Skip to content
Opens in a new window

[1] ఇది బబులోను విషయం ఆమోజు కొడుకు యెషయాకు వెల్లడి అయిన దేవోక్తి:

[2] వాళ్ళు ప్రముఖుల గుమ్మాలలో ప్రవేశించాలని చెట్లు లేని కొండమీద పతాకం ఎత్తండి, కంఠమెత్తి వాళ్ళను పిలవండి, చేసైగ చేయండి.

[3] నా పవిత్రులకు నేను ఆజ్ఞ జారీ చేశాను. నా కోపం నెరవేర్చడానికి నా పరాక్రమశాలురను – నా ప్రభావాన్ని బట్టి ఆనందించేవారిని పిలిపించాను.

[4] వినండి! కొండలలో గొప్ప జనసమూహం ఉన్నట్టు కలకలం వినబడుతూ ఉంది. వినండి! జనాలు సమకూడుతూ ఉన్నట్టు రాజ్యాలలో అల్లకల్లోలం వినబడుతూ ఉంది. సేనలప్రభువు యెహోవా యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తూ ఉన్నాడు.

[5] వాళ్ళు యెహోవా కోప సాధనాలుగా ఉన్నారు. దేశాన్నంతా నాశనం చేయడానికి యెహోవా వాళ్ళతోకూడ దూర దేశంనుంచి, ఆకాశ దిగంతాలనుంచి వస్తూ ఉన్నాడు.

[6] యెహోవా దినం దగ్గరపడింది, రోదనం చేయండి! అది అమిత శక్తిమంతుని దగ్గరనుంచి నాశనంలాగా వస్తుంది.

[7] అందుచేత ప్రతి చేయీ దించి ఉంటుంది, ప్రతివాడి గుండె కరిగిపోతుంది.

[8] ప్రజలకు భయాందోళన ముంచుకువస్తుంది. బాధలు, వేదనలు వాళ్ళకు కలుగుతాయి. కాన్పు నొప్పులు పడే స్త్రీలాగా వాళ్ళు అల్లాడిపోతారు. వాళ్ళ ముఖాలు మంటల్లాగా ఎర్రబారి, ఒకరినొకరు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు.

[9] ఇదిగో, వినండి! యెహోవా దినం వస్తూ ఉంది. అది ఆగ్రహం, తీవ్రమైన కోపంతో కూడిన క్రూర దినం. దేశాన్ని పాడు చేయడానికీ పాపులను దానిలో లేకుండా నాశనం చేయడానికీ అది వస్తుంది.

[10] ఆకాశంలో నక్షత్రాలు, నక్షత్ర రాసులు ప్రకాశించడం మానివేస్తాయి. ప్రొద్దు పొడిచేటప్పుడు దానిని చీకటి కమ్ముతుంది. చంద్రమండలం నుంచి వెలుగు రాదు.

[11] “నేను లోకాన్ని దాని చెడుగు కారణంగా, దుర్మార్గులను వాళ్ళ అపరాధాల కారణంగా శిక్షిస్తాను. గర్విష్టుల మిడిసిపాటును మానిపిస్తాను. బలాత్కారుల అహంభావాన్ని అణచివేస్తాను.

[12] మేలిమి బంగారం కంటే, ఓఫీరు దేశం బంగారం కంటే మనుషులు అరుదుగా కనిపించేలా చేస్తాను.

[13] సేనల ప్రభువు యెహోవా ఆగ్రహానికి, ఆయన తీక్షణమైన కోప దినానికి ఆకాశాలు వణికేలా, భూమి కదలి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.

[14] “అప్పుడు వేటకు గురి అయిన జింకలాగా, ఎవడూ పోగుచేయని గొర్రెలలాగా ప్రతి ఒక్కరూ స్వజనంవైపు తిరుగుతారు, స్వదేశానికి పారిపోతారు.

[15] పట్టబడే ప్రతి ఒక్కరూ కత్తిపాలు అవుతారు. బందీలైన వాళ్ళంతా కత్తివాతతో కూలుతారు.

[16] వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ పసిపిల్లలను విసరికొట్టి ముక్కలు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇండ్లను దోచుకోవడం, వాళ్ళ భార్యలను చెరపట్టడం జరుగుతుంది.

[17] “వారికి వ్యతిరేకంగా మాదియవాళ్ళను నేను పురికొల్పుతాను. వీళ్ళకు వెండి అంటే లెక్కలేదు. బంగారం అంటే ఇష్టం లేదు.

[18] వాళ్ళ విండ్లు యువకులను కూలుస్తాయి. వాళ్ళు పసిబిడ్డలమీద జాలిపడరు, చిన్నపిల్లలను కరుణించరు.

[19] అప్పుడు రాజ్యాలలో భూషణంగా ఉన్న బబులోను, కల్దీయవాళ్ళకు గర్వకారణంగా ఘనతగా ఉన్న బబులోను, దేవునిచేత పడద్రోయబడ్డ సొదొమ గొమొర్రాల లాగా అవుతుంది.

[20] అప్పటినుండి బబులోను ఇంకా ఎన్నడూ నివాసస్థలంగా ఉండదు. తరతరాలకూ దానిలో ఎవరూ కాపురం ఉండరు. అరబ్బులలో ఎవడూ అక్కడ తన డేరా వేయడు. గొర్రెల కాపరులు మందలను అక్కడ పడుకోబెట్టరు.

[21] ఎడారి జంతువులు అక్కడ పండుకొంటాయి. నక్కలు దాని ఇండ్లలో ఉంటాయి. నిప్పుకోళ్ళకు అది ఉనికిపట్టవుతుంది. కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.

[22] దాని నగరులలో నక్కలు కూస్తాయి. దాని సుఖవిలాసాల భవనాలలో అడవి కుక్కలు మొరుగుతాయి. దాని కాలం దగ్గరపడింది. దానికి మిగిలే రోజులు కొద్దిగానే ఉన్నాయి.”

యెషయా — Chapters