Skip to content
Opens in a new window

[1] తటతట కొట్టుకొంటూ ఉన్న రెక్కలున్న దేశం కూషు నదుల అవతల ఉంది. దానికి బాధ తప్పదు.

[2] అది సముద్రంలో నీళ్ళమీద జమ్ము పడవలలో రాయబారులను పంపుతూ ఉంది. త్వరపడే దూతలారా! నున్నని చర్మం గల పొడుగాటి జనం దగ్గరికి వెళ్ళండి. ఆ జనం నలుదిక్కులా భయం కలిగించేవారు! చాలా బలమైన జనం, ఇతర జనాలను అణగద్రొక్కే జనం. దాని దేశాన్ని నదులు విభజిస్తాయి.

[3] లోకనివాసులారా! భూమిమీద కాపురముంటున్న వారలారా! పర్వతాలమీద జెండాను ఎత్తడం జరిగేటప్పుడు మీరంతా చూస్తారు. బూర ఊదడం జరిగినప్పుడు మీరంతా వింటారు.

[4] యెహోవా నాతో అంటున్నాడు: “ఎండ కాస్తూ ఉన్నప్పుడు, కోతకాలం వేడిమిలో పొగమంచు మబ్బులాగా ఏర్పడినప్పుడు, నేను నెమ్మదిగా నా నివాసస్థలంనుంచి చూస్తూ ఉంటాను.”

[5] కోతకాలం రాకముందే పువ్వు వాడిపోయి ద్రాక్షకాయలు పరిపక్వం అవుతుండగానే ఆయన పోటకత్తులతో ద్రాక్ష తీగెలను నరికి వ్యాపిస్తున్న కొమ్మలనూ రెమ్మలనూ కోసివేస్తాడు.

[6] వాటిని కొండలలో ఉన్న క్రూరపక్షులకూ భూమిమీద ఉన్న మృగాలకూ వదలివేస్తాడు. ఎండ కాలంలో ఆ పక్షులు వాటిని తింటాయి, చలికాలంలో ఆ మృగాలు వాటిని తింటాయి.

[7] అప్పుడు కానుకలు సేనలప్రభువు యెహోవా దగ్గరికి తేవడం జరుగుతుంది. ఆ కానుకలు నున్నని చర్మం గల పొడుగాటి ఆ జనం దగ్గరనుంచి, నలుదిక్కులా భయం కలిగించే ఆ జనం దగ్గరనుంచి, ఆ బలమైన జనం దగ్గరనుంచి, ఇతర జనాలను అణగద్రొక్కే ఆ జనం దగ్గరనుంచి, నదులు విభజించే ఆ దేశంనుంచి వస్తాయి. ఆ కానుకలు సేనలప్రభువు యెహోవా పేరు ఉన్న సీయోను కొండకు వస్తాయి.

యెషయా — Chapters