుకొండ మీద నివసించే సేనలప్రభువు యెహోవా నియమించిన సూచనలుగా, సంకేతాలుగా మేము ఇస్రాయేల్ ప్రజల మధ్య ఉన్నాం.
[19] మనుషులు మిమ్మల్ని చూచి “కర్ణపిశాచం గల వాళ్ళనూ, కిచకిచమంటూ గుసగుసలాడే మాంత్రికులనూ సంప్రదించండి” అని చెపుతారేమో. అయితే ప్రజలు తమ దేవునిదగ్గరే విచారణ చేయకూడదా? సజీవులకోసం చచ్చినవాళ్ళ దగ్గర విచారణ చేయడం మంచిదా?
[20] ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని విచారించండి! ఈ మాట ప్రకారం వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకు తెల్లవారలేదన్నమాట!
[21] కష్టం అనుభవిస్తూ, ఆకలిగొంటూ, వాళ్ళు దేశంలో తిరుగాడుతారు. అలా ఆకలితో ఉన్నప్పుడు కోపంతో మండిపడి, పైకి చూస్తూ, తమ రాజునూ తమ దేవుణ్ణీ శపిస్తారు.
[22] భూమివైపు చూచినప్పుడు వాళ్ళకు దురవస్థ, అంధకారం, భయంకరమైన చీకటి కనిపిస్తాయి. వాళ్ళను గాఢాంధకారంలోకి తోసివేయడం జరుగుతుంది.