Skip to content
Opens in a new window

[1] అయితే ఇప్పుడు యాకోబూ! నిన్ను సృజించిన యెహోవా, ఇస్రాయేలూ! నిన్ను రూపొందించిన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను నిన్ను వెల ఇచ్చి విడిపించాను. భయంతో ఉండబోకు. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా సొత్తు.

[2] నీవు నీళ్ళలో పడి దాటేటప్పుడు నేను నీతో ఉంటాను. నదులలో పడి వెళ్ళేటప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిలో పడి నడిచివెళ్ళేటప్పుడు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చవు.

[3] “ఎందుకంటే నేను యెహోవాను, నీ దేవుణ్ణి, ఇస్రాయేల్ ప్రజల పవిత్రుణ్ణి, నీ రక్షకుణ్ణి. నీకు విడుదల కలిగించే వెలగా ఈజిప్టును ఇచ్చాను. నీకోసం కూషునూ సెబానూ ఇచ్చాను.

[4] నీవు నా దృష్టికి ప్రియుడివి, ఘనుడివి, నీవంటే నాకు ప్రేమ, గనుక నీకు బదులుగా మనుషులను ఇస్తాను. నీ ప్రాణం కోసం జనాలను ఇస్తాను.

[5] నేను నీతో ఉన్నాను, గనుక భయపడకు. తూర్పునుంచి నీ సంతానాన్ని తీసుకువస్తాను. పడమటినుంచి నిన్ను సమకూరుస్తాను.

[6] ‘అప్పగించు’ అని ఉత్తర దిక్కుకు ఆజ్ఞ జారీ చేస్తాను. ‘బిగబట్టకు’ అని దక్షిణానికి ఆజ్ఞాపిస్తాను. దూరంనుంచి నా కొడుకులను తీసుకురా! భూమి కొనలనుంచి నా కూతుళ్ళను తీసుకురా!

[7] నా ఘనతకోసం నేను సృజించి, నా పేరు పెట్టినవారందరినీ తీసుకురా! నేను వారిని రూపొందించి కలిగించినవాణ్ణి.”

[8] కళ్ళు ఉండి కూడా గుడ్డివారుగా ఉన్నవారినీ, చెవులుండి కూడా చెవిటివారుగా ఉన్నవారినీ ముందుకు తీసుకురండి.

[9] జనాలన్నీ సమకూడుతాయి, జాతులన్నీ పోగవుతాయి. వాళ్ళలో ఎవరు ఈ సంగతి తెలియజేశారు? పూర్వం జరిగినవాటిని ఎవరు మాకు ప్రకటించారు? వాళ్ళు యథార్థవంతులని రుజువు చేయడానికి తమ సాక్షులను తేవాలి. లేదా, విని “అది నిజమే” అని ఒప్పుకోవాలి.

[10] యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు నాకు సాక్షులు, నేను ఎన్నుకొన్న నా సేవకులు. మీరు నన్ను తెలుసుకొని నమ్మి, నేనే ఆయననని గ్రహించాలని నా ఉద్దేశం. నాకు మునుపు ఏ దేవుడూ రూపొందలేదు. నా తరువాత ఏ దేవుడూ ఉండడు.

[11] నేను, నేను మాత్రమే యెహోవాను. నేను తప్ప వేరే రక్షకుడు లేడు.

[12] నేనే బయలుపరచినవాణ్ణి, రక్షించినవాణ్ణి, తెలియజేసినవాణ్ణి. నేనే అలా చేశాను, మీమధ్య ఉన్న మరే దేవతా కాదు. నేనే దేవుణ్ణని మీరు నాకు సాక్షులు. ఇది యెహోవా వాక్కు.

[13] అనాది కాలంనుంచి నేనే దేవుణ్ణి. నా చేతిలోనుంచి విడిపించగలవాడెవడూ లేడు. నేను పని చేస్తే దానిని ఎవడు త్రిప్పివేయగలడు?”

[14] ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడూ, మీ విముక్తిదాతా అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “మీకోసం నేను బబులోను మీదికి సైన్యాన్ని పంపుతాను. కల్దీయవాళ్ళు పతనమై, తమ గర్వకారణంగా ఉన్న తమ ఓడలలో పారిపోవడానికి ప్రయత్నించేలా చేస్తాను.

[15] నేను యెహోవాను, మీ పవిత్రుణ్ణి, ఇస్రాయేల్‌ను సృజించినవాణ్ణి, మీ రాజును.”

[16] యెహోవా – సముద్రంలో త్రోవను కలిగించినవాడూ,

[17] మహా జలాలలో దారిని కలగజేసినవాడూ, రథాలనూ, గుర్రాలనూ సైన్యాన్నీ యుద్ధవీరులనూ రప్పించినవాడూ, వాళ్ళంతా ఏకంగా పడి మళ్ళీ లేవలేకుండా నాశనమై వత్తిలాగా ఆరిపోయేలా చేసినవాడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

[18] “మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వం జరిగిన సంగతులను తలచుకోవద్దు.

[19] ఎందుకంటే, నేను క్రొత్త క్రియ చేస్తున్నాను. ఇప్పుడే అది ఆరంభమౌతున్నది. అది మీకు గోచరం కావడం లేదా? నేను అరణ్యంలో త్రోవను కలిగిస్తున్నాను, ఎడారిలో ప్రవాహాలు పారేలా చేస్తున్నాను.

[20] నేను ఎన్నుకొన్న ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్ళు, ఎడారిలో ప్రవాహాలు కలిగించడం చూచి అడవి జంతువులూ నక్కలూ నిప్పుకోళ్ళూ నన్ను గౌరవిస్తాయి.

[21] నాకోసం నేను రూపొందించిన ప్రజ నా కీర్తిని చాటిస్తారు.

[22] “అయితే యాకోబూ! నీవు నాకు ప్రార్థన చేయలేదు. ఇస్రాయేలూ! నా విషయం నీవు విసుగుపడ్డావు.

[23] హోమాలుగా గొర్రెమేకలను నా దగ్గరికి తేలేదు. నీ బలులచేత నన్ను గౌరవించలేదు. నైవేద్యాలు చేయాలని నేను నిన్ను బలవంతం పెట్టలేదు. ధూపం వేయాలని నిన్ను విసికించలేదు.

[24] నాకోసం పరిమళ లవంగ చెక్కకు నీవు డబ్బు ఖర్చు చేయలేదు. నీ బలిపశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు. సరికదా, నీ పాపాలను భారంగా నామీద మోపావు. నీ అపరాధాలచేత నన్ను ఆయాసపెట్టావు.

[25] నేను – నేనే – నాకోసం నీ అక్రమ కార్యాలను తుడిచివేసేవాణ్ణి.

[26] గతాన్ని నాకు జ్ఞాపకం చెయ్యి! మనం కలిసి తర్కించుకుందాం! నీవు నిర్దోషివని నీ రుజువులు చెప్పు!

[27] నీ ఆదిపురుషుడు అపరాధం చేసినవాడే. నీ మధ్యవర్తులు నామీద తిరగబడ్డవారే.

[28] అందుచేత దేవాలయ నాయకులను కూలుస్తాను, యాకోబును శాపానికి గురి చేసి, దూషణపాలు చేస్తాను.

యెషయా — Chapters