[1] యెహోవా ఇలా అంటున్నాడు: “గొడ్రాలా! పిల్లలను ఎన్నడూ కననిదానా! ఆనంద గీతం పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా! ఆనందగీతమెత్తి సంతోషించు. ఎందుకంటే, భర్త ఉన్న స్త్రీ పిల్లలకంటే విడవబడ్డదాని పిల్లలు ఎక్కువమంది.
[2] నీ గుడారమున్న స్థలాన్ని పెద్దదిగా చెయ్యి. నీ డేరా తెరలను ఇంకా పొడిగించు. వెనక్కు పట్టి ఉంచకు. నీ త్రాళ్ళను పొడుగు చెయ్యి. నీ మేకులను బలపరచు.
[3] ఎందుకంటే నీవు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం ఇతర జనాల దేశాలను స్వాధీనం చేసుకొంటారు, వాటి పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.
[4] “భయపడకు. నీవు అవమానాన్ని మరచిపోతావు. సిగ్గుపాలు కాబోవు. నీకు తలవంపులు కలగవు. యువదశలో నీకు కలిగిన అవమానాన్ని నీవు మరచిపోతావు. వితంతువుగా ఉన్న నీ పరిస్థితుల నింద ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోవు.
[5] ఎందుకంటే, నీ భర్త నీ సృష్టికర్తే. ఆయన పేరు సేనలప్రభువు యెహోవా, నీ విమోచకుడు ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడు. సర్వలోకానికీ దేవుడు అని ఆయనకు పేరు.
[6] “నీ దేవుడు అంటున్నాడు, నీవు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యగా ఉన్నావు, పడుచుతనంలో పెళ్ళి చేసుకొని తృణీకారానికి గురి అయిన భార్యగా ఉన్నావు. అలాంటి నిన్ను యెహోవా మళ్ళీ పిలుస్తున్నాడు.
[7] క్షణమాత్రం నేను నిన్ను విడిచిపెట్టాను గాని, మహా వాత్సల్యంతో నిన్ను మళ్ళీ సమకూరుస్తాను.
[8] నాకు కోపం ముంచుకు వచ్చింది. క్షణమాత్రం నీకు నా ముఖం కనబడకుండా చేశాను. అయితే నా శాశ్వతమైన అనుగ్రహం మూలంగా నీకు వాత్సల్యం చూపుతాను. ఇది నీ విమోచకుడైన యెహోవా వాక్కు.
[9] “ఇది నాకు నోవహు కాలంలాంటిది. ఆ కాలంలో వరదలు భూమిని ముంచివేసినట్టు ఇంక ఎన్నడూ ముంచివేయవని నేను ప్రమాణం చేశాను. నీమీద కోపగించననీ నిన్ను గద్దించననీ ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను.
[10] పర్వతాలు తొలగిపోయినా కొండలు కదలినా నా అనుగ్రహం నీనుంచి తొలగిపోదు, నా శాంతి ఒడంబడిక కదలదు. ఇది నీమీద జాలిపడే యెహోవా వాక్కు.
[11] “బాధపడుతున్న నగరమా! తుఫానులకు కంపిస్తూ, ఆదరణ లేకుండా ఉన్నదానా! నేను నిన్ను వైడూర్యాలతో నిర్మిస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను.
[12] కెంపులతో నీ బురుజులను, నిప్పులాగా మెరిసే మణులతో నీ ద్వారం తలుపులను, విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను.
[13] యెహోవా నీ పిల్లలందరికీ ఉపదేశిస్తాడు. నీ పిల్లల శాంతి అధికంగా ఉంటుంది.
[14] నిన్ను నీతినిజాయితీతో స్థాపించడం జరుగుతుంది. ప్రజ పీడన నీకు దూరంగా ఉంటుంది. నీవు భయపడనవసరం ఉండదు. బీతి నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరికి రానే రాదు.
[15] ఎవరైనా నీకు వ్యతిరేకంగా గుమికూడితే అది నావల్ల జరగదు. ఒకవేళ ఎవరైనా అలా గుమికూడితే వాళ్ళు నీకు లొంగిపోతారు.
[16] “ఇదిగో విను! నిప్పులూది పనికి తగిన ఆయుధాలను చేసే కమ్మరిని సృజించినది నేనే. ధ్వంసం చేయడానికి వినాశకారిని సృజించినది నేనే.
[17] నీకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఏ ఆయుధమూ గెలవదు. న్యాయ విమర్శలో ఇతరులు చేసే ప్రతి నేరారోపణనూ నీవు పడగొట్టగలుగుతావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. ఇది యెహోవా వాక్కు.